ఇతరులకు సాయం చేయడం గొప్ప విషయమే! కానీ, మనం చేసే సాయం ఆ వ్యక్తి దీర్ఘకాలిక అవసరాలను ఎంతగా తీర్చగలిగితే అంత విశేషమైనదిగా నిలిచిపోతుంది. అది అతని అవసరాలను శాశ్వతంగా తీర్చగలిగితే మహోన్నత సాయం అవుతుంది. మన బాధలను శాశ్వతంగా తొలగింపజేసేది తత్వజ్ఞానం మాత్రమే! కాబట్టి మనిషి చేసే పారమార్థిక సాయమే లోకంలో సమున్నత, మహోన్నత సాయం అవుతుంది.
మనల్ని ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిలో నిలబెట్టేదే ఉత్తమ సాయం. జ్ఞానాన్ని అందించే విద్యా విషయకమైన సాయానిది తర్వాతి స్థానం. విద్యాదానం.. అన్నదానం, వస్త్రదానాల కన్నా ఉన్నతమైనది. విద్యాదానం తరువాత వచ్చేది భౌతిక సాయం. లౌకిక వ్యవహారాల చుట్టూ పరిభ్రమించే ఏ సాయమూ శాశ్వత ఆనందాన్ని ఇవ్వదు. ఆత్మబలం లోపించిన వ్యక్తి అవసరాలను కూడా సరిగ్గా సమకూర్చుకోలేడు.
సంసార బాధలను ఉపశమింప జేయడానికి భౌతిక సాయం ఒక్కటే చాలదు. వ్యక్తి స్వభావం మారేవరకు ఈ శరీర ఆవశ్యకాలు, దుఃఖాలు సదా కలుగుతూనే ఉంటాయి. ఎలాంటి భౌతిక సాయమూ వీటిని పూర్తిగా తొలగించలేదు. మనిషిని పవిత్రుడిగా చేయడమే ఈ సమస్యకు పరిష్కారం. మనిషిని జ్ఞానిగా, విశుద్ధుడిగా, ఆత్మ బలాధ్యుడిగా, విద్యావంతుడిగా తీర్చిదిద్దడమే నిఖార్సైన సాయం. అప్పుడే లోకంలోని దుఃఖం తొలిగిపోతుంది.
…? చంద్రశేఖర్