నిజాయతీ, అమానతుదారీతనం విశ్వాసులకు ఉండాల్సిన ఉత్తమ సుగుణాలు. అవి వ్యక్తిత్వానికి విలువైన ఆభరణాలు. అందుకే ఇస్లాం ఈ గుణాలకు ఎంతో ప్రాధాన్యాన్ని ఇచ్చింది. ఈ రెండు సుగుణాలకు విశాలమైన అర్థాన్ని పేర్కొన్నది. ప్రతి మనిషి వారి బాధ్యతల విషయంలో నిజాయతీతో, అమానతుదారీతనంతో జవాబుదారీగా ఉండాలని చెప్పింది. నిజాయతీ ఒక తప్పనిసరి విధి. అమానతుదారీతనం ఒక గురుతరమైన బాధ్యత. ఇతరులు మనకు ఇచ్చిన ధనం లేదా వస్తువులు, చెప్పిన రహస్యాలను బహిర్గతం చేయకుండా ఉండటం, మనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే అమానతుదారీతనం. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన ప్రతిభను, నైపుణ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించాలి. ఈ ఆచరణను నిస్సందేహంగా అమానతుదారీతనాన్ని పాటించినట్టు అవుతుంది. అందుకే అధికార పదవులను యోగ్యత కలవారికి అప్పగించాలి.
సమాజంలో ఎప్పుడైతే నిజాయతీ అంతరించిపోతుందో, అప్పుడు ప్రళయం సంభవిస్తుందని దైవప్రవక్త (స) స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి బాధ్యతాయుత ఉద్యోగంలో, పదవిలో ఉన్న వ్యక్తులు చిన్న వస్తువును కూడా అన్యాయంగా ప్రజల నుంచి కానుకల రూపంలో తీసుకోకూడదు. అలా చేస్తే ప్రళయ దినాన అలాంటి వ్యక్తులు ఆ వస్తువులు తీసుకొని అల్లాహ్ ముందు హాజరై సంజాయిషీ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అల్లాహ్ ప్రసాదించిన శక్తియుక్తులు, నైపుణ్యాలు, సంపద, సంతానం కూడా అమానతులుగానే పరిగణించాల్సి ఉంటుంది. వాటిని అల్లాహ్ మార్గంలో వినియోగించాలి. అల్లాహ్ బోధనల ప్రకారం అమానతుదారీతనాన్ని ఆచరిస్తూ, నిజాయతీగా ఉంటూ మన జీవితాలను ఉన్నతంగా మలచుకొని ధన్యం చేసుకోవాలి.
…? ముహమ్మద్ ముజాహిద్
96406 22076