తిరుమల : రథసప్తమి (Rathasapthami) సందర్భంగా తిరుమలలోని ( Tirumala ) మాడ వీధులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మంగళవారం రథ సప్తమి పురస్కరించుకుని స్వామివారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాల్లో భక్తులను కటాక్షించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం వరకు జరిగిన వాహన సేవలో భక్తులు పాల్గొన్నారు.
మధ్యాహ్నం వరకు సూర్యప్రభ వాహనం, చిన్నశేష వాహనం, గరుడ వాహనంపై (Garudavahanam) మలయప్పస్వామి ఊరేగారు. జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని అర్చకులు వివరించారు.
సూర్యప్రభ వాహనంపై సూర్యనారాయణమూర్తి ని వీక్షించిన భక్తులు అనంతరం స్వామివారి చిద్విలాసాన్ని చిన్నశేష వాహనంపై తిలకించి పులకరించిపోయారు. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తుల నమ్మకమని అర్చకులు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఈవో జె శ్యామల రావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో వి వీరబ్రహ్మం, పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, నన్నపనేని సదాశివరావు, జి.భానుప్రకాష్ రెడ్డి, అధికారులు , తదితరులు పాల్గొన్నారు.