ఇస్లాం ప్రకారం మసీదు కేవలం ప్రార్థనా స్థలం మాత్రమే కాదు. అదొక ఆధ్యాత్మిక, మానసిక, సామాజిక, రాజకీయ శిక్షణల కేంద్రం. అందుకే ఆనాడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం మదీనాలో హిజ్రత్ చేసిన తర్వాత మసీదు నిర్మాణానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. మంచి సమాజ నిర్మాణం కోసం, ప్రజల అవసరాలు తీర్చడానికి, ఉమ్మత్ (ముస్లిం సమాజం) బాధలకు పరిష్కారాలు సూచించే సజీవ కేంద్రాలుగా ఆనాడు మసీదులు వెలుగులీనాయి. ముస్లిమేతరులు కూడా ఆనాడు సమస్యల పరిష్కారం కోసం అక్కడికి వచ్చేవారు. మసీదులను నమాజ్‌కు పరిమితం చేయకుండా, మళ్లీ సమాజంలోని అన్ని రంగాల అభివృద్ధికి కేంద్రాలుగా మలచాలి.
ఆధ్యాత్మిక నిలయంగానే కాకుండా సామాజిక శక్తి, సాంస్కృతిక చైతన్యం మసీదుల ద్వారా పెరిగేలా చూడాలి. నేడు ఉమ్మత్ ముందున్న పెద్ద సవాళ్లలో ఇది ప్రధానమైనది. దీనికి వ్యూహాత్మక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. మరోవైపు మహిళలు మసీదులకు వెళ్లడానికి ప్రవక్త అనుమతించారు. స్త్రీలు మసీదులకు వెళ్లకూడదని ఖురాన్‌లోనూ ఎక్కడా ప్రస్తావించలేదు. మహిళలు మసీదుకు వెళ్తుంటే ఆపొద్దని, రాత్రి వేళల్లోనూ వారిని మసీదులోకి అనుమతించాలని ఓ హదీసు చెబుతున్నది. మహిళలు వినయంతో, ధార్మిక చింతనతో మసీదుల్లో ప్రార్థనలు చేయాలని ఖురాన్ బోధిస్తున్నది. ఈ నేపథ్యంలో మసీదుల్లో మహిళలు నమాజులు చేసేందుకు తగిన సౌకర్యాలు ఏర్పాటుచేయాలి.