తిరుపతి : తిరుపతి ( Tirupati ) శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో (Brahmotsavams) ఏడో రోజు ఆదివారం గోవిందరాజస్వామి సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.
సూర్యుడు తేజోనిధి, సకలరోగ నివారకుడు, ప్రకృతికి చైతన్యప్రధాత. వర్షాలు, వాటివల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఔషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయని అర్చకులు వెల్లడించారు . అనంతరం సతీసమేతంగా గోవిందరాజస్వామివారికి స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, చందనంతో స్వామివారికి అభిషేకం చేశారు.
రాత్రి 7.30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తారని వివరించారు. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈవో మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.