ప్రవక్త ఇబ్రాహీం (అలైహిస్సలామ్) త్యాగానికి చిహ్నంగా ముస్లింలు ఏటా బక్రీదు పర్వదినాన్ని జరుపుకొంటారు. హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితం బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అడుగడుగునా ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మరెన్నో త్యాగాలు చేశారు. పుత్రునిగా, భర్తగా, తండ్రిగా, ప్రవక్తగా, విశ్వాసపాత్రుడైన దైవదాసుడుగా ఆయన తన కర్తవ్య నిర్వహణలో ఎన్నడూ వెనుకంజ వేయలేదు.
సరిగ్గా ఐదువేల సంవత్సరాల క్రితం సంఘటన.. ప్రవక్త ఇబ్రాహీం (అ) హాజిరా దంపతులు. హజ్రత్ ఇబ్రాహీం (అ)కు వయసు పై బడుతున్న కొద్దీ తన తదనంతరం దైవ సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుండునన్న కోరిక కలిగేది. దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. లేకలేక కలిగిన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. కొంత కాలానికి ప్రవక్త ఇబ్రాహీం (అ)కు ఓ కఠినమైన పరీక్ష ఎదురైంది. ఐతే ఇది మామూలు పరీక్ష కాదు. ఈసారి దైవం ఏకంగా కన్నకొడుకునే బలి చెయ్యమని కలలో ఆదేశించాడు. దివ్యఖురాన్లో ఇబ్రాహీం త్యాగనిరతిని అల్లాహ్ ప్రస్తావించాడు. “మేము అతనికి ఒక సహనశీలుడైన కుమారుడు కలుగుతాడనే శుభవార్తను అందజేశాము. ఆ బాలుడు అతనికి తోడుగా పనిచేసే వయస్సుకు చేరుకున్నప్పుడు (ఒకనాడు) ఇబ్రాహీం అతనితో..“కుమారా! నేను నిన్ను ‘జిబహ్’ (బలి) చేస్తున్నట్లుగా కలలో చూశాను. ఇక నీ అభిప్రాయమేమిటో చెప్పు” అని అడిగాడు. “నాన్నగారూ! మీకు ఆజ్ఞాపించిన దానిని నెరవేర్చండి. అల్లాహ్ సంకల్పిస్తే మీరు నన్ను సహనశీలునిగా చూస్తారు” అని బదులిచ్చాడు. చివరికి ఇద్దరూ దైవాజ్ఞను శిరసావహించారు.
కొడుకు ఇస్మాయీల్ కూడా తండ్రికి తగ్గ తనయుడే. దేవుడు కలలో చూపించిన ఆదేశాన్ని అమలు చేయాలని కొడుకు ఇస్మాయీల్ తండ్రికి ఎంతో నిబ్బరంగా చెప్పాడు. తన తల్లికి సలాములు చెప్పాలని తండ్రిని కోరాడు. తన గుర్తుగా ఈ దుస్తులు తల్లికి ఇవ్వాలని చెప్పాడు. ఇబ్రాహీం (అ) తన కత్తికి పదును పెట్టారు. కుమారుడిని గట్టిగా కౌగిలించుకుని రోదించారు. బరువెక్కిన హృదయంతో కత్తిని లేపారు. పసి ఇస్మాయీల్ గొంతుపై కత్తి వేటు వేశారు. కానీ ఆ కత్తి గొంతును కోయలేదు. ఇబ్రాహీం ఆశ్చర్యపోయారు.
“ఇబ్రాహీం నీవు కలను నిజం చేసి చూపించావు. మేము నీ విధేయతకు బహుమానం ప్రసాదిస్తున్నాము” అన్నాడు అల్లాహ్. దైవానికి కావలసింది బలికాదు. ఆయన నిబద్ధతను పరీక్షించదలిచాడు. ఇస్మాయీల్కు బదులుగా బలివ్వడానికి స్వర్గంనుంచి పొట్టేలును పంపించాడు అల్లాహ్. పొట్టేలును బలిచ్చారు. ఈ త్యాగానికి ప్రతీకగానే ముస్లింలు ఏటా బక్రీదు పండుగను జరుపుకొంటారు. ఆ నాడు ఆ తండ్రీకొడుకులు చేసిన త్యాగాన్ని స్మరిస్తూ నేడు ముస్లింలు ఖుర్బానీ ఇస్తుంటారు. నాడు వారిద్దరు తమ సర్వస్వాన్ని త్యాగం చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దైవమార్గంలో పణంగా పెట్టారు. అలా ఖుర్బానీ ఇచ్చిన మాంసాన్ని పేదలకు పంచిపెడతారు.
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076