శిశిరంలోనే వసంత సంతసం తీసుకొచ్చే పర్వం హోలి. లేత చివుళ్లు వేసి పులకించిపోతున్న తరులతో ప్రకృతి కాంత పరవ శించిపోతుంది. వసంత పంచమి నుంచి ఆమని ఆగమనానికి ప్రకృతి సిద్ధమవుతుంది. ఈ సంబురాన్ని హోలి కేళి రెట్టింపు చేస్తుంది. ఫాల్గుణోత్సవం, కల్యాణ పూర్ణిమ, వసంత పున్నమి, హుతాశని పౌర్ణమి, కాముని పున్నమి, మదనోత్సవం, డోలా పూర్ణిమ, అనంగ పూర్ణిమ ఇలా ఎన్నో పేర్లతో ఫాల్గుణ పూర్ణిమ నాడు హోలి పర్వదినాన్ని నిర్వహిస్తారు.
హోలి పండుగతో ముడివడిన గాథలు భవిష్య, లింగ పురాణాల్లో కనిపిస్తాయి. ధర్మరాజుకు నారద మహర్షి హోలి పండుగ నియమాలను, విశిష్టతను వివరించాడని భవిష్య పురాణం చెబుతున్నది. శివపార్వతుల్ని ఏకం చేసే ప్రయత్నంలో మన్మథుడు శివుడి ఆగ్రహానికి గురై భస్మమయ్యాడు. అతని భార్య రతీదేవి ప్రార్థన మేరకు ఆమెకు మాత్రమే సశరీరంతో, మిగిలినవారికి అనంగుడిగా అంటే అదృశ్య రూపంలో మన్మథుడు గోచరమవుతాడని శివుడు వరమిచ్చాడు. ఆ సందర్భమే అనంగ పూర్ణిమ. గాథాసప్తశతి, కామసూత్రాలు, నాగావళి వంటి గ్రంథాల్లో హోలి వైభవ ప్రస్తావన ఉంది. శిశు హంతకి అయిన రాక్షసి హోలిక వినాశనానికి సూచికగా హోలి పర్వదినం ఏర్పడిందని చెబుతారు. అగ్ని కూడా దహించలేని శక్తిమంతురాలైన హోలిక హిరణ్యకశిపుడి సోదరి. ప్రహ్లాదుణ్ని ఒడిలో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను హిరణ్యకశిపుడు ఆదేశిస్తాడు. హరి భక్తుడైన ప్రహ్లాదుడి స్పర్శ వల్ల హోలిక శక్తి సన్నగిల్లి ఆమె అగ్నికి ఆహుతి ఆవుతుంది. ఆ అగ్నికీలల నుంచి ప్రహ్లాదుడు ఏ గాయమూ లేకుండా బయటికి వస్తాడు. అలాగే ‘దుంధ’ అనే రాక్షసి అంతానికి సంతోషంగా ప్రజలు హోలి జరుపుకొనే సంప్రదాయం ఏర్పడిందని భవిష్య పురాణ కథ.
భారతీయ సంస్కృతి ఒక రంగుల హరివిల్లు. కాలానికి అనుగుణంగా మనలో ఆనందాలు నింపే పండుగలతో శోభిస్తుంది. వసంత రుతువు ప్రారంభానికి ముందు వచ్చే హోలి అయితే చెప్పనే అక్కరలేదు. వయోభేదాలు మరిచి అందరూ వసంతాలాడి మైమరచే రంగుల పండుగ చేసుకుంటారు. ఆనందహేల అయిన హోలి వెనుక సంప్రదాయ విశేషాలెన్నో ఉన్నాయి.
బృందావనంలో రాసక్రీడా వసంతోత్సవం ఓ అద్భుత రసమయ వేడుక. గోపికలపై శ్రీకృష్ణుడు వివిధ రంగుల పుష్పాలను ఆనందాతిరేకాలతో విరజిమ్మితే, గోపికలు గోపాలునిపై వసంతాన్ని చిలకరించారట. ఈ మధురోత్సవం సంరంభంగా, కవ్వింతల సంబరంగా పరిఢవిల్లిందని భాగవతం హృద్యంగా అభివర్ణించింది. అంతేకాదు, హోలి వేడుకను ఉత్తర భారతదేశంలో డోలాజాత్రాగా కూడా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రాధాకృష్ణుల మూర్తులను ఊయలలో ఉంచి లాలిపాటలను ఆలపిస్తారు. ఆ సందర్భంగా రంగుల్ని కూడా చిలకరించుకుంటారు.
మధుర మీనాక్షి దేవి తపోదీక్షను చేపట్టి సుందరేశ్వర స్వామిని మెప్పించి ఈ ఫాల్గుణ పౌర్ణమినాడే వివాహం చేసుకుందని పురాణ కథనం. దక్షిణ భారతదేశంలో శక్తి ఆలయాల్లో ఫాల్గుణ పౌర్ణమినాడు కల్యాణీ వ్రతాన్ని నిర్వహించే ఆచారం కూడా కనిపిస్తుంది.
ప్రకృతిలో వ్యక్తమయ్యే వర్ణ వైవిధ్యానికి ప్రతీకగా జన సమూహం ఉల్లాసంగా, ఉత్సాహంగా ఫాల్గుణ పూర్ణిమ నాడు రంగుల్ని చిలకరించుకుంటారు. ఆసేతు హిమాచలం ఈ పండుగను వేర్వేరు ఆచారాలతో, విభిన్న నేపథ్యాలతో, వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమికి కాస్త అటూ ఇటూగా ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి సంబంధమైన పండుగల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఉంది. ప్రాంతమేదైనా, ఏ తరహాలో పండుగ చేసుకున్నా.. అది మత సామరస్యానికి, సమైక్యతకు చిహ్నంగా నిలుస్తున్నది.
వేదకాలంలో హోలిని ‘నవాహ్నేష్టి యజ్ఞం’గా జరుపుకొనేవారు. పొలంలో సగం పక్వమైన, సగం పచ్చిగా ఉన్న ధాన్యాన్ని తెచ్చి హోమాగ్నిపై ఆవుపాలతో పాయసం తయారుచేసేవారు. పురాణకాలం నుంచి హోలినాడు వసంతాలాడే ఆచారం వచ్చింది. ప్రకృతి సహజమైన రంగులతోనే హోలి జరుపుకోవాలి. హానికరమైన కృత్రిమ రంగులు చల్లుకోవడం సంప్రదాయ విరుద్ధం. ఫల, పుష్ప రసాలను సమ్మిళితం చేసి రంగులుగా చిలకరించుకోవచ్చు. పసుపు కలిపిన చందనం, అష్టగంధం, వృక్షమూలాల రసం, మోదుగ పుష్పాల గుజ్జు, మందార పువ్వులు, గులాబీ పువ్వుల నుంచి తీసిన రసం కలిపిన జలాన్ని హోలి రంగులుగా వినియోగించడం మన సంప్రదాయం. పర్యావరణ హితంగా హోలి నిర్వహించడం వల్ల శరీరానికీ, మనసుకు ఆహ్లాదం చేకూరుతుంది. మొత్తంగా ఈ పండుగ అంతరార్థం అందరూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటమే.
– టి.శ్యామ్‌ప్రసాద్