సన్యాసః కర్మయోగశ్చ నిఃశ్రేయసకరావుభౌ
తయోస్తు కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే॥
(భగవద్గీత – 5-20)
‘కర్మ త్యాగం, కర్మ యోగం ఈ రెండూ శ్రేయస్సును కలుగజేస్తాయి. అయితే ఆరంభంలో సాధకులకు రెండిటిలోనూ కర్మయోగమే శ్రేష్ఠమైనది’ అంటున్నాడు కృష్ణపరమాత్మ. త్రికరణశుద్ధిగా సమస్త కర్మలయందు కర్తృత్వభావన లేకపోవడం కర్మత్యాగం కాగా, సమత్వబుద్ధితో సత్కర్మలను ఆచరించడం కర్మయోగం. కృష్ణుడు ఒకప్పుడు కర్మత్యాగాన్ని, మరొకప్పుడు కర్మయోగాన్ని గొప్పవిగా చెప్పాడు. దానితో అర్జునునిలో సందేహం కలిగింది. ఈ రెండిటిలో ఏది ఉత్తమమైనది? సునిశ్చయంగా చెప్పమని అడిగాడు. దానికి కృష్ణపరమాత్మ కర్మయోగమే శ్రేష్ఠమైనదని పేర్కొన్నాడు.
ఏదైనా కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండలేం. అయితే ఏదో కర్మ చేయాలి అనుకుంటే ఉత్తమమైన దానినే ఆచరించాలి. అర్హత లేకుండా, అవగాహన లేకుండా కర్మత్యాగం ఫలించదు. ఎలాగైతే కూర్చోవడమూ, పరిగెత్తడమూ ఏకకాలంలో జరగవో అలాగే కర్మత్యాగం, కర్మయోగం రెండూ ఏకకాలంలో నెరవేరవు. సమతాభావనతో కర్మాచరణ చేయడాన్ని కర్మయోగంగా చెబుతారు. కర్మయోగాన్ని నిర్దుష్టంగా ఆచరించాలి అంటే మూడు రకాలైన కర్మ, వికర్మ, అకర్మలను గూర్చి తెలుసుకోవాలి. కర్మ అంటే చేయదగిన పనులు. వికర్మ అంటే చేయకూడని పనులు. అకర్మ అనగా ఏ పనీ చేయకుండా సోమరిగా ఉండిపోవడం. నిశ్శ్రేయస సాధనలో మొదటి మెట్టు కర్మయోగం కాగా, కర్మత్యాగం చివరి మెట్టుగా చెప్పుకోవచ్చు. నిశ్శ్రేయసం అంటే ‘ఇంతకన్నా కావలసిన మేలు మరొకటిలేదు అనదగిన స్థితి’. దానినే మోక్షం అన్నారు.
భారతీయ రుషి పరంపర దర్శించిన విజ్ఞానమే శాశ్వత జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానమే మోక్షసాధనకు ఉత్తమమైన మార్గం. అయితే అన్నప్రాశననాడే ఆవకాయను పెట్టినట్లుగా.. సాధారణ వ్యక్తులకు జ్ఞానమార్గాన్ని సూచించడం సమంజసం కాకపోవచ్చు. దానిని దృష్టిలో పెట్టుకొన్న రుషులు జపధ్యాన పూజావ్రత, ఉపవాసాది విధానాలను సూచించారు. అయినా ఆ ప్రక్రియలకు బంధీలుగా మారకుండా వాటిని ఆలంబనగా చేసుకొని జ్ఞానాన్ని సాధించాలని, తద్వారా మోక్షాన్ని పొందాలని సూచించారు. జ్ఞాన సాధనలో కర్మ సన్యాసం ఉపకరిస్తుంది. జ్ఞానయోగం అంటే విషయాన్ని తెలుసుకోవడం. తెలిసిన దానిని ఆచరణలో పెట్టడం కర్మయోగం. విషయం తెలుసుకోవడం వల్ల మాత్రమే ప్రయోజనం ఉండదు. దానిని ఆచరణలో పెట్టడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. నిరంతరం నిబద్ధతతో జ్ఞానాన్ని అభ్యసిస్తూ.. శ్రద్ధతో ఫలితాపేక్షలేకుండా దానిని ఆచరించడం వల్ల నైపుణ్యం పెరుగుతుంది. జ్ఞానానికి నైపుణ్యం తోడైతే లక్ష్యం చేరగలుగుతాం. జ్ఞానాగ్నిలో కర్మఫలాలు దహనం అవుతాయి. దహనం కావడం అంటే భస్మమవ్వడమే!
నిజానికి ప్రతివ్యక్తికీ తన జీవిత లక్ష్యం ఏమిటి? గమ్యం ఏమిటనే దానిపై స్పష్టత ఉండాలి. ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళుతున్నాం, దానివల్ల ప్రయోజనం ఏమిటి? అనే విషయాలు తెలిస్తే జీవిత ప్రయోజనం ఏమిటో అవగాహన కుదురుతుంది. దానిని తెలియజేసేందుకు ఉపకరించేది సనాతనమైన శ్రుతి, స్మృతి, పురాణాదుల ఆధ్యయనం. గురుముఖతః పొందిన జ్ఞానం లౌకిక, పారలౌకిక జీవనాన్ని సమన్వయం చేసుకుంటూ గమ్యం చేరడానికి సహకరిస్తుంది. మనలో వెలుగుచూసిన ప్రతి ఆలోచనా, ప్రతి చర్యా లక్ష్యంవైపు నడవాలి. ధార్మిక, సాంఘిక, ఆర్థిక జీవనానికి ఏ పని చేయాలి, ఏది చేయకూడదు.. అనే చర్చ మాత్రమే చేయడం వల్ల ఉపయోగం ఉండదు. మంచిదని భావించిన పనిని ఆరంభించి నిబద్ధతతో చేయడం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి వల్ల అంతర్గత దార్శనికత వెలుగుచూస్తుంది. దానివల్ల బాహ్యపరిమితులు విశాలమవుతాయి, చెదిరిపోతాయి.
ఉద్యోగి తన యజమాని నిర్ధారించిన పనిని చేయాలే కానీ, దానిలోని మంచిచెడులను చర్చించడం అతని కర్తవ్యం కారాదు. కర్తవ్య నిర్వహణ వల్ల కలిగిన చిత్తశుద్ధి జ్ఞానం వైపు నడిపిస్తుంది. కర్తవ్య విముఖత వ్యక్తికే కాదు ధర్మానికి కూడా చేటు చేస్తుంది. ప్రక్రియను ఆదరిస్తే ఫలితాన్ని పట్టించుకోరు. ఫలితాపేక్ష ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి వల్ల లక్ష్యానికి దూరమవుతాం. కాబట్టి కర్మసన్యాసం చేసి నిష్క్రియాపరుడై నిలవడం కన్నా.. కర్మయోగాన్ని ఆదరించడమే ఉత్తమం అంటున్నాడు, కృష్ణపరమాత్మ.