శివలీలలు చిత్ర విచిత్రాలు. శివుడి రూపాలు అనంతాలు. లింగరూపంలో ఆద్యంత రహితుడిగా ఆవిర్భవించినా, బేసి కన్నులతో బెదరగొట్టినా, జటలు కట్టిన జుట్టుతో కనిపించినా.. శివుడు సుందరుడు. ఆయన ధరించిన ప్రతిరూపానికీ ఓ విశిష్టత కనిపిస్తుంది. ఏ రూపాన్ని కొలిచినా పరిపూర్ణ అనుగ్రహం వర్షిస్తుంది. శివరాత్రి సందర్భంగా.. లింగమూర్తి ధరించిన బహురూపాలను దర్శించుకుందాం.
శివరూపం అనగానే వెంటనే గుర్తొచ్చేది శివలింగం. ఇది పరమేశ్వరుడి నిష్కల రూపానికి ప్రతీక. ‘లిం’ అంటే సృష్టి. ‘గం’ అంటే లయం. ఈ చరాచర సృష్టి ఎక్కడినుంచి మొదలై తిరిగి దేనిలో లయమవుతుందో (కలిసిపోతుందో) అదే శివలింగం. ఈ రూపంలో లింగం శివుడైతే, పీఠం పార్వతీదేవి. కనుక శివశక్తుల సమష్టి రూపం ఇది. అంతేగాక ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి ఉంటారు. అఖండ విశ్వం లింగరూపమని కొనియాడుతూ ‘లింగమధ్యే జగత్ సర్వం’ అన్నాయి ఆగమాలు.
పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ప్రజల్ని పీడించసాగాడు. పార్వతీపరమేశ్వరుల పుత్రుడితోనే తనకు మరణం కలగాలని వరం పొందుతాడు తారకాసురుడు. రోజురోజుకూ పెరిగిపోతున్న అసురుడి ఆగడాలను నిలువరించమని అందరూ శివుణ్ని వేడుకుంటారు. లోకకల్యాణం కోసం పరమేశ్వరుడు హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవిని పరిణయం చేసుకుంటాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ వివాహంలో స్వామి కల్యాణ సుందరమూర్తిగా దర్శనమిస్తాడు.
లోకానికి వెలుగునిచ్చే చంద్రుడు ఒకప్పుడు చీకటిలో మగ్గిపోయాడు. తన మామగారైన దక్షుడు ఇచ్చిన శాపం వల్ల రోజురోజుకూ క్షీణిస్తుంటాడు. భయంకరమైన కుష్ఠు రోగంతో బాధపడుతూ శివుడి గురించి చంద్రుడు ఘోర తపస్సు చేస్తాడు. శివానుగ్రహంతో నెలలో పదిహేను రోజులు పెరిగేట్లూ, పదిహేను రోజుల పాటు తరిగేట్లూ వరం పొందుతాడు. అంతేకాకుండా, ఒక రేఖగా ఎప్పటికీ తరుగుదల లేకుండా శివుడి శిరస్సు మీద ఉండే భాగ్యాన్నీ పొందుతాడు. అప్పటినుంచీ శివుడు చంద్రశేఖరమూర్తిగా నీరాజనాలు అందుకుంటున్నాడు.
తారకాసుర సంహారం కోసం పరమేశ్వరుడు తన రేతస్సును అగ్ని దేవుడికిచ్చి కాపాడమన్నాడు. అగ్ని దానిని తట్టుకోలేక ఒక రెల్లుగడ్డి వనంలో వదిలిపెడతాడు. ఆ శరవనంలో స్కందుడు జన్మిస్తాడు. అతణ్ని ఆరుగురు కృత్తికలు పెంచుతారు. అనంతరం నంది వచ్చి స్కందుడిని కైలాసానికి తీసుకువెళతాడు. తన కుమారుడికి జన్మ రహస్యం (తారకాసురుని సంహరించాలని) చెప్పి, దేవతల సేనానాయకుడిగా నియమిస్తాడు. పార్వతీ సమేతుడై స్కందమూర్తిని మధ్యలో ఉంచుకుని అందరికీ దర్శనమిస్తాడు శివుడు. అదే సోమస్కందమూర్తి రూపం.
పార్వతీపరమేశ్వరులు ఇద్దరూ ఒకే రూపం గలవారనీ, వారిద్దరూ వేర్వేరు కాదనీ తెలిపిన రూపం ఇది. పూర్వం భృంగి అనే భక్తుడు పార్వతీదేవిని విడిచిపెట్టి శివునికి మాత్రమే ప్రదక్షిణలు చేయడంతో పార్వతీదేవి అవమానంతో అలిగి కైలాసం విడిచిపెడుతుంది. గౌతమ మహర్షి ఆశ్రమంలో కఠిన వ్రతం ఆచరించి శివుడి శరీరంలో సగభాగం పొందుతుంది. కుడివైపు శివుడు, ఎడమవైపు అమ్మవారూ ఉండే అర్ధనారీశ్వర మూర్తిని దర్శించుకుంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని విశ్వాసం.
హరిహరుల మధ్య భేదం లేదని తెలిపేందుకు శివుడు ఈ రూపాన్ని ధరించాడు. పూర్వం లోకం అశాంతిగా ఉందని దేవతలంతా విష్ణువు దగ్గరికి వెళ్తారు. శాంతిని ప్రసాదించేవాడు శంకరుడే అని తెలిపి వారితోపాటు విష్ణుమూర్తి కూడా కైలాసం వెళ్తాడు. అక్కడ వారికి శివదర్శనం కాదు. శివుణ్ని చూడాలని దేవతలంతా ఒక వ్రతం ఆచరిస్తారు. విష్ణుమూర్తి హృదయంలోని అక్షయలింగాన్ని కూడా ఆరాధిస్తారు. చివరికి కుడివైపు శివుడు, ఎడమవైపు విష్ణువు కలిసి ఉన్న రూపంలో దర్శనమిస్తాడు శంకరుడు. ఆ స్వామి రూపాన్ని దేవతలంతా హరిహరమూర్తిగా
ఆరాధిస్తారు.
ద్వాపరయుగంలో అర్జునుడిని శివుడు అనుగ్రహించిన రూపం ఇది. పాశుపతాస్త్రం కోసం ఘోర తపస్సు చేస్తున్న అర్జునుడిని పరీక్షించడం కోసం శివుడు ఒక రాక్షసుడిని వరాహంగా మార్చి పంపుతాడు. అది అర్జునుడు తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి వెళ్లి, నానా బీభత్సం సృష్టిస్తుంది. దాన్ని చంపడానికి అర్జునుడు బాణం వేస్తాడు. దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ మరో బాణం కూడా దిగి ఉంటుంది. ఒక బోయవాడు తానే ఈ వరాహాన్ని చంపానంటాడు. తానే చంపానని అర్జునుడు అతనితో వాదనకు దిగుతాడు. వారిద్దరి మధ్య వాదన పెరిగి యుద్ధానికి దారితీస్తుంది. చివరికి అర్జునుడు ఓడిపోతాడు. కిరాతరూపంలో వచ్చింది శివుడని గ్రహించి శరణు వేడతాడు. శివుడు పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడు. ఈవిధంగా అర్జునుడిని అనుగ్రహించిన శివుడే కిరాతమూర్తి.
జలంధరుడు శివుడి మూడోకన్ను నుంచి జన్మించాడు. అతణ్ని సముద్రుడు పెంచుకున్నాడు. ఒకసారి శివుణ్ని దర్శించిన ఇంద్రుడు తనకు పోటీ అయిన శత్రువే లేడని విర్రవీగుతాడు. ఇంద్రుడి గర్వాన్ని జలంధరుడు అణచివేస్తాడు. మృత సంజీవని విద్యతో మరణాన్ని జయించడం తెలుసుకున్న జలంధరుడు మహావిష్ణువు సహా దేవతలందరినీ తన అధీనంలో ఉంచుకుంటాడు. చివరికి శివుడితో తలపడతాడు. పరమేశ్వరుడు జలంధరుణ్ని సంహరించి లోకానికి శాంతి కలిగిస్తాడు. అలా శివుడు జలంధరవధమూర్తిగా పేరొందాడు.
హిరణ్యకశిపుడిని సంహరించడానికి విష్ణుమూర్తి నరసింహ రూపం ధరించి అతణ్ని వధిస్తాడు. కానీ, ఆ ఉగ్రత్వాన్ని ఆపడం ఎవరి తరం కాదు. దేవతలు శివుణ్ని వేడితే వీరభద్రుడిని పంపుతాడు. వీరభద్రుడు ఎంత కోరినా నరసింహుడు ప్రసన్నం కాడు. చివరికి వీరభద్రుడు అతిభయంకరమైన శరభావతారం ధరించి నరసింహుణ్ని నిలువరిస్తాడు. శరభ రూపంలో శివుడు రెండు తలలు, ఎనిమిది కాళ్లు, రెండు రెక్కలతో భయంకరంగా దర్శనమిస్తాడు. శరభమంత్రం పఠించినవారికి శత్రు నాశనం కలుగుతుందని ప్రతీతి.
ఆయన ఒకే పాదం కలవాడు. త్రిమూర్తులకు మూలమైనవాడు. ప్రళయకాలంలో పరమేశ్వరుడు ఈ అవతారం ధరించి సృష్టి చేశాడని పురాణ కథనం. ఈయన నుంచే బ్రహ్మ విష్ణువులు ఆవిర్భవించారు. ఏకాదశరుద్రుల్లో ఏకపాదుడు ఒకరు. కొన్నిసార్లు నాలుగు చేతులతో, మరికొన్ని చోట్ల పదహారు చేతులతో కనిపిస్తాడు. తెలుగునాట కొన్ని దేవాలయాల్లో ఏకపాదమూర్తి రూపం కనిపిస్తుంది. భైరవుడి అవతారానికి ఈ మూర్తి కొనసాగింపు.
ఈయన ఆదిగురువు. పూర్వం వేదాలను పరిపూర్ణంగా అధ్యయనం చేసినా.. మహర్షులకు ఇంకా ఎన్నో సందేహాలు కలుగుతాయి. వాటిని నివృత్తి చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో వారు కైలాసం వెళ్లి శివుణ్ని అభ్యర్థిస్తారు. వారికోసం శివుడు దక్షిణామూర్తి రూపం ధరించి మౌనంతో, చిన్ముద్ర చూపి వారి సందేహాలను తీర్చాడు. ఈయన దక్షిణంవైపు ముఖం ఉంచి మర్రిచెట్టు కింద కూర్చుంటాడు. దక్షిణామూర్తిని ఆరాధించినవారికి విద్య, జ్ఞానం లభిస్తాయి.
– కందుకూరి సత్యబ్రహ్మాచార్య