కల్వరి గిరికి తీసుకెళ్లి ప్రభువును శిలువపై హత్య చేశారు. అసూయ చెందిన యూదా మతపెద్దల పన్నాగాలు ఫలించి ప్రభువును ఒక విప్లవకారుడిగా చిత్రించారు. దీనికి భయాందోళనలకు గురైన రోమాన్ చక్రవర్తులు ప్రభువును బంధించి అన్యాయంగా మరణ తీర్పు విధించారు. ఏసు ప్రభువు మరణం తర్వాత సంబంధీకులు వచ్చి, ప్రభువు మృతదేహాన్ని సమాధిలో పాతిపెట్టారు. మూడు రోజుల తర్వాత సమాధి ఖాళీగా ఉంది. ప్రభువు కనిపించాడు.
ప్రజల్ని కలిసి వారి మధ్య తిరిగాడు. కానీ, వారు గుర్తుపట్టలేక పోయారు. తన పునరుత్థానానికి సంబంధించిన ఆధారాలను వారికి అందించాడు. ప్రభువు పునరుత్థానం తర్వాత ఈ లోకంలో నలభై రోజులపాటు ఉన్నాడు. ఈ నలభై రోజుల్లోనూ తన బోధలు వ్యాప్తి చేయమని ఆదేశించాడు. తాను ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని పాటించమని శిష్యులకు చెప్పాడు. తమ పాపాల నిమిత్తంగా పశ్చాత్తాప పడేవారికి బాప్టిజం ఇవ్వమనీ, వారి పాపాలను క్షమించమని సూచన చేశాడు. ప్రభువు శిష్యులు పరిశుద్ధాత్మ ప్రేరేపితులై.. ప్రభువాక్య సేవ ప్రారంభించారు. క్రీస్తు సందేశం దశదిశలా వ్యాపింపజేయడానికి నడుం బిగించారు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024