కాశి అంటే ప్రకాశం, స్వయంప్రకాశం. తను వెలగడమే కాదు.. యాత్రికుల్లో అజ్ఞాన, అహంకార తిమిరాలను తొలగించి జ్ఞానకాంతులు ప్రసరిస్తుంది. వరుణ, అసి అనే రెండు నదుల మధ్య ఉన్నది కాబట్టే, వారణాసి అనే పేరొచ్చింది. ఇహ, పరాలనే రెండు లోకాలకూ ఇది వారధి. కాశిలో శివుడు లేని చోటు లేదు. శివతత్వం గోచరించని ప్రదేశం లేదు. ప్రతి ప్రాణీ రుద్ర స్వరూపమే. మహాప్రళయం తర్వాత బ్రహ్మాండాలన్నీ కాశీలోనే లయమవుతాయట. కాబట్టే, మహాశ్మశానమనే పేరొచ్చింది. ఆ సమయంలో శివుడు తన త్రిశూలం మీద ఈ నగరాన్ని నిలబెడతాడట.
అందుకే, ‘త్రికంటక విరాజితం’ అంటారు మహర్షులు. అష్టాదశ శక్తిపీఠాల్లో ప్రథమమైనది కావడం వల్ల.. ‘గౌరీ ముఖం’గా వ్యవహరిస్తారు. కాలభైరవుడు క్షేత్రపాలకుడు. అన్నపూర్ణమ్మ దొడ్డ ఇల్లాలు. కడుపునిండా భోజనం పెడుతుంది. శైవక్షేత్రమే అయినా.. కాశీలో రామనామం వినిపిస్తూ ఉంటుంది. ముక్తిక్షేత్రం కాబట్టి, నిత్యం అనేకానేక అంతిమ యాత్రలు. శవం లేచిన ప్రతిసారీ.. మనసులో శివుణ్ని తలుచుకుంటూ.. బయటికి ‘రామ్ నామ్ సత్య్ హై’ అంటూ రామచంద్రుడి పేరు నినదిస్తారు. గంగలో తేలే ప్రతి శవం.. జీవితం బుద్బుదప్రాయమనే హెచ్చరిక. కాశీకి వెళ్లినవారు ఏదో ఒకటి వదిలిపెట్టాలని నియమం. అది ఫలమో, ఫలహారమో కాకుండా.. అహమో, కోపమో అయితే మరీ మంచిది. పరమేశ్వర కటాక్షమూ, యాత్రాఫలమూ సిద్ధిస్తాయి.