న తీర్థ సేవీ నిత్యం స్యాత్
న ఉపవాస పరో యతిః
(నారద పరివ్రాజక ఉపనిషత్తు-10)
యతి తీర్థయాత్రలు ఎప్పుడూ చేయకూడదు. ఉపవాస దీక్షలు కూడా సర్వదా పనికిరాదు అని ఇందులోని భావం. లక్ష్మీబాయి షిండే అనే ఒక మహిళ శిరిడీ సాయి దగ్గరికి ప్రతిరోజు వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో సేవించుకునేది. ఒకనాడు ఆమె చాలా బలహీనంగా కనిపించింది. అయినా సేవ చేయడానికి వచ్చింది. బాబా కారణం అడిగాడు. ‘మీ ఆశీర్వాదం కోసం ఉపవాసం చేస్తున్నాన’ని ఆమె గొప్పగా చెప్పింది. బాబా చిన్నగా నవ్వి.. ‘నా ఆశీర్వాదం కోసం ఉపవాసం చేయమని.. నేను చెప్పానా? ఉపవాసం నాకు అక్కర్లేదు. నువ్వు ఆకలితో బాధపడితే నాకు సంతోషమా! నీ ఆరోగ్యమే నాకు ముఖ్యం’ అని తన చేతిలోని ప్రసాదాన్ని ఆమెకు ఇచ్చి ‘తిను. బలంగా ఉండు.
సత్కర్మలు చెయ్యి. అదే నిజమైన వ్రతం. దయ, సేవ, నిజాయతీ ఇవే నా పూజలు’ అన్నాడు. బాబా మాటలకు లక్ష్మీబాయి ఎంతో సంతోషించింది. ‘భక్తి అంటే శరీరానికి కష్టం కాదు.. మనసుకు శుద్ధి’ అనేది బాబా అభిమతమని అర్థమైంది. లక్ష్మీబాయి షిండే ప్రతిరోజూ పాలల్లో నానబెట్టిన రొట్టె బాబాకు సమర్పించుకునేది. అలా జీవితాంతమూ చేసింది. బాబా ఆమెను లక్ష్మీమా అని పిలిచేవారు. ధన్యురాలైన ఆమెకు బాబా సమాధి చెందేటప్పుడు 9 నాణేలను ప్రసాదించాడు. వాటిని నవవిధ భక్తులుగా పరిగణిస్తారు. 115 ఏండ్లు జీవించిన లక్ష్మీబాయి 1993లో కన్నుమూసింది.
– డా॥ వెలుదండ సత్యనారాయణ