‘మనిషి మళ్లీ ఎలా జన్మిస్తాడు?’ ఈ ప్రశ్నను నికొదేము ఒకసారి ప్రభువును అడిగాడు. నికొదేము యూదుల్లో ఓ ప్రముఖ వ్యక్తి. మతాధిపత్యం గలవాడు. యూదాపాలక మండలి సభ్యుడు కావడం వల్ల అధికారికంగా కూడా బలమైన వాడు. ఓ రోజు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా అతను ప్రభువును కలిశాడు. తన సందేహాల్ని నివృత్తి చేసుకోడానికి ఆ రాత్రి ప్రభువుతో చర్చ సాగించాడు. ఆయన ఇలా దొంగచాటుగా రావడానికి కారణం, అప్పటికే యూదుల్లో ప్రభువు పట్ల ద్వేషం, అసూయాభావం ఏర్పడింది. అయినా, నికొదేముకు ప్రభువంటే చాలా ఇష్టం. ఆయన దేవుడు పంపగా వచ్చిన వాడని ప్రగాఢంగా నమ్మాడు.
ఆయన అద్భుతాల్ని కండ్లారా చూసి మెచ్చినవాడు. ‘నిత్య జీవం పొందడానికి నేనేం చేయాలి?’ అనేది ఆయన వేసిన మొదటి ప్రశ్న. ‘నిత్య జీవానికి తిరిగి పుడితే గానీ ఇది సాధ్యపడదు’ అని ప్రభువు వివరించాడు. దీంతో తిరిగి జన్మించడంపై నికోదేముకు మరో సందేహం వచ్చింది. ‘వయసుడిగిన వయోవృద్ధుడు చనిపోతే మళ్లీ ఎలా జన్మిస్తాడు?’ అని మళ్లీ ప్రశ్నించాడు. ‘మనిషి అగ్నితో గానీ, నీటితో గానీ శుద్ధీకరింపబడి మారిన మనసుతో కొత్తశైలితో ప్రవర్తిస్తే అదే కదా కొత్త జన్మ. శరీరం బాహ్యం. ఇహలోక సంబంధి. ఐహికం. ఆత్మ పారలౌకికం. మొదటి దానికి అనిశ్చితి తథ్యమైనా, రెండోది శాశ్వతం’ అని ప్రభువు విశ్లేషణతో నికొదేముకు స్పష్టమైన వివేచన కలిగింది. ప్రభువుకు ధన్యవాదాలు చెప్పి తన మందిరానికి వెళ్లిపోయాడు.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024