ప్రభువు చుట్టూ ప్రజలు తండోపతండాలుగా ఉండేవారు. ఆయన సన్నిధిలో ఆకలి నిద్రలు మరచి పులకించిపోయేవారు. ప్రభువు పలుకులే వారికి దివ్యౌషధాలు. అలాంటి వారిని అప్పుడప్పుడూ కొందరు అహంకారులు పట్టి పీడించేవారు. వారిపై దౌర్జన్యానికి పాల్పడేవారు. అయినా వారంతా మొక్కవోని ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ప్రభువు దగ్గరే అచంచలమైన దీపాల్లా వెలుగుతుండేవారు. వారిని చూసి జాలిపడిన ప్రభువు.. ‘ఆత్మవిషయమై దీనులైన మీరు ధన్యులు; పరలోకరాజ్యము మీదే’ అని ఊరట కలిగించేవారు.
ప్రభువు కొండమీద కూర్చొని అలా పలుకుతుంటే, చిన్నగా జాలువారే అమృతధారలు వారిలో జీవం ఉప్పొంగించేవి. అలా ఆయన మాటలు దుఃఖపడే వారిని ఓదార్చేవి. నీతి కోసం నిలబడే నైతిక బలమే ఆత్మశక్తిని, తృప్తినీ ఇస్తాయని ప్రభువు వారికి బోధిస్తుండేవారు. ప్రభువు బోధనలు ఆధ్యాత్మిక, భౌతిక, తాత్వికతకు మూలబీజాలుగా ఉండేవి. ఎందరెందరో బాధితుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేసేవి. బాధితుల మనసుకు సాంత్వన చేకూర్చేవి.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024