e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home చింతన నిందా వచనాలే నీరాజనాలు!

నిందా వచనాలే నీరాజనాలు!

దక్షుని నిందా భాషణాలు పైకి అనుచితంగా దూషణాలుగా అనిపించినా అర్ధాంతరంలో- (వ్యాజ స్తుతి అలంకారం- నిందనంలో వందనం) మరో విధంగా సముచితాలై సదాశివునికి ముదావహంగా సద్భూషణాలే అయ్యాయి. అందమైన ఇందు (చంద్ర) కళాధరునికి, ధవళాచల మందిరునికి నింద అనేది ఎందునా కూడా చెందదు. ఎందుకని? అంటే ‘నిర్దోషం హి పరం బ్రహ్మ’ (గీత)- అసలు దోషమనేదే లేని మహాదేవునికి దూషణము ఎలా చెల్లుతుంది?

నిందా వచనాలే నీరాజనాలు!

అన్ని అద్భుతాలకి, ఆశ్చర్యాలకి, వింతలకి విడ్డూరాలకి, వినోదాలకి విషాదాలకి, విరుద్ధ అవిరుద్ధ ధర్మాలకీ బ్రహ్మాండమే నెలవు- నిలయం. మరి ఈ విశ్వ బ్రహ్మాండమే విశ్వనాథునికి విరాట్‌- స్థూల శరీరం. అందుకే, ఆయనలో అమృతమూ ఉంది, హాలాహలమూ ఉంది. అగ్నీ ఉంది, అంబువులూ (జలాలు) ఉన్నాయి. భస్మమూ ఉంది, భూతి (ఐశ్వర్యం) ఉంది. రజతాద్రి శృంగంలోని రసానంద తరంగమూ ఆయనే! భద్రమైన రుద్రభూమిలోని మరణ మృదంగమూ ఆయనే!

విశ్వేశుని చరితం మహావిచిత్రం. అది లోకవిరుద్ధంగా లోచనాలకు గోచరించినా లోకానికి అతీతం- లోకోత్తరం! మహిమ తెలియ లేని మందబుద్ధులే మహాత్ముల చరిత్రను చర్విత చర్వణంగా ద్వేషించి దూషిస్తారు. విశ్వేశ్వరుని భిక్షుకత్వం- దారిద్య్రం, శ్మశానాశ్రయం, భయంకరాకృతి ఇత్యాదులు స్వీకృత- కావాలని స్వీకరించిన లీలా వేషాలు, విశేషాలు. వీటికి విరుద్ధంగా సర్వేశ్వరత్వం, సదాశివత్వం, సురుచిర సుందర సౌమ్య స్వరూపం, పరమ దాతృత్వం, చిదంబరత్వం మొదలైనవి నిత్యమైన, సత్య-శివ-సుందరుడైన అజుని-శివుని నిజరూపాలు. ఎంత వైరాగ్యవంతుడైనా ఇంత అమంగళ వేషమా? అని అనిపిస్తుంది మనకు. దక్షుని దుర్వచనాలు నిటలాక్షుని (ముక్కంటి) నిజరూపాలకు నిర్వచనాలు, నిదర్శనాలు. పూత మనస్కుడు పోతన మహాకవి అశివరూపుని శివత్వాన్ని- మంగళత్వాన్ని పై సీసపద్యంలో రాత రూపంగా పోత పోసి ఎలా రూపు దిద్దాడో నిరూపిద్దాం.

శివుడు లుప్తక్రియా కలాపుడు- నిష్క్రియుడు, శాంతరూపుడైన పరబ్రహ్మ స్వరూపుడు కాన క్రియా సంబంధం లేనివాడు. ఆప్తకాముడు-నిష్కాముడు, ఆత్మారాముడు కనుక కర్తవ్య కర్మల, వాని ఫలాల జంజాటం లేనివాడు. మానహీనుడు- మానావమానాలు దేహాభిమానులకే కాని దేహాత్మబుద్ధి లేని దేవదేవునికి, మహాదేవునికి ఉండవు. మానం అంటే కొలత. అభవుడు అప్రమేయుడు-కొలతలకు అందనివాడు. అయితే, భక్తితో కొలిచే వారి కలతలు, కొఱతలు తీర్చి, కోరికలు కూర్చేవాడు. మర్యాద లేనివాడు-మర్యాద అంటే హద్దు, పరిచ్ఛిన్నత- పరిమితి. ‘విభుం వ్యాపకం బ్రహ్మ’- సర్వత్ర- అంతటా వ్యాపించి ఉన్నవానికి హద్దులు, పద్దులూ ఎలా ఉంటాయి? కనుక, అపరిచ్ఛిన్నుడు. కాని, ‘ధర్మేణ హీనాః పశుభిః సమానాః’- ధర్మాన్ని అతిక్రమిస్తూ దొంగమేతలు మేసే ఎద్దు- మొద్దు స్వరూపాలను, మానవ మృగాలను మాత్రం వద్దన్నా వదలడు. మత్త ప్రచారుడు- స్వాత్మానందంలో, స్వరూపానందంలో మత్తుడై సంచరించేవాడు. లేక, పరమ భాగవతుడైన పోతనవలె ఇష్ట దైవమైన శ్రీరామప్రభువు యొక్క ధ్యాననిష్ఠలో మైమరచి మెలుగువాడు. ‘వైష్ణవానాం యథా శంభుః’-‘పరమేశ్వరుడు పరమ వైష్ణవులలో ప్రథమ గణ్యుడు’ అని భాగవత వచనం.

ఉన్మత్త ప్రియుడు- భక్తి అనే అమృతాన్ని ఆస్వాదించి మత్తులైన భక్తులకు ప్రియమైనవాడు. అట్టి భక్తులయందు మిక్కిలి మక్కువ చూపేవాడు. మూలంలో దక్షుడు ‘ఉన్మత్తవత్‌’ అనగా, ‘పిచ్చివాని వలె’ అని అన్నాడేగాని నిశ్చయార్థంలో- నిజంగా ‘ఉన్మత్తః’ పిచ్చివాడు అని అనకపోవడం గమనార్హం. దిగంబరుడు- ‘వస్త్రం విశ్వోదరస్య చ’- విశ్వాన్ని ఉదరంలో ఉంచుకున్న వానికి ఏ వస్త్రం సమర్పించగలం? విశ్వమంతా ఆయన స్వరూపమే కాన దిక్కులే అంబరం- వస్త్రంగా కలవాడు. నిర్గుణుడు, నిరుపాధికుడు- స్థూల, సూక్ష్మ, కారణాలనే శరీరత్రయం లేనివాడు. శరీరమే లేనప్పుడు వస్త్ర ప్రసక్తే లేదు గదా! ‘దివ్యాయ దేహాయ దిగంబరాయ’- ఈ దిగంబరత్వం ‘దైహిక’ అనగా శారీరకమైన నగ్నత్వం కాదు; దివ్యము, పారమార్థికము. ఈశ్వరుడు నిరావరణుడు- ఆవరణ, ఆచ్ఛాదన లేనివాడని పరమార్థం. భూత ప్రేత పరివృతుడు- లోకంలో అందరికీ అందం, అంగసౌష్ఠవం ఉండవు. పూర్వకర్మ ఫలంగా ఎందరో మానసిక, శారీరక వైకల్యం కలవారు, వికలాంగులు- కుంటి, గుడ్డి, అవిటి, వికృతరూపులు ఉన్నారు. ‘జగతః పితరౌ వందే’- వీరంతా శివ సంతానమే కదా! కరుణామూర్తి కపర్ది (శివుడు) వీరందరినీ తన వారుగా స్వీకరించి ఆక్కున చేర్చుకుంటాడు. ‘సర్వ భూతపతి’- కాన వీరిని వెంట వేసుకు ఊరేగుతుంటాడు కొండంత అండగా.

తామస ప్రమథ భూతములకు నాథుడు- తామసికులు అనగా తమోగుణంతో నిండి అంధులైన వారిని కూడ స్వీకరించి, సంస్కరించి, రక్షించే వాత్సల్య పూర్ణుడు. ఈ పిశాచ చర్య పరవైరాగ్యాన్ని బోధించేది. భూతి లిప్తుండు- జ్ఞానమనే అగ్నిలో దృశ్య జగత్తు దగ్ధం కాగా శేషించిన భస్మాన్ని లీలావినోదంగా మైపూతగా చేకొన్నవాడు. ముత్యాలు దగ్ధం కాగా మిగిలేది ముత్య భస్మం- ముత్యాలసారం. సంసారం భస్మం కాగా శేషించేదే సంసార సారం. అదే ‘కర్పూర గౌరం (తెల్లని), కరుణావతారం, భజగేంద్ర హారం’ అయిన ‘శివం’. చితాభస్మం జ్ఞాన వైరాగ్యాలకు చిహ్నం. వినాశశీలమైన విశ్వంలో అవినాశి అయిన విశ్వేశ్వరుని హరుని వరించి, తరించమని హెచ్చరిక.

అస్థి భూషణుండు- మరణ శీలుడైన మానసప్రాణికి ప్రతి క్షణం మృత్యువును జ్ఞాపకం చేస్తూ ‘మూణ్ణాళ్ల ముచ్చటకై మిడిసి పడి పాపం మూట కట్టుకొని చేటు తెచ్చుకోమాక’ అని తెలియ చెప్పడమే మెడలో అస్థిమాల- ఎముకల దండ ధరించడంలో పరమార్థం. నష్టశౌచుండు- విధి, నిషేధాలకు అతీతుడు కాన శౌచ-అశౌచాలు లేనివాడు. కర్మ భ్రష్టులై నష్టపోయిన వారినికూడా శుద్ధి పరచి సద్బుద్ధి కల్గించేవాడు- నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపుడు. ఉన్మద నాథుడు- మతి లేనివారికి అధిపతి అని శబ్దార్థం. ‘పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి’- ‘సా బుద్ధిః విమలేందు శంఖ ధవళా యా మాధవ వ్యాపినీ’- ప్రాపంచిక విషయ వ్యవహార వ్యామోహంలో పడి కొట్టుకుపోకుండా పరమాత్మ యందు లగ్నమైన, శుద్ధ సత్తపూర్ణమై అనన్య భక్తి మయాలైన బుద్ధులు-మతులు కల్గిన వారిని రక్షించి మోక్షమిచ్చువాడు. దుష్టహృదయుడు- దుష్టులను కూడా శిష్టులుగా సంస్కరించాలన్న దయతో కూడిన హృదయం కలవాడు. ‘దుర్జనః సజ్జనో భూయాత్‌’ అని సంకల్పించే సహృదయుడు. ఉగ్రుడు- లయకారుడు, సంహర్త కనుక ఉగ్రత్వం, కాఠిన్యం సహజం. అయినా, దుష్టులకు ఉగ్రుడు, దూరుడు. శిష్టులకు సౌమ్యుడు- ఇష్టుడు. త్య్రంబకుడు- ముక్కంటి తమోగుణ నియంతే కాని తమస్సుకు తలవంచేవాడు కాదు. కారణం? స్వరూపతః త్రిగుణాలకు అతీతుడు కనుక. తమోగుణాన్ని నియంత్రించడం కఠినం. కాన, కరుణామయుడు వజ్రకఠోరుడు కూడా.

పరేత భూ నికేతనుడు- శివుడు శ్మశానవాసి. ఆయనకు కైలాస వాసం, కాటి నివాసం- రెండూ సమానమే. ‘ప్రేత భూమి నిలయో‚ పి పవిత్రః’- అయినా ‘స్పటిక మణి నిభం’- స్పటికం లాగా అచ్ఛమైన, స్వచ్ఛమైనవాడు. జ్ఞానానికి ఆధారం వైరాగ్యం. వైరాగ్యానికి ఆధారం వల్లకాడు. పరమశివునిపై ప్రేమ-భక్తితో మనస్సును ప్రేతభూమిగా మలచుకోగలిగితే చాలు, భూతనాథుడు అందు వసించి, భవ (సంసార) భీతిని పోగొట్టి శాశ్వతానందానుభూతిని ప్రసాదిస్తాడు. అశివుడు- ‘నాస్తి శివః యస్మాత్‌’- ఇతనిని మించిన శివకరుడు, శుభంకరుడు, అభయంకరుడు మరొకడు లేడు.

వేదంబు శూద్రున కిచ్చినటులు- మానవ కన్య అయిన సతీదేవిని ఈ మహేశ్వరునికి అర్థాంగిగా అయోగ్యురాలని తెలిసి కూడా, అర్థం (ధనం) మీద ఆశకొద్దీ అనర్హునికి వేదం ఇచ్చినట్లు, సిగ్గు పడుతూ అంతటి గొప్ప సంబంధం మీది లోభం చేత అయిష్టంగానే ‘శోకం ద్రావయతి ఇతి శూద్రః’ (శ్రీధరస్వామి భాష్యం)- సంసార శోకాన్ని హరించే ఈ ‘స్మర హరు’నికి (కాముని కాల్చిన వానికి), ఆత్మారామునికి నా ఆత్మజ (బిడ్డ)ను ఇచ్చాను. కాన, ‘ఈ మహాదేవునికి ఇతర దేవతలతో పాటుగా కాక అందరికంటె ముందుగానే యజ్ఞాలలో హవిర్భాగం సమర్పింపబడుగాక!’ అని దక్షుని శాపరూప వరం.
(సశేషం)

తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిందా వచనాలే నీరాజనాలు!

ట్రెండింగ్‌

Advertisement