Lord Shiva | శివుణ్ని మనం లింగరూపంలో అర్చిస్తాం. సాధారణంగా గుళ్లలో చుట్టూ పానవట్టంతో నిలువుగా ఉండే లింగాకారంలో పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే, ఇందుకు భిన్నంగా నేలకు సమాంతరంగా… అంటే అడ్డంగా ఉండే శివలింగం పంజాబ్ రాష్ట్రం కలానౌర్లో ఉంది. కాశీ అంతటి విశిష్టత కలిగిన క్షేత్రంగా పరిఢవిల్లుతున్న ఈ ఆధ్యాత్మిక కేంద్రానికి భక్తులు పెద్ద ఎత్తున వచ్చి శయన శివుడి ఆశీస్సులు పొందుతుంటారు.
భగవంతుడిని మనం విభిన్న నామాలతో పిలుస్తాం. భిన్న రూపాల్లో అర్చిస్తాం. భక్త సులభుడైన శివుడిని మాత్రం లింగ రూపంలోనే పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆకృతులు, పరిమాణాలు, రంగుల్లో తేడా మినహాయిస్తే ఎక్కడైనా శివలింగం అంటే పానవట్టంతో కలిసి నిలువుగా ఉన్న లింగరూపమే. పంజాబ్లోని గుర్దాస్పూర్ దగ్గరి కలానౌర్లోని మహాకాళేశ్వరుడు మాత్రం భక్తులకు వైవిధ్యమైన రూపంలో దర్శనమిస్తాడు. అక్కడ శివలింగం పెద్ద పరిమాణంలో అడ్డంగా ఉంటుంది. పానవట్టం ఇక్కడ మనకు ప్రత్యేకంగా ఏమీ కనిపించదు. జ్యోతిర్లింగాలతో పాటు శివుడి ఆవాసం కైలాస పర్వతం, కాశీ తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న క్షేత్రంగా దీనికి పేరుంది.
కలలో కనిపించి…
కలానౌర్ ప్రాంతం మొఘల్ చక్రవర్తి అక్బర్ రాజ్యంలో ఉండేది. ఆయన మొఘల్ చక్రవర్తిగా పట్టాభిషేకం జరుపుకొన్నది కూడా ఇక్కడే. 1556లో ఒకసారి ఈ పరిసరాల్లో గుర్రాలను కట్టేసి గుడారాలు వేసి సైనికులు తిరుగుతున్నారట. అప్పుడది సాదాగా బీడు భూమిలా ఉండేది. అయితే, ప్రస్తుతం శివలింగం వెలసిన స్థలం మీదుగా వెళ్లిన గుర్రాలు నడవలేకపోయాయట. అప్పటిదాకా బాగున్నవి ఉన్నట్టుండి ఎందుకు కుంటుతున్నాయో సైనికులకు అర్థం కాలేదు. చాలా గుర్రాల పరిస్థితి ఇదే విధంగా అవడంతో వాళ్లు వాటిని గమనించారు. ఒక ప్రాంతం మీదుగా నడిచిన వాటికే ఇలా జరగడం చూసి రాజుకు ఆ విషయాన్ని తెలియజేశారు. అక్బర్ కూడా తన గుర్రంతో వచ్చాడు. వాళ్లు చెప్పింది విని, తన అశ్వాన్ని అటు వైపుగా దౌడు తీయించాడు.
రాజు గుర్రం కూడా ఈ చోటుకు రాగానే కదలలేని స్థితికి చేరుకుంది. దీంతో అక్కడ ఏముందో చూడమంటూ తవ్వకాలు జరిపించాడు. అక్కడ అడ్డంగా ఉన్న ఒక పెద్ద రాయి కనిపించింది. ఇంతలో రాత్రి అవడంతో మరుసటి రోజు దాన్ని తీసి, మరింత తవ్వి చూడాలనుకున్నారట. ఆ రాత్రి అక్బర్ కలలో ఒక దివ్యవాణి వినిపించిందట. ఇక్కడ శివుడు వెలిసి ఉన్నాడనీ, తవ్వకాలు ఆపేసి, ఇదే ప్రాంతంలో గుడి నిర్మించమని ఆదేశించిందట. దీంతో అక్బర్ ఇక్కడ ఆలయాన్ని నిర్మింపజేశాడని స్థానికులు చెబుతారు. అక్బర్ తర్వాత మొఘల్ చక్రవర్తులు ఈ శివాలయాన్ని ఆక్రమించి, మసీదుగా మార్చారు. కొన్నేండ్ల తర్వాత ఈ చోటుకు రాజా రంజిత్ సింగ్ కుమారుడు ఖడఖ్ సింగ్ వచ్చినప్పుడు ఆయన కలలో శివుడు కనిపించి ఆలయ పునరుద్ధరణకు ఆదేశించాడట. ఇప్పుడున్న భవ్య మందిరం అలా నిర్మించినదే.
పురాణ కథ
ఈ ఆలయం వెనుక చరిత్ర మాత్రమే కాదు, పురాణ గాథ కూడా ఉన్నది. పూర్వం గణాధిపత్యం కోసం పరమేశ్వరుడి కుమారులైన గణపతి, కుమారస్వామి ఇద్దరూ నేనంటే నేనని పోటీపడ్డారట. అప్పుడు అలిగిన కుమారస్వామి ఈ ప్రాంతంలో వచ్చి బస చేశాడట. ఆయన్ను సముదాయించడానికి దేవతలంతా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో వాళ్లు శివుడికి విషయాన్ని చేరవేశారట. అప్పుడు ఏకంగా మహేశ్వరుడే ఇక్కడికి వచ్చి, బిడ్డను అనునయించాడట. అలా మహాశివుడు అడుగిడిన ఈ చోట ఇప్పటి ఆలయం వెలసిందని స్థల పురాణం చెబుతున్నది. మహాకాళేశ్వరుడిగా కలానౌర్లో శివయ్య పూజలందుకుంటున్నాడు. భక్తులు ఇక్కడి శివుడికి వెండి నాగపడగలు కానుకగా సమర్పిస్తుంటారు. ఆలయంలో అమ్మవారితోపాటు గణపతిని కూడా దర్శించుకోవచ్చు. మహాశివరాత్రితోపాటు ప్రత్యేకమైన మాసాల్లో భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని అభిషేకం, అర్చనలు చేస్తారు. నిండు మనసుతో ఏది మొక్కినా శివయ్య నెరవేరుస్తాడని నమ్ముతారు!