ధనుర్మాస సంతసాన్ని రెట్టింపు చేసే పర్వం వైకుంఠ ఏకాదశి. దక్షిణాయనంలో యోగనిద్రలో ఉన్న మహావిష్ణువు ఈ రోజే మేల్కొంటాడని శాస్త్రం చెబుతున్నది. స్థితికారుడైన శ్రీహరిని మేల్కొల్పడానికీ, ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి తరలివెళ్తారు. ఉత్తర ద్వారం నుంచి పురుషోత్తముణ్ని దర్శించుకొని ఉప్పొంగిపోతారు. దేవతలే కాదు.. ఇలాతలంలో మనుషులు కూడా వైష్ణవాలయాలకు పోటెత్తుతారు. ఉత్తర ద్వారం గుండా వెళ్లి విష్ణుమూర్తి విశేష రూపాన్ని చూసి జన్మ తరించిందన్న భావనకు లోనవుతారు.
ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశులూ ఏదో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నవే! ముక్కోటి ఏకాదశి కూడా విశేషమైనదే. అయితే, ప్రతి ఏకాదశినీ చాంద్రమానం అనుసరించి చేసుకుంటాం. ముక్కోటి ఏకాదశిని మాత్రం సౌరమానం ప్రకారం జరుపుకొంటాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన తర్వాత వచ్చే శుక్ల ఏకాదశిని ‘వైకుంఠ ఏకాదశి’గా చేసుకోవాలని శాస్త్రం నిర్దేశించింది. అందుకే ఈ పర్వం ఒక్కోసారి మార్గశిర మాసంలో, ఒక్కోసారి పుష్యమాసంలో వస్తుంటుంది. ముక్కోటి దేవతలు వైకుంఠ ద్వారంలో మహావిష్ణువును దర్శించుకుంటారు కాబట్టి దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ముందుగా దేవతలకు దర్శనమిచ్చిన శ్రీహరి… ఉత్తర ద్వారం ద్వారానే ప్రయాణించి భూలోకానికి వచ్చాడనీ, మురాసురుడు అనే రాక్షసుణ్ని సంహరించాడని పురాణ కథనం.
ముక్కోటి ఏకాదశి నాడు వేకువ జామునే నిద్రలేవాలి. అవకాశం ఉన్నవాళ్లు నదీస్నానం చేయాలని పెద్దల మాట. లేనిపక్షంలో అభ్యంగన స్నానం ఆచరించి.. వైష్ణవాలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలి. శారీరకంగా ఆరోగ్యం సహకరించిన వారు ఆనాడు పూర్తి ఉపవాసం పాటించాలి. వీలైనంత ఎక్కువ సమయం విష్ణుచింతనలో కాలం గడపాలి. విష్ణుకథలు వినడం, విష్ణునామాన్ని సంకీర్తనం చేస్తూ మనసును దైవానికి సమీపంగా ఉంచే ప్రయత్నం చేయాలి. మర్నాడు ఉదయం విష్ణుపూజ చేసి, అతిథికి భోజనం పెట్టి, ద్వాదశి పారణం (భోజనం) చేయాలి.
మనకు ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఆపై మనసును పదకొండో ఇంద్రియంగా చెప్పారు పెద్దలు. ఈ ఏకాదశ ఇంద్రియాలూ మంచి మార్గంలో ప్రవర్తించడం ‘వైకుంఠ ఏకాదశి’ లక్ష్యం. ‘కుంఠం’ అంటే లోపం. ఏ లోపం లేకుండా ఉండటం అంటే ‘వికుంఠం’. అంటే సక్రమంగా వ్యవహరించటం. పదకొండు ఇంద్రియాలకు వికుంఠ స్థితిని ప్రసాదించే పర్వదినం వైకుంఠ ఏకాదశి. మనసు, ఇంద్రియాలూ, వీటి ప్రవృత్తులు కోటాను కోట్లు. ఆ మనసు సత్వ, రజ, స్తమో గుణాల ప్రకారం పనిచేస్తుంది. ఆ ప్రవృత్తులను ముక్కోటి దేవతలుగా సంకేతరూపంలో చెప్పారు పెద్దలు. ఈ ప్రవృత్తులన్నీ ‘ఉత్తర’ ద్వారం వెంబడి ప్రయాణించడం అంటే ‘యోగసాధన’ అని అర్థం. అలా యోగసాధన సక్రమంగా సాగినప్పుడు కలిగే దివ్యానందమే హృదయంలో కలిగే విష్ణు దర్శనం. ఆనాడు జీవుడి మనః ప్రవృత్తులు ఉన్న మార్గం కన్నా ఉన్నతమైన మార్గంలో ప్రయాణిస్తాయి. అదే ఉత్-తర-ద్వార దర్శనం. ఈ అంతరార్థాన్ని గమనించి ప్రవర్తించిన వేళ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం మొక్కుబడిగా మిగిలిపోక సార్థకం అవుతుంది.
ఏకాదశి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథిగా చెబుతారు. పూర్వం ముర అనే రాక్షసుడితో విష్ణుమూర్తి యుద్ధం చేశాడు. యుద్ధ సమయంలో అలసిపోయిన విష్ణువు కాసేపు నిద్రిస్తాడు. ఇదే అదునుగా విష్ణువును సంహరించడానికి మురాసురుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు దేహం నుంచి ఓ దివ్యతేజస్సు ఆవిర్భవించి, ఆ రాక్షసుణ్ని సంహరిస్తుంది. ఆ రోజు ఏకాదశి కావడంతో, విష్ణుమూర్తి తన తేజస్సును ఏకాదశి అని సంబోధించాడు. తన దేహం నుంచి ఉద్భవించి తనను రక్షించిన ఏకాదశితో మహావిష్ణువు.. ‘మమ భక్తాశ్చ యే లోకాః తవ భక్తాశ్చ యే నరాః త్రిషు లోకేషు విఖ్యాతాః ప్రాప్స్యంతి మమ సన్నిధిం’ అంటాడు. అంటే ఎవరు తనను, ఏకాదశీ దేవిని ఆరాధిస్తారో వాళ్లు ముల్లోకాల్లో కీర్తిని, చివరగా మోక్షాన్ని పొందుతారని వరం ఇస్తాడు. ఏకాదశిని ఆరాధించడం అంటే, ఆ రోజున ఉపవాసం ఆచరించి, భగవత్ ధ్యానంలో సమయం గడపడమే!
దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగా, దక్షిణాయనం రాత్రివేళగా పేర్కొంటారు. ఉత్తర-దక్షిణాయనాలకు సంధిలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా అభివర్ణిస్తారు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశి అత్యంత పవిత్రమైనది. ఆ రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారు. ఈ నేపథ్యంలో శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి, ఉత్తర దిక్కుగా స్వామిని దర్శించి తరిస్తారు.
– శ్రీ భారతి