శుకయోగి పరీక్షిత్తుతో… రాజా! సరాముడైన శ్యాముడు ధనుశ్శాలకు వెళ్లి వామహస్తంతో ధనుస్సును పైకెత్తి, అల్లెత్రాడు బిగించి, వేదండం- ఏనుగు ఇక్షుదండాన్ని- చెరకు గడను వలె, రెండుగా విరిచాడు. ఆ ధ్వని వీనులకు భయంకరమై కంసుని ధైర్యాన్ని భేదించింది. మీదికి వచ్చిన చాప రక్షకులను రామకృష్ణులిద్దరూ చెరో వింటి తుంట పట్టుకొని కొట్టి మట్టుబెట్టారు. ఇలా మథురా నగరంలో కడు వేడుకతో విహరించి సోదరులు తమ విడుదులకు విచ్చేశారు. ఈ సందర్భంలో అమాత్యుడు చేసిన సూర్యాస్తమయ చంద్రోదయ వర్ణనలు సహృదయ హృదయాహ్లాదకరంగా, సరసంగా సాగినై. ఇందు- చంద్ర ఉదయానికి ముకుళించు కొన్న ఇందీవరాలను- అరవిందాలను (పద్మాలను) ఎంత హృదయంగమంగా ఉత్ప్రేక్షించి వర్ణించాడో వీక్షించండి…
ఆ॥ ‘కళలు కలుగుగాక, కమల తోడగుగాక
శివుని మౌళి మీద జేరుగాక
నన్యునొల్ల దపనుడైన మత్పతియని
సాధ్వి భంగి గమల జాతి మొగిడె’.
తాను కళాధరుడు (చంద్రుడు)- కళలు ధరించిన వాడగు గాక, కమలాలయ- లక్ష్మికి తోబుట్టువగు గాక, సెగకంటి (శివుని) శిగ (తల) నెక్కి నిక్కుగాక, ఇంతవాడైనా అన్యుడైన చందురుని పొత్తు మాకు ఎంతమాత్రమూ అక్కర లేదు. తపనుడు- తపింప జేసేవాడైనప్పటికీ మా పతి తరణి- సూర్యుడే అని ఉత్తమురాలైన నాతి- పతివ్రత స్త్రీ వలె పద్మినీ జాతి మూతి ముడుచుకొందిట! ఆటవెలది ఐనా పై పద్యంలో ‘సతీధర్మం’ చాలా తేటగా- ఇల్లాలికి దీటైన బాటగా అప్రతిహతంగా నిరూపితమైంది. పోతన గావించిన ఇలాంటి వర్ణనలే భావి ప్రబంధ కవులకు ‘మేలుబంతి’ అయ్యాయి.
శుకుడు- రాజా! ఆ రాత్రి క్రూరుడైన భోజపతి కంసునికి ఓజ (శోభ, వికాసం) చెడి నిద్ర పట్టలేదు. దారుణమైన దుశ్శకునాలు చూచాడు. మృతికి హేతువైన భీతితో అతని మతి అతిగా కలత చెందింది. మరునాడు మల్లయుద్ధానికి సిద్ధమైన రంగంలో కంసుడు ఎత్తయిన మంచెపై మనసులో ఇంచుకైనా శాంతి లేకుండా కూర్చున్నాడు. నందాదులు కంసుని అనుజ్ఞతో ఉన్నత ఆసనాలను అలంకరించారు. రామకృష్ణులు రంగస్థలం ప్రవేశ ద్వారం వద్ద వేచి ఉన్న, తొండంతో కొండలను కూడా పిండి చేయగల ‘కువలయాపీడమ’నే మత్త వేదండాన్ని- ఏనుగును చూచి సమీపించారు. అంత, మావటి మురభంజను- కృష్ణునిపై ఆ కుంజరాన్ని ఢీ కొలిపాడు. కువలయాపీడం- భూ వలయాన్ని- మానవజాతిని మిక్కిలిగా పీడించే మద, మోహ, దర్పాలకు చక్కని ప్రతీకం.
ఈ ప్రసంగంలో కువలయాపీడ పుష్కరి (ఏనుగు)కి, అరిభయంకరుడైన పుష్కరేక్షణుడు హరికి మధ్య జరిగిన దుష్కరమైన పోరుని, వీర, భయానక, అద్భుత రసాలు ముప్పిరిగొనగా విద్యాదయితుడు పోతన హృద్యమైన గద్యలో పద్య పరిమళాన్ని గుబాళింపజేస్తూ వింగడించాడు. యదుసింహుడు ఆ మద కరీంద్రాన్ని తన పద తాడనం చే మర్దించాడు. మదించిన ఆ ఎక్కుడు మెకము (ఏనుగు), మొక్కవోని ముక్కంటి (రుద్రుని) భల్లం (బాణం) చే భగ్నమైన (త్రిపురాసుర) పురంలాగా, బక్కచిక్కి స్రుక్కి- సొమ్మసిల్లి పోయింది. గోవిందుడు చేతితో దాని దంతాలు ఊడబెరికి బాది దాన్ని చంపాడు. చెంతనుండి చూచు వారందరికీ వింత గొలుపగా అనంతుడు ఆ దంతాలతోనే దంతి పాలకులను- మావటులను అంతకుని లోకానికి పంపాడు. ఆపై వల్లవ- గోపకుమారులు రామకృష్ణులు ఉల్లాసంగా మల్ల భూమిని తిలకించారు.
సీ॥ ‘మహిత రౌద్రంబున మల్లుర కశనియై
నరుల కద్భుతముగ నాథుడగుచు
శృంగారమున బుర స్త్రీలకు గాముడై
నిజ మృత్యువై కంసునికి భయముగ
మూఢులు బీభత్సమును బొంద వికటుడై
తండ్రికి దయరాగ దనయుడగుచు
ఖలులకు విరసంబుగా దండియై గోప
కులకు హాస్యంబుగా గులజుడగుచు
ఆ॥ బాంధవులకు బ్రేమ భాసిల్ల వేలుపై
శాంత మొనర యోగి జనుల కెల్ల
పరమ తత్తమగుచు భాసిల్లె బలునితో
మాధవుండు రంగ మధ్యమందు.’
బాదరాయణి శుకయోగి… రాజా! మల్ల రంగం మధ్య గోదా- అఖాడా (మల్లులు పోరాడే స్థలం)లో శృంగారాది సర్వరస కదంబమూర్తియైన త్రిభంగీ స్వరూపుడు దామోదరుడు తనను దర్శించిన వ్యక్తుల మనోభావాన్ని అనుసరించి వారికి ఆ రూపంగానే కనిపించాడు. మల్లురకు రౌద్రరసంతో వజ్రాయుధంగా, అద్భుత రసంతో ప్రజలకు ప్రభువుగా, శృంగార రసంతో చంద్రవదన (పౌరవనిత)లకు మూర్తిమంతమైన మదను- మన్మథునిగా, భయానక రసంతో కంసునికి మృత్యువుగా, బీభత్స రసంతో మూర్ఖులకు వికటమైన వానిగా, కరుణ రసంతో తండ్రికి కన్న కొడుకుగా, వీరరసంతో దుర్మార్గులను దండించేవానిగా, హాస్యరసంతో గోపకులకు కులదీపకునిగా, ప్రేమరసంతో బంధువులకు పరమాత్మగా, శాంతరసంతో యోగిజనులకు పరబ్రహ్మ స్వరూపునిగానూ భాసిల్లాడు. ఆ సమయంలో చచ్చిన కువలయాపీడాన్ని, వచ్చిన రామకృష్ణులనూ చూచి కంసుడు నొచ్చిన చిత్తంతో మిక్కిలి భయపడ్డాడు. వ్రజనాథుని చూచి ప్రజలందరూ ‘మనుజ మాత్రుండె తలపోయ మాధవుండు’… ఆలోచింపగా దనుజ మర్దనుడు మనుజమాత్రుడు- సామాన్య మానవుడు కాదు అని తలపోశారు.
శుకుడు- రాజా! ఆనాడే మల్ల యుద్ధ క్రీడల మహోత్సవం. ప్రజల దృష్టిలో దానికి వినోదమే ప్రయోజనం. కానీ, చాణూర ముష్టికులచే నందుని పట్టిని మట్టుబెట్టించడం పాలకుడైన కంసుని పరమార్థం. శ్రీకృష్ణ చాణూర సంభాషణని పోతన నాటకీయ శైలిలో చాల రమణీయంగా వర్ణించాడు. కృష్ణరాములిద్దరూ ఆ జెట్టీలను ఘోరమైన తమ ముష్టిఘాతాలతో మట్టికరిపించారు. బలుడు ముష్టికుని మిత్రులైన కూట, తోశల, శలులను కూడా తలలు బద్దలుకొట్టి కాలుని వద్దకు పంపాడు. ఈ లోకమెల్ల ఒక మల్లరంగం. కామక్రోధాలే చాణూర ముష్టికులు. సాధకులందరూ బాధకులైన ఈ మల్లురతో, బల్లిదు (బలవంతు)లతో ఎల్లకాలం- జీవితాంతం పోరాడుతూనే ఉండాలి. ఇవి అనాదిగా జీవులను పట్టి పల్లార్చుతూనే ఉన్నాయి. ఈ దనుజులను దునుమాడటమే మనుజావతార- మానవ జన్మ ప్రయోజనం!
ఆపై యదుకుల సింహ కిశోరుడు హరి కంసుని సంహరింప సన్నద్ధుడై యుద్ధోత్సాహంతో గురిచూచి మంచె మీదికి దూకాడు. పక్షిరాజు గరుత్మంతుడు పామును పట్టే విధంగా పంకజాక్షుడు జగజెట్టి కృష్ణుడు కంసుని జుట్టు ముడి పట్టుకొని మల్లభూమి మీదికి పడదోశాడు. క్షాత్రకులావతంసుడైన కంసుడు అక్కడే ఎట్టి కదలిక లేక కట్టెలాగ బిగుసుకు పోయాడు. ఓ పరీక్షిన్మహా రాజా!
క॥ ‘రోష ప్రమోద నిద్రా
భాషాశన పాన గతుల బాయక చక్రిన్
దోషగతి జూచియైన వి
శేష గతిన్ గంసుడతని జెందె నరేంద్రా!’
కంసుడు రోషంలో, సంతోషంలో, నిద్రలో, సంభాషణ భోజన సమయాల్లో, క్షీర నీర తక్ర (మజ్జిగ) మొదలైన పానీయాలు సేవించే వేళల్లో చక్రపాణి కృష్ణుని వక్రగతి- ద్వేష దోషబుద్ధితోనే చూచాడు. అయినా ఈ నిరంతర ధ్యాన- చింతన ఫలంగా వానికి, మహాయోగులకు, తాపసులకు కూడా దుర్లభమైన సారూప్యముక్తి లభించింది. కంసుని సోదరులు న్యగ్రోధాదులు ఆగ్రహోదగ్రులై కృష్ణుని మీదికి విజృంభించగా బలుడు వారిని బలి తీసుకొన్నాడు. బ్రహ్మాది దేవతలు పూలు జల్లులు కురిపించారు. దేవ దుందుభులు మ్రోగాయి. దేవాంగనలు నాట్యమాడారు. జరాసంధుని పుత్రికలు, కంసపత్నులు- అస్తి, ప్రాప్తి తలలు బాదుకుంటూ…
క॥ ‘భూతముల కెగ్గు సేసిన
భూతంబులు నీకు నెగ్గు బుట్టించె వృధా
భూతమగు మనికి యెల్లను
భూతద్రోహికిని శుభము బొంద దధీశా!’
‘నాథా! ప్రాణులను నీవు పీడించగా ఆ ప్రాణులే నీకు కీడు చేశాయి. భూతము- ప్రాణులకు ద్రోహం చేసిన వానికి ఎప్పటికీ హితం- మేలు కలుగదు. జీవితం హతాహతం- వ్యర్థమై పోతుంది. కోపతాపాలు, పాపాలు వీడి గోపాలకృష్ణుని సేవించి ఉంటే ఎంత బాగుండేది?’ అంటూ రోదించారు. ఇలా విలపిస్తూన్న ఇల్లాండ్రను ఓదార్చి కృష్ణుడు కంసాదులకు పరలోక సంస్కారాలు చేయించాడు. కంసుడు అభిమాన- దేహాత్మ బుద్ధి స్వరూపుడు. రోజంతా ‘అస్తి- ఉన్నది, ప్రాప్తి- ఇకముందు పొందనున్నది’ అన్న ఆలోచనతో, ఆ మోజుతో గడుపువాడే భోజపతి కంసుడు.
అనంతరం నందనందనుడు తల్లిదండ్రుల- దేవకీ వసుదేవుల బంధనాలు విడిపించి బలరామునితో కూడి వారికి వందనాలు చేశాడు. ‘తమ పుత్రులు సర్వలోక ప్రభువులే!’ అన్న వారి ఎఱుకను ఉరుక్రముడు మరుక్షణమే మాయను ప్రయోగించి తొలగించాడు. కన్నయ్య వినయ వినమ్రుడై ఇలా అన్నాడు… అమ్మా! నాన్నా! మీరు మమ్ము కన్నారే కానీ, లాలించి పాలించే భాగ్యానికి నోచుకున్నారు కాదు. మీ ఒడిలో బుజ్జగింపులతో కలివిడిగా ఎదిగే సుడి- అదృష్టం ఈ బుడతలకి ఇన్నాళ్లూ లేకపోయింది. పురుషార్థ సాధకాలైన మా ఈ శరీరాలకు కర్తలు మీరే కదా! ఎన్ని ఏళ్లకైనా మీ ఋణం తీర్చుకోలేము.
క॥ ‘చెల్లుబడి గలిగి యెవ్వడు
తల్లికి దండ్రికిని దేహధనముల వృత్తుల్
సెల్లింప డట్టి కష్టుడు
ప్రల్లదుడా మీద నాత్మ పలలాశి యగున్.’
చెల్లుబడి- సమర్థత ఉండి కూడా తన తను(శరీరం) మన ధనములతో తల్లిదండ్రులను సేవించని వాడు కష్టుడు, దుష్టుడు, భ్రష్టుడు, నికృష్టుడూనూ. వాడు మరణించి పరలోకాన తన తరసాన్నే- మాంసాన్నే తింటాడు.
క॥ ‘జననీ జనకుల వృద్ధుల
దనయుల గురు విప్రసాధు దారాదులనే
జనుడు ఘనుడయ్యు బ్రోవక
వనరును జీవన్మృతుండు వాడు ధరిత్రిన్.’
‘ఏ మానవుడు మాతా పితరులను, వయోవృద్ధులను, కన్నబిడ్డలను, గురువులను, బ్రాహ్మణులను, సాధు సంతులను, అర్ధాంగి మొదలైన వారిని శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నా పోషింపక, దీనాలాపాలు ఆడుతూ దేబరించే- యాచించే వాడు ఈ ధరణిపై బ్రతికి ఉన్నా మృతి చెందినవాడే!’ అదీకాక, జననీ జనకులారా! కంసుడు మిమ్ములను కారాగృహంలో ఉంచి బాధిస్తున్నా, సామర్థ్యం ఉండికూడా వానిని వారించని నిర్దయులం, క్రూరులం, కపటులం. క్షమాశీలులారా! మా లోపాలు- తప్పులు ఓర్చి మమ్ము క్షమించండి, అక్కున చేర్చుకోండి.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006