మనం చేసే పనే మనకు గుర్తింపునిస్తుంది. నిజాయతీగా సంపాదించే వారి వేడుకోలును అల్లాహ్ స్వీకరిస్తాడని ప్రవక్త చెప్పారు. సమాజంలోనూ పనిమంతుడు అనే బిరుదు కూడా సొంతమవుతుంది. పని చేయడం వల్ల బాధ్యతాభావం అలవడుతుంది. మనలో దాగి ఉన్న శక్తి సామర్థ్యాలు, నైపుణ్యాలను మరుగున పడేయకుండా వాటికి సానబెట్టుకోవచ్చు. దీనికి మించిన గెలుపు సూత్రం మరొకటి లేదు. జీవితంలో ఏది సాధించాలన్నా చెమటోడ్చాల్సిందే. విజయానికి దగ్గరి దారులంటూ ఏమీ ఉండవు. శ్రమించి పనిచేయడమే విజయానికి నాంది. నిత్యం పరిశ్రమించడంలోనే విజయరహస్యం దాగి ఉంది. ఒకరిపై ఆధారపడి వాళ్ల దయాదాక్షిణ్యాలపై బతకడం కంటే మన పని మనమే చేసుకోవడం ఉత్తమం. పనిని పెద్ద కష్టంగా భావించకుండా చేయాలి. ఇష్టపడి చేసినప్పుడే ఏ పనైనా అంతగా శ్రమ అనిపించదు. ఇలా కష్టార్జితంతోనే భార్యాపిల్లలను పోషించాలని, అలాంటి శరీరమే స్వర్గానికి అర్హత సాధిస్తుందని ప్రవక్త చెప్పారు.
ప్రవక్తలంతా శ్రమజీవనాన్ని గడిపినవారే. ప్రవక్త ఈసా (అలై), మూసా (అలై), ముహమ్మద్ ప్రవక్త (స) పశువులను కాసేవారు. దావూద్ (అలై) అనే ప్రవక్త… చక్రవర్తి అయినప్పటికీ ఎంతో కష్టించి ఆర్జించేవారు. ఆయన స్వహస్తాలతో సంపాదించిన కష్టార్జితంతోనే పొట్టపోసుకునేవారని ముహమ్మద్ ప్రవక్త (సఅసం) తమ సహచరులకు తెలిపేవారు. ఒకసారి అల్లాహ్ మార్గంలో దానం చేయాలన్న ప్రవక్త ఆజ్ఞానుసారం సహచరులంతా తమ వద్దనున్న ధనరాశులను, వెండి, బంగారాలను, సంపదనంతా తెచ్చి ధారపోశారు. ఒక పేద సహాబీ కూడా తను కష్టించి సంపాదించిన ఒక ఖర్జూరాన్ని ప్రవక్త సన్నిధిలో తెచ్చిపెట్టారు. ప్రవక్త ఆ ఖర్జూరాన్ని తీసుకొని ధనరాశులన్నిటిపైన అందరికీ కనబడేలా దాన్ని ప్రదర్శించారు. ఎన్నో వెండి, బంగారు, ధనరాశుల కన్నా.. చెమటోడ్చి సంపాదించిన ఈ ఒక్క ఖర్జూరం అల్లాహ్కు ఎంతో ఇష్టమని ప్రవక్త ఆ సందర్భంలో ఆ పేద సహచరుడిని ప్రశంసించారు. అలా శ్రమజీవన సౌందర్యాన్ని ప్రవక్త (సఅసం) ప్రోత్సహించారు.