చూపుల్లో సిగ్గు, బిడియాలు ఉట్టిపడాలి. లజ్జ అనే కాటుక కళ్లలో ప్రతిబింబించాలి. చూపుల బిడియం మనిషికి అత్యంత విలువైన ఆభరణం. చెడు చూపు వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. చూపులను కిందికి వాల్చి ఉంచడం వల్లనే మన హృదయాలు కాంతిరేఖలు అవుతాయి. ఎవరి చూపులైతే కిందికి వాలి ఉంటాయో అలాంటి వారిని ఏ శక్తీ అపమార్గం పట్టించలేదు. అలాంటి వారిని ఎలాంటి ప్రలోభాలు లొంగదీసుకోలేవు అనడానికి నిదర్శనమే ఈ సంఘటన.
ఒకానొకప్పుడు ఉమేర్ బిన్ హబీబీ.. రోమ్‌లో బానిసగా పట్టుబడ్డారు. ఈయన ఆరడుగుల అందగాడు. ఆయన అందచందాలకు ముగ్ధుడైన రోమ్ సర్దారు ఆ యువకుణ్ని లొంగదీసుకునేందుకు ఒక వ్యూహం పన్నాడు. ఒక అందమైన మహలును సిద్ధం చేశాడు. ఆ యువకుణ్ని అందులో బంధించి విలువైన మద్యం, రుచికరమైన మాంసాహారం, అందమైన యువతిని ఏర్పాటుచేశాడు. ఆ యువతి హబీబీని ‘నీ కోరిక తీర్చుకో!’ అన్నట్టుగా రెచ్చగొట్టసాగింది. హబీబీ దించిన తల ఎత్తలేదు. ఇలా మూడురోజులు, మూడు రాత్రులు గడిచాయి. తిండి తిప్పలు లేవు. మూడు రోజుల తర్వాత ఆ యువతి ‘మూడు రోజులుగా ఏమీ తినకుండా ఎందుకింత మొండికేసి కూర్చున్నావు. కనీసం తల ఎత్తి కూడా చూడటం లేదు! అసలు నువ్వెవరు? ఇంత మంచి అవకాశాన్ని ఎందుకు జారవిడుచుకుంటున్నావు?’ అని ప్రశ్నించింది. దానికి హబీబీ ‘నా దేవుడు నన్ను ప్రతిక్షణం చూస్తున్నాడు. నేను ఈ పాడు పని చేసేందుకు సిగ్గుపడుతున్నాను. మూడు రోజులు కాదు ముప్పయ్ రోజులు నువ్విలా నా ముందు కూర్చున్నా నేను ఈ పాడు పని చేయలేను. ఎందుకంటే నా యవ్వనం అల్లాహ్ అప్పగింత. దానిపై మచ్చరానివ్వలేను’ అన్న మాటలకు ఆ యువతి విస్తుపోయింది. ‘నీలాంటి ఆణిముత్యాన్ని నేను చూస్తూ చూస్తూ చంపుకోలేను. నేను ఎలాగైనా నిన్ను ఇక్కడినుంచి బయటపడేస్తాను’ అని చెప్పి అక్కడినుంచి బయటికి వచ్చింది. ఆ రోజు రాత్రి ఆ యువకుడిని అక్కడినుంచి తప్పించింది.
ఇదీ వ్యక్తిత్వమంటే. పరిస్థితులు ఎంతలా ప్రలోభపెట్టినా మన వ్యక్తిత్వాన్ని, మన చూపులు పక్కదారి పట్టరాదు. ‘నువ్వు నీ యవ్వనాన్ని ఎలా గడిపావు’ అన్నది ప్రళయ దినాన అల్లాహ్ అడిగే ఐదు ప్రశ్నల్లో ఒకటి. అందుకే యవ్వన జీవితాన్ని ఎలాంటి మచ్చలేకుండా గడపాలని చెబుతారు పెద్దలు. లజ్జ, సిగ్గు, బిడియం ఇవన్నీ ఇస్లామ్ ధర్మం నైతిక ఆభరణాలని ప్రవక్త చెప్పారు. ‘ఇస్లామ్ ధర్మమనే వృక్షానికి 60కి పైగా కొమ్మలున్నాయి. వ్రీడ (లజ్జ) కూడా విశ్వాసానికి ఒక కొమ్మే’ అనేవారు అందుకే ప్రవక్త (సఅసం). మహాప్రవక్త కాలంలో ఒక వ్యక్తి ఎంతో బిడియస్తుడిగా ఉండేవాడు. దానికి అతని సోదరుడు అతనిపై మండిపడేవాడు. ఇది గమనించిన దైవప్రవక్త (స), ‘అతణ్ని కోపగించుకోకు. ఎందుకంటే సిగ్గుపడటం విశ్వాసంలో అంతర్భాగం’ అని ప్రబోధించారు. ఇస్లామ్ ధర్మం అన్ని రకాల నీతి బాహ్యమైన పనుల నుంచి, దుర్గుణాల నుండి దూరంగా ఉండమని వారిస్తుంది. మనిషిలో సహజంగా ఉండే ఈ సిగ్గు, బిడియాలు మనిషిని అన్ని రకాల చెడులకు దూరంగా ఉంచుతాయి. లజ్జా గుణం మనిషికి ఆభరణం లాంటిదని, దీనివల్ల మనిషికి మేలు మాత్రమే కలుగుతుందని ప్రవక్త హితవుపలికారు. సిగ్గు, బిడియాలు వదిలేసిన నైతికత లేని స్వేచ్ఛ విశృంఖలతకు దారితీస్తుంది. నైతికతే నిజమైన స్వేచ్ఛకు పునాది అని ఉలేమాలు చెబుతారు!