Yadadri Temple | వేంకటేశ్వర స్వామిని తన కీర్తనలతో అర్చించాడు అన్నమయ్య. భద్రాద్రి రాముడిపై తన భక్తిని సంకీర్తనల ద్వారా చాటుకున్నాడు రామదాసు. ఆ కోవకే చెందుతాడు ఈగ బుచ్చిదాసు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహిమలను తన కీర్తనల ద్వారా ప్రాచుర్యంలోకి తెచ్చిన భక్తకవి ఇతడు. 1907లో వరంగల్ జిల్లాలో జన్మించిన బుచ్చిదాసు.. దాస సంప్రదాయాన్ని అనుసరించిన తెలంగాణ వాగ్గేయకారుల్లో బుచ్చిదాసు తలమానికం.
శ్రీ యాదగిరి నిలయుడా! నరహరీ! శ్రీ లక్ష్మి ప్రాణేశుడా!
పాయకను భక్త జనుల బ్రోచేటి బ్రహ్మాండనారసింహా
సుందరా నీ రూపునూ! కనులకానందంబుగానుండునూ
వందనమను వాండ్లను రక్షించు వరలక్ష్మి నారసింహా…
ఈగ బుచ్చిదాసు భజన కీర్తనలు, శతక పద్యాల ద్వారా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వైభవాన్ని చాటి చెప్పాడు. ప్రతిరోజు తన శిష్యులను వెంటబెట్టుకుని బ్రాహ్మీ ముహూర్తంలోనే నగర సంకీర్తనతో వెళ్లి స్వామివారి కోవెల ముందు మేలుకొలుపు కీర్తనలు ఆలపించేవాడు. బుచ్చిదాసు సంకీర్తన అర్చన ముగిసిన తర్వాతే స్వామివారి తలుపులు తెరిచేవారట. భక్తి మాత్రమే కాకుండా లక్ష్మీనరసింహస్వామిని పరమాత్మగా భావించి ధ్యానంలో ఉండేవాడు బుచ్చిదాసు. స్వామివారి సాక్షాత్కారం పొంది తన జన్మను పావనం చేసుకున్నాడు.
యాదాద్రీశుడు భక్తుల భవరోగాలను మాత్రమే కాకుండా రోగాలనూ నివారిస్తాడని నమ్మకం. ఆ స్వామిని సేవించడానికి గుట్టకు చేరుకున్న బుచ్చిదాసు తన ఆరోగ్యం కుదుటపడాలని స్వామి వారికి నిరంతరం పూజలు చేస్తుండేవాడు. ప్రస్తుతం కొండపైనున్న గుండం దగ్గర చిన్నకుటీరం వేసుకొని ప్రతి నిత్యం నరసింహుడిని సేవిస్తుండేవాడు. నరసింహ దీక్షను స్వీకరించి స్వామి చుట్టూ ప్రదక్షిణలు చేసేవాడు. క్రమంగా అతని ఆరోగ్యం కుదుటపడటంతో మరింత నిష్ఠగా స్వామివారి ఆరాధన కొనసాగించాడు. ఆ సమయంలో గురువు ద్వారా ఉపదేశం పొందిన బుచ్చిదాసు కొండపై ఉన్న కుటీరం వద్దనే పాఠశాల నిర్వహించేవాడట. ఇలా ఉండగా ఒకరోజు బుచ్చిదాసుకు కలలో నరసింహస్వామి దర్శనమిచ్చి తనపై కీర్తనలు రచించమని ఆదేశించాడట. నాటి నుంచి కీర్తనలు రాయడం మొదలుపెట్టాడు బుచ్చిదాసు. స్వామి గుణగణాలను భక్తితో స్తుతిస్తూ.. కీర్తనలు రాస్తూ, ఆలపించేవాడు. తన సంకీర్తనలలో భక్తి, వేదాంతాలను ప్రబోధించాడు. ఆయన ఆశువుగా కీర్తనలు పాడుతుంటే వారి శిష్యురాలు బుచ్చిమాంబ, ఇతర శిష్యులు రాసేవారట.
స్వామిలీలలను బతుకమ్మ పాటగా కూడా రాశాడు బుచ్చిదాసు. ‘యాదగిరిలోన ఉయ్యాలో.. శ్రీ నారసింహులు ఉయ్యాలో.. ఆది లక్ష్మీశుడు ఉయ్యాలో..’ అని సాగే ఈ పాటకు నేటికీ ఆదరణ ఉంది. అదేవిధంగా ‘యాదగిరి నరహరి’ మకుటంతో సీస పద్యాలతో శతకం రచించాడు. ఈ పద్యాల్లో భక్తితోపాటు ఆధ్యాత్మికత, తత్త్వం, నీతి, లోకరీతి వంటివి ఉండటం విశేషం. భక్తి భావంలో ఉన్నప్పుడు కీర్తనలు, ధ్యానం తర్వాత తత్తాలు రాసేవాడు. నరసింహస్వామికి తన జీవితాన్ని అంకితం చేసిన బుచ్చిదాసు 1957 జూన్ 11న యాదాద్రిలోనే పరమపదించాడు.
సామాన్యులు సైతం పాడుకునేందుకు వీలుగా బుచ్చిదాసు రాసిన యాదాద్రి నరసింహస్వామి కీర్తనలు మొత్తం నాలుగు భాగాలుగా 1962లో ముద్రితమయ్యాయి. తనకు అన్ని విద్యలు బోధించిన గురువుపట్ల బాధ్యతగా బుచ్చిదాసు సంకీర్తనలు, శతకాలు, బతుకమ్మ పాటలను ఆయన శిష్యురాలు బుచ్చిమాంబ శ్రద్ధతో ముద్రించి భక్తులకు అందించారు. ఆమె కారణంగానే బుచ్చిదాసు సాహిత్యం నేటికీ సజీవంగా మనకు అందుబాటులో ఉంది.