వాగ్దాన పాలనను గురుతరమైన బాధ్యతగా ఇస్లాం పేర్కొంది. అది ముస్లింల నైతికతలో భాగమని తెలిపింది. ఏ వ్యవహారంలో అయినా వాగ్దానం చేసినట్లయితే చివరి నిమిషం వరకు నిబద్ధతతో, బాధ్యతాయుతంగా వ్యవహరించి దానిని నెరవేర్చాలి. చేసిన వాగ్దానాలను, ప్రమాణాలను తప్పనిసరిగా నెరవేర్చాలి. అయితే సత్యం కలిగిన వ్యవహారాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఎవరైనా తమ తాహతుకు, సామర్థ్యానికి మించి వాగ్దానం చేయకూడదు. ఒకవేళ అలా వాగ్దానం చేస్తే దానికి పరిహారం చెల్లించి వాగ్దాన భంగం చేయడమే ఉత్తమమని ప్రవక్త (స) సూచించారు. మంచి విషయానికి సంబంధించి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి మన పూర్తి శక్తియుక్తులు వెచ్చించాలి. ఇందుకు మతిమరుపు లేకుండా ఉండటం, నిలకడతో కూడిన దృఢచిత్తం కలిగి ఉండటం అత్యవసరం. వాగ్దాన పాలనకు సంబంధించిన చైతన్యం మనలో వేళ్లూనుకుంటే జ్ఞాపకశక్తికి దృఢ నిశ్చయం తోడవుతుంది. అప్పుడు వాగ్దాన పాలనలో మరుపునకు అవకాశం ఉండదు. అలాంటి దృఢ చిత్తం కలిగిన వ్యక్తి విశ్వసనీయుల్లో ఒకరిగా ఉంటారు. మనం అల్లాహ్కు ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకొంటే.. ఆయన మనకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారు.