శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్టానాలు, రుద్రపారాయణలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంత్రం హోమాల అనంతరం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంపై వేంచేపు చేసి, అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు చేశారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ ఆలయోత్సవం, గ్రామోత్సవం నిర్వహించారు.
గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఊరేగింపు ఆద్యంతం కనులపండువలా సాగింది. శోభాయాత్రలో కళాకారుల ప్రదర్శనలు అలరించాయి. అనంతరం కాళరాత్రిపూజ, మంత్రపుష్పం, ఆస్థాన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ మురళీబాలకృష్ణ, పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈఓలు హరిదాస్, ఫణీందర్ ప్రసాద్, శ్రీశైల ప్రభ సంపాదకులు అనీల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నర్సింహరెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో శ్రీశైల క్షేత్రం కిటకిటలాడుతున్నది. ఉదయం నుంచి కృష్ణా నదీలో స్నానాలు పూర్తి చేసుకొని, ఆ తర్వాత ఆలయానికి చేరుకొని క్యూలైన్లలో బారులు తీరారు. శివన్నామస్మరణ చేస్తూ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీ మేరకు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ముడుపులు చెల్లించేందుకు శివస్వాములకు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటు చేసి, మాలవిరమణ చేయిస్తున్నారు. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద సైతం మాల విరమణ చేయించారు. ఈ సందర్భంగా క్షేత్ర ప్రధాన ప్రాంతాలతో పాటు పాతాళగంగ వద్ద స్నానఘట్టాలను ఈవో లవన్న పరిశీలించారు. దేవస్థానం నిర్వహించే అన్నదాన భవనంలో అల్పాహార భోజన సదుపాయాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలో ఏర్పాటు చేసిన కళారాధన వేదికతోపాటు పుష్కరిణి, నిత్యకళావేదిక, శివదీక్షా శిబిరాల్లో భూకైలాస్ హరికథా గానం, శివపార్వతుల కథాగానం, సత్యహరిశ్చంద్ర నాటికలతోపాటు కూచుపూడి భరతనాట్య కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఇదిలా ఉండగా.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు శుక్రవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు శాస్ర్తోక్త పూజలు నిర్వహించి సాయంత్రం మయూర వాహనసేవ నిర్వహించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. ఉదయం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి, సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.