మనసును ఖురాన్ పరిభాషలో ‘నఫ్స్’ అంటారు. మూడు రకాల మనసులు ఉంటాయని ఖురాన్ పేర్కొన్నది. అవి నఫ్సె అమ్మారా, నఫ్సె లవ్వామా, నఫ్సుల్ ముత్మయిన్నహ్. మనసుల్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. మనసులో క్రోధం, అసూయ, ద్వేషం, ప్రేమ అన్నీ ఉంటాయి.
నఫ్సె అమ్మారా అంటే.. ‘మనసు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది’ (12:53)
ఇలాంటి మనసు మనపై ఆధిపత్యం చెలాయిస్తుంది. మనల్ని చెడుకు పురిగొల్పుతుంది. ఇలాంటి మనసున్నవారు కోరికలకు బానిసవుతారు. మనసు చెప్పిందల్లా చేస్తారు. ఎలాంటి పశ్చాత్తాప భావన లేకుండా పాపాలకు ఒడిగడుతుంటారు. ఇలాంటి మనసును ఖురాన్ నఫ్సె అమ్మారాగా అభివర్ణించింది ఖురాన్.
నఫ్సె లవ్వామా.. ‘నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను’ (75:2)
లవ్వామా.. అంటే ఏదైనా తన వల్ల తప్పిదం జరిగిపోతే తనను తాను నిందించుకోవడం. అపరాధ భావంతో కుంగిపోయి పశ్చాత్తాపం చెందడం అని అర్థం. ఇలాంటి మనసున్న వాళ్లు తమ వల్ల జరిగిన తప్పిదాలకు పశ్చాత్తాపం చెందుతారు. పాప కార్యాల నుంచి వైదొలుగుతారు. నిత్యం ఇలాంటి వాళ్లు మనసుతో యుద్ధం చేస్తుంటారు. ఒక్కోసారి మనసు ఆధిపత్యం చెలాయిస్తే మరోసారి మనసుకు కళ్లెం వేస్తారు.
నప్సుల్ ముత్మయిన్నహ్.. ‘తృప్తిచెందిన మనసా! నీ ప్రభువు సన్నిధికి పదా! నీ ప్రభువుకు ఇష్టమైన దానివై.. నా దాసులలో (పుణ్యాత్ములైన) చేరిపో, నా స్వర్గంలో ప్రవేశించు’ (89:27-28)
నఫ్సుల్ ముత్మయిన్నహ్.. అంటే తృప్తి చెందిన మనసు అని అర్థం. ఇలాంటి మనసు గలవారు తమ మనసుకు తగిన శిక్షణ అందించి, తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటారు. అల్లాహ్ అభీష్టానికి అనుగుణంగా నడుచుకుంటారు. ఇలాంటి మనసు ఎప్పుడూ మంచినే కోరుకుంటుంది. అశాంతికి తావుండదు. ఎలాంటి చెడు భావాలను దరిచేరనివ్వదు. ఎందుకంటే మనసును ఆ విధంగా శిక్షణనిచ్చాడు కాబట్టి చెడులను స్వీకరించడం మానేస్తుంది. ఇలాంటి మనసున్న వారిపట్ల అల్లాహ్ ప్రసన్నుడు అవుతాడు. వారిని స్వర్గానికి సాదరంగా ఆహ్వానిస్తాడు.