శుక యోగి ఏలిక పరీక్షిత్తుతో- రాజా! ఒకనాడు భీష్మక పుత్రిక రుక్మిణీదేవి నగరి- భవనంలో జగదీశ్వరుడు పన్నగశాయి నల్లనయ్య వెన్నల వలె తెల్లనైన పానుపుపై సుఖాసీనుడై శోభిల్లుతున్నాడు. ఆ శిఖిపింఛమౌళిని రుక్మిణి, ఆమె సఖులు సేవిస్తున్నారు. రమా భగవతి అంశభవయైన ఆ జవరాలు భైష్మీసతి, పతికి అనురూపవతియై అనేక లీలావతారాలు ధరిస్తూ ఉంటుంది. సౌభాగ్యవతియైన వైదర్భి- రుక్మిణిని చూచి శ్రీగర్భుడు హరి దరహాసం- చిరునవ్వు చిందిస్తూ ఆ వరవర్ణినితో చిలిపిగా కొన్ని ఛలోక్తులాడి- నిష్ఠూరాలు పలికి, ఆమె విస్తుపోయి విలవిల్లాడుతుండగా తాను అల్లిబిల్లి ఆటగా వినోదించాలని అనుకొన్నాడు. మురళీధరుడు ఇలా అన్నాడు.. ఓ ఇందుముఖీ! నీవు సద్గుణవతివే గానీ అతి మందమతివి. ఎందుకని అంటావేమో!.. కులంలో, బలంలో, భోగంలో, త్యాగంలో, సంపదలో, సద్గుణాలలో, వీర్యంలో, శౌర్యంలో దిక్పాలకుల కన్నా చైద్యా- శిశుపాలాదులు మిన్న- ఘనులు, పరిపూర్ణులు. శశివదనా! అట్టి చేదిభూపాలుని- శిశుపాలుని పసిబాలునిగా ఎంచి త్రోసిరాజని- కాదని, ఇలలో రాజులకు భయపడి జలధి- సాగర గర్భంలో తలదాచుకున్న బలహీనుడనైన నన్ను, ఓ లలనా! నీవేల వలచావు? నీకు అనువు- అర్హము కాని నాతో మనువు ఎందుకాడావు?
సీ॥ ‘లోకుల నడవడిలోని వారము గాము
పరులకు మా జాడ బయలు పడదు
బలమదోపేతులు పగగొండ్రు మా తోడ
రాజపీఠములకు రాము తరచు
శరణంబు మాకు నీ జలరాశి సతతంబు
నిష్కించనుల మేము నిధులు లేవు
కలవారు చుట్టాలు గారు నిష్కించన
జనబంధులము ముక్త సంగ్రహులము’
ఆ॥ ‘గూఢ వర్తనులము, గుణ హీనులము, భిక్షు
లైనవారి గాని నాశ్రయింప
మిందుముఖులు దగుల రిటువంటి మముబోటి
వారినేల దగుల వారిజాక్షి’
‘చారులోచనా! మేము లోకాచారానికి కట్టుబడేవారం కాదు. లోకులకు భిన్నమైన నడవడి గలవారం (మా ప్రవర్తన లోకాతీతం). తరలాక్షీ! పరులకు- ఇతరులకు మా జాడలు తెలియరావు (సుందరీ! మేము మనోవాక్కులకు అందనివారం). ఓ కులవతీ! మేము బలవంతులతోనే కలహం పాటిస్తాం (బలగర్వితులే ఇలలో మాకు ప్రతిబలులు- ప్రత్యర్థులు. అట్టి ఖలు- దుష్టులను శిక్షించి ఇలా (భూ) భారాన్ని తొలగిస్తాం). రాజవదనా! రాజు- నిప్పంటుకునే రాజ సింహాసనాల మీద మాకు మోజు లేదు (మేము ఈ జగత్తుకే నాథులం!). శరధియే- సముద్రమే సదా మాకు శరణ్యం- ఆశ్రయం (మేము పాలకడలిలో శేషుని ఒడిలో శయనించువారం). నెచ్చెలీ! మేము నిష్కించనులం- నిర్ధనులం. జగత్తు నిర్వహణకి మా వద్ద విధులే- కర్తవ్యాలే తప్ప నిధులు లేవు (అష్ట సిద్ధులు, నవ నిధులు మాకు దాసీలు). ఓ పట్టమహిషీ! అట్టడుగు పేదలతో తప్ప ఆఢ్యులతో- భాగ్యవంతులతో బంధుత్వాలు- చుట్టరికాలు పెట్టుకునేవారం కాము (ధనమదాంధులు మమ్ము కనలేరు- ఆశ్రయించరు).
కోమలాంగీ! మేము కూడబెట్టుకొనే వారం కూడా కాము (పూర్ణకాములం). గుట్టుగా- కనుకట్టుగా జీవించేవారం (ఈ మూఢలోకం గూఢుడనైన నన్ను గుర్తించలేదు- ‘మమ మాయా దురత్యయా’- గీత). మేము గుణహీనులం కూడా (సత్తరజఃతమస్సులనే త్రిగుణాలకు అతీతులం). ఓ మచ్చెకంటీ! మేము నిచ్చలు- నిరంతరం భిక్షకులనే- అచ్చగా బిచ్చగాళ్లనే ఇచ్చగిస్తాం- ఇష్టపడతాం. వారిని హెచ్చుగా మెచ్చుకుంటాం. వారికే ఇచ్చుకుంటాం (శరణుజొచ్చి భక్తి జ్ఞాన వైరాగ్యాల భిక్ష కోరే వారికే మేం ఆశ్రయమిస్తాం). మావంటి వారిని వారిజాక్షులు- వనితలు వరిస్తారా? ఓ కుందరదనా! నన్ను నీవెందుకు వలచావు? సిరి- సంపద, సౌందర్యం, వంశమూ- ఇవి సరి సమానంగా ఉన్నప్పుడే ఎవరికైనా వియ్యం, నెయ్యం (స్నేహం) అమరికని- అందాన్ని, సరిగె- శోభను సమకూరుస్తాయి. హరిణీ! ఇవి సరిగా లేకున్న ఎవ్వరికైనా సంబంధాలు జరగవు.
కం॥ ‘తగదని యెఱుగవు మమ్ముం
దగిలితివి మృగాక్షి దీన దప్పగు నీకుం
దగిన మనుజేంద్రునొక్కని
దగులుము, గుణహీన జనుల దగునే తగులన్’
ఓ తొగకంటీ! (కమలలోచనా!) నా సంబంధం తగినది కాదని మదిలో నెమ్మదిగానైనా గ్రహించలేక పోయావు. ఓ అలివేణీ! తెలియక నన్ను వలచావు. పొరపాటున నా కరగ్రహణం చేశావు. సుదతీ! (అందమైన పలువరుస గలదానా!) మరో మహీపతి- రాజుని పతిగా పొందు. గతిలేనట్లుగా నా వంటి గుణరహితుని జతగూడి సతమతమవడం సముచితం కాదు గదా! ఓ కాంతామణీ! నన్ను ద్వేషించే సాల్వ జరాసంధ శిశుపాలాది రాజన్యులను, బలగర్వంతో మదించి మిడిసిపడుతున్న నీ పెద్దన్న దద్దన్న రుక్మి అహంకారం అణచడానికి మాత్రమే నిన్ను ఆనాడు బలవంతంగా తెచ్చాను. అంతేకానీ, ఓ భామినీ! కామినీ- కాంతా, సంతాన, ఐశ్వర్య కామినై కాదు. ఉదాసీనులము, క్రియారహితులము, పరిపూర్ణులమూ అయిన మేము కామమోహాలకు లోనుకాము. నివాతస్థ- గాలిలేని నాలుగు గోడల మధ్య వెలుగుతున్న దీపం వలె నిత్యాత్మబుద్ధితో- సాక్షి భావంతో తేజరిల్లుతూ ఉంటాము. అట్టి మమ్ములను కట్టుకొని, ఓ వాల్గంటీ! (విశాలాక్షీ!) ఏల ఇక్కట్ల పాలవుతావు?’ అని కృష్ణుడు ఉపాలంభాలు- ఎత్తిపొడుపులు (దెప్పుటలు) పలికాడు.
శుకుడు-రాజా! శ్రీహరి తన్ను పరిత్యజించకుండా కనికరిస్తూ ఎల్లవేళలా తనతో విహరిస్తూండటం వలన ఆ హరిణీ నయన- రుక్మిణికి, తాను శౌరికి అత్యంత ఇష్టురాలనని, అష్టమహిషులలో పట్టపురాణినని కొంత దిట్టతనం- బెట్టు, గర్వం! భగవంతునికి అభిమానం- అహంకారమంటే చాల కష్టం- ద్వేషం. దీనత్వమంటే బహు ఇష్టం. కందర్పదర్పహరుడు ఆ కలికి-రుక్మిణి దర్పాన్ని హరించడానికి అలా పలికి మిన్నకున్నాడు.
చ॥ ‘అలికుల వేణి తన్ను బ్రియుడాడిన యప్రియభాషలిమ్మెయిన్
సొలవక కర్ణరంధ్రముల సూదులు చొచ్చిన రీతిగాగ బె
బ్బులి రొద విన్న లేడి క్రియ బొల్పఱి చేష్టలు దక్కి నేలపై
వలనఱి వ్రాలె గీ లెడలి వ్రాలిన పుత్తడి బొమ్మకైవడిన్’
శుకుడు-రాజా! ఇంతకు ముందెన్నడూ తన ప్రాణేశ్వరుని నోట వినని అప్రియమైన మాటలు విని, అవి చెవులలో సూదులు పెట్టి పొడిచినట్టు బాధించగా ఆ ఇంతి- రుక్మిణి అంతులేని సంతాపం పొందింది. ఆగకుండా వెలువడుతున్న వేడి నిట్టూర్పుల వలన ముఖపద్మం వాడిపోయింది. గాలి తాకిడికి తూలిపోతున్న కల్పవల్లి వలె మేను వడవడ వణుకుతుండగా పులి గాండ్రింపు విన్న లేడి వలె చేష్టలుడిగి, కీలు విరిగిన పుత్తడి- బంగారు బొమ్మవలె ఆమె నేలకొరిగింది.
ఇలా చెక్కిలిపై చేయి చేర్చి, మిక్కిలి దీనంగా కాలితో నేల రాస్తూ ఆ మగనాలు నగధరునికి- రమాలోలునికి జాలి కలిగించింది. నేలపై పడిపోయిన బాలామణిని పట్టుకొని లేవనెత్తుతూ లీలామానుష విగ్రహుడు, మాయా జాలుడు, వలరాజు జనకుడు మాధవుడు ఆ ఎలనాగ-జవ్వని (యౌవనవతి) తనువుపై అనువు-సమంచితంగా మంచిగంధం అలదాడు. పన్నీటితో కన్నీటిని కడిగాడు. కర్ణరంధ్రాలలో కర్పూరపు పలుకులను ఊదాడు. వక్షఃస్థలంపై చిక్కుబడ్డ ముత్యాల సరాలను చక్కదిద్దాడు. ఆ జవరాలి ఫాలఫలకంపై- ముఖాన కస్తూరి తిలకం సరిదిద్దాడు. సరసన చేరి సారస-తామర రేకుల విసన కర్రతో విసరాడు. పైట సరిచేసి కైటభారి-కృష్ణుడు చెక్కిలి నొక్కుచూ, ముఖం నిమిరి ఆ జక్కవచంటి (చక్రవాక పక్షులవంటి స్తనములు గలది)ని, కలువకంటిని చెలువం సొగసుమీర, మక్కువతో చక్కగ అక్కున చేర్చుకొని సేదదేర్చి ఆమోదం కలిగించాడు.
తే॥ ‘నెరులు గల మరు నీలంపుటురుల సిరుల
నరులుగొన జాలి నరులను మరులు కొలుపు
నిరులు గెలిచిన తుమ్మెద గఱులు దెగడు
కురుల నులి దీర్చి విరులిడి కొప్పువెట్టి’
మురవైరి తరువాత నొక్కులు దీరిన రుక్మిణి కురులను చిక్కు తీసి కొప్పులో పూలమాలలు తురిమాడు. ఆమె జుట్టు, చిమ్మ చీకట్లను అధిగమించిన మధులిట్టు- తుమ్మెదల రెక్కలను కూడా ఓడిస్తున్నట్లున్నది. అందమైన మరుని- మన్మథుని నల్లని ఉరుల- ఉచ్చుల సొగసును తిరస్కరించే ఆ కురులు ఎంతటి నిగ్రహపరులైన పురుషులనైనా మరులు గొలుప- మోహించ గలవి. ఆహా పోతన అమాత్యా! ఇది ‘తేటగీతి’యా లేక ‘తేటి గీతిక’యా?- (మత్త మధుకర ఝంకారమా?). ఓ తెలుగువారి పుణ్యాల పేటీ! నీకు నీవే సాటి!
విరుల పాన్పుపై చేర్చి హరి మనోహర మధుర వాక్కులతో ఇలా ఊరడించాడు. ‘వైదర్భీ! విరసాలు ఆడానని నాపై రోషపడవద్దు. ఓ లేమా! నీ ప్రేమ నాకు తెలియంది కాదు. ప్రణయ కలహపు మాధుర్యం చవి చూద్దామని, ఓ ముద్దుగుమ్మా! నీతో మేలపు మాటలు పలికాను. అవి నీటి మూటలని, కల్లలని గ్రహింపక, ఓ ఫుల్లారవిందలోచనా! నీవంతలోనే ఇంతలా తల్లడిల్లి పోతావని ఇసుమంతకూడా ఊహించలేదు’ అంటూ ఓదార్చాడు.
(సశేషం)
– తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ 98668 36006