ఒక ఊర్లో ఓ పోస్ట్‌మ్యాన్ ఉండేవాడు. అతనికి ఆ ఊరి చుట్టుపక్కల చాలామంచి పేరు ఉండేది. అతనికి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడు. ఆ యువకుడు ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి వాళ్లు తన తండ్రిని విపరీతంగా పొడిగేవారు. తండ్రికి అంత మంచి పేరు ఎలా వచ్చిందో యువకుడికి అర్థం కాలేదు. ఒకరోజు పోస్ట్‌మ్యాన్ ఉత్తరాల బట్వాడా కోసం మారుమూల పల్లెకు బయల్దేరాడు. తాను కూడా వెంట వస్తానన్నాడు కొడుకు. ఇద్దరూ కలిసి ఒకే సైకిల్‌పై బయల్దేరారు. ఉత్తరాల బట్వాడా పూర్తయ్యాక.. ఆ పల్లెవాసులు అభిమానంగా పోస్ట్‌మ్యాన్ చేతుల్లో నాలుగు మామిడి పండ్లను పెట్టారు.
కాదనలేక వాటిని సంచిలో వేసుకున్నాడు ఆయన. దారిలో ముఖ పరిచయం లేని వారు కనిపిస్తే సైకిల్ ఆపాడు పోస్ట్‌మ్యాన్. ‘మంచి రుచికరమైన పండ్లు, తీసుకోండి’ అని చెప్పి మామిడిపండ్లను వారికిచ్చాడు. ఆశ్చర్యపోయిన కొడుకు ‘నాన్నా! పరిచయం లేని వ్యక్తులకు పండ్లు ఎందుకు ఇచ్చావు? మనమే తిని ఉండవచ్చు కదా, పోనీ మనకి తెలిసిన వాళ్లకి అయినా ఇవ్వొచ్చు కదా!’ అన్నాడు. దానికి పోస్ట్‌మ్యాన్ చిన్నగా నవ్వి.. ‘నా ఉద్యోగం నేను చేస్తున్నాను. వారు అభిమానంగా ఇచ్చినా వాటిని మనం తీసుకోవడం నాకిష్టం లేదు. వారి బలవంతం వల్ల తీసుకోవలసి వచ్చింది. మనసు కోతిలాంటిది.
అది చాలా కోరుకుంటుంది. ఇలాంటి కానుకలు తెలిసిన వారికి ఇస్తే నా మనసు వారినుంచి అభినందనలు, కృతజ్ఞతలు ఆశించే అవకాశం ఉంది. అంతే కాదు, భవిష్యత్తులో వారు ఏదైనా సహాయం అందిస్తారని నా మనసు కోరుకుంటుంది. వారు మనం ఆశించిన రీతిలో సహాయం చేయకపోతే నిస్పృహకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అదే, నాకు పరిచయం లేని వారైతే వారినుంచి నేను ఏమీ ఆశించను. వారికి కూడా నాపై ఎలాంటి అంచనాలు ఉండవు. అందుకని అలా చేస్తాను’ అని వివరించాడు. తండ్రికి అంత మంచి పేరు ఎలా వచ్చిందో ఈ సంఘటనతో అర్థం చేసుకున్నాడు కొడుకు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821