ఏకాదశి తిథి పావనమైనది. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథులు వస్తుంటాయి. దేనికదే ప్రత్యేకమైనది. జ్యేష్ఠ శుక్ల ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. పద్మ పురాణం 14వ అధ్యాయంలోని ‘క్రియా సాగర సారం’ ఏకాదశి మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రావస్థలో ఉన్న సమయంలో స్వామి దివ్య శరీరం నుంచి ఏకాదశి మూర్తి ఆవిర్భవించింది. సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే ఈ మూర్తి ప్రతి మాసంలో పదకొండో రోజుకు అధిష్ఠాన మూర్తి అయి భక్తులను అనుగ్రహిస్తున్నది.
ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఏకాదశి తిథి ఉపవాసం ఉండి, భగవత్ ధ్యానంలో గడిపిన వారి సకల పాపాలూ తొలగిపోతాయనీ, వైకుంఠం ప్రాప్తిస్తుందని పురాణ వచనం. లోకంలోని జీవులంతా ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించడంతో పాప పురుషుడికి లోకంలో స్థానమే లేకుండా పోయిందట. దీంతో పాప పురుషుడు విష్ణుమూర్తిని శరణువేడి తాను లోకంలో నివసించడానికి ఒక స్థానాన్ని ప్రసాదించమని కోరాడట. అప్పుడు మహావిష్ణువు ‘ముల్లోకాలను పావనం చేసే ఏకాదశి నాడు నువ్వు తృణధాన్యాల్లో నివసించు. అప్పుడు నా స్వరూపమైన ఏకాదశీ దేవి నిన్ను ఆటంకపరచదు’ అని అభయమిచ్చాడట. కాబట్టి, ఏకాదశి తిథినాడు పాప పురుషుడు కొలువుదీరే ఆహారం తినరాదని శాస్త్రం సూచించింది. ఏకాదశి వ్రతం ఆచరణలోని పరమార్థాన్ని హరేకృష్ణ ఉద్యమ సంస్థాపకాచార్యులైన శ్రీల ప్రభుపాదులు వివరిస్తూ.. ‘ఏకాదశి తిథినాడు కేవలం ఆహారాన్ని త్యజించడమే కాదు, వీలైనంత సమయం భగవత్ సేవలో గడపడమే ఉపవాస దీక్షలోని మూల ఉద్దేశం. ఉపవాసం ఆచరించే తిథుల్లో గోవిందుడి లీలలను స్మరించడం, నామ సంకీర్తనం గావించడం మేలైన పనులు’ అని తెలియజేశారు.
ఒకసారి భీముడు వ్యాసమహర్షిని కలిసి.. ‘పితామహా! నా సోదరుడు యుధిష్ఠిరుడు, తల్లి కుంతీదేవి, భార్య ద్రౌపది, ఇతర సోదరులు ప్రతి ఏకాదశి నాడు నియమానుసారంగా పూర్తి ఉపవాసం ఉంటున్నారు. నన్ను కూడా ఉపవాసం ఉండమని చెబుతుంటారు. కానీ, నేను తినకుండా ఉండలేను. వాయుదేవుని కుమారుడిగా సమాన ప్రాణ (జీర్ణవాయువు) ఆకలి నేను భరించలేను. నేను విరివిగా దానధర్మాలు చేయగలను. సకల ఉపచారాలతో కేశవుడిని నిష్ఠగా పూజించగలను. కానీ, ఏడాది పొడవునా నెలలో రెండుసార్లు ఉపవాసం చేయాలంటే మాత్రం నా వల్ల కాదు మరి! నాకు ప్రయోజనాన్ని కలిగించే మరో మార్గమేదైనా ఉంటే తెలియజేయండి’ అని అడిగాడు.
అప్పుడు వ్యాస భగవానుడు “సంవత్సరస్య యా మధ్యే ఏకాదస్యో భవన్తి హి తాషామ్ ఫలమ్ అవాప్నోతి పుత్ర మే న అత్ర సంశయః ఇతి మామ్ కేశవః ప్రాహ శంఖ చక్ర గదాధరః’- పుత్రా ! ‘ఒక సంవత్సరంలోని ఏకాదశిలన్నిటినీ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం కేవలం ఈ నిర్జల ఏకాదశి (జ్యేష్ఠ శుక్ల ఏకాదశి) ఆచరించడం వల్ల కలుగుతుంద’ని సాక్షాత్తుగా శంఖ చక్ర గదాధరుడైన కేశవుడే నాతో స్వయంగా తెలిపాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు’ అని తెలిపాడు. ‘ఆనాడు నువ్వు మంచినీటిని కూడా సేవించక సంపూర్ణ ఉపవాసం ఆచరిస్తే.. ఏడాదిలోని అన్ని ఏకాదశులూ ఉపవాసం ఉన్న ఫలితం వస్తుంద’ని వివరించాడు.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజీ 93969 56984