శ్రీశైలం : ప్రముఖ శైవక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు శుక్రవారం ప్రారంభమై డిసెంబర్ 4 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా గర్భాలయ అభిషేకాలను రద్దు చేశారు. రోజుకు నాలుగు విడుతల్లో ఆర్జిత సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నట్లు శ్రీశైలం దేవస్థానం అధికారులు తెలిపారు. మల్లికార్జునస్వామి గర్భాలయంలో స్పర్శ దర్శనాలు నిలిపివేయగా.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నారు.
ఈ మాసంలో వచ్చే కార్తీక సోమవారాలు, పౌర్ణమి రోజున పుష్కరిణి వద్ద లక్షదీపార్చన, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జ్వాలాతోరణోత్సవం, కృష్ణవేణి నదీమతల్లికి పుణ్యనదీ హారతులివ్వనున్నారు. భక్తులు కార్తీక దీపారాధనను చేసుకునేందుకు వీలుగా ఆలయ దక్షిణ మాడవీధిలో, గంగాధర మండపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కార్తీక మాసం ప్రారంభ సూచికగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపాన్ని వెలిగించనున్నారు. ఈ మాసమంతా ఆలయంలో దీపాన్ని వెలిగించనున్నారు. ఉత్సవాల్లో కాంప్లెక్స్‌లో దర్శనం కోసం బారులు తీరిన భక్తులకు మంచినీరు, బిస్కెట్లు, అల్పాహారం అందించనున్నారు. అలాగే అఖండ శివచతుస్సప్తాహ భజన కార్యక్రమ నిర్వహణ, నిరంతరంగా శివభజనలు జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.