e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home ఎడిట్‌ పేజీ అందరి దైవం ఒక్కడే!

అందరి దైవం ఒక్కడే!

అందరి దైవం ఒక్కడే!

‘దేవుడొక్కడే’ అని మానవులందరూ అంగీకరించినా, దేవాలయాల దగ్గరికి వచ్చేటప్పటికి ‘ఇది మా దేవాలయం కాదు, ఇందులో ఉన్నది మా దేవుడు కాదు. ఈ గుడికి నేను పోనక్కర్లేదు, పోను’ అన్న భావన కొందరిలో సహజమై పోతున్నది. ఇంతవరకు పరవాలేదు. కానీ, ‘మా దేవాలయంలో ఉన్నవాడు మాత్రమే దేవుడు. ఈ ఆలయంలోని వాడు దేవుడు కాదు. అసలిది దేవాలయమే కాదు’ వంటి ఆలోచనలు మాత్రం సమాజానికి హానికారకాలు. ఇది ‘రజోగుణం’తో కూడిన ‘అసురీ ప్రవృత్తి’. ‘ఈ దేవాలయాన్ని నేలమట్టం చేసి, ఇందలి దేవతామూర్తులను అపవిత్రం చేస్తే కానీ మా దేవుడు సంతోషించడు’ అన్న భావన ‘తామసగుణం’తో కూడిన రాక్షస ప్రవృత్తి.
‘రాక్షసత్వంతో కూడిన అసురీ ప్రవృత్తిని గొప్పనైన మతాచరణంగా’ కొందరు భావిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే, ఇలాంటివారు తమను తాను అత్యాధునికులుగానే భావించుకుంటారు. అత్యుత్కృష్టమైన పద్ధతిలో భౌతిక జీవనం గడిపే వీరు ఆధ్యాత్మిక జీవనాన్ని మాత్రం ఆదిమ మానవుని కన్నా నికృష్ట స్థాయిలో కొనసాగిస్తుంటారు. భగవంతుడు కేవలం ఆత్మ సంబంధి. జీవాత్మ దేహాన్ని ధరించి ఉన్నది కనుక ఆత్మ సంబంధ విషయం సైతం ఏదో ఒక మేరకు కాయిక నడవడిలో వ్యక్తమవక తప్పదు. భగవంతునికి సంబంధించిన ఆలోచన మనోబుద్ధి చిత్యహంకారాలకు పరిమితమైనప్పుడు అది ‘నిర్గుణ పరమాత్మారాధనం’ కిందకు వస్తుంది. భగవదారాధన కాయిక రూపాన్ని ధరించినప్పుడు అది ‘సగుణారాధనం’ అవుతుంది. సగుణారాధనమే తర్వాత ఆచారమవుతుంది. ‘దేవునికి రూపం లేదు. అతడు సర్వవ్యాపి, అనంతుడు’ అని ప్రచారం చేసేవారికి సైతం ఒక ఆచార పరంపర ఉంటుంది. నిర్దుష్టంగానూ, నియమ సహితంగాను చేసే పనులను లౌకిక వ్యవహారంలో ‘ఆచారమని’ పిలుస్తాం. భగవంతుని పేరు మీదుగా నడిచే ఆచార వ్యవహారాలతో కూడిన వ్యవస్థను ‘మతం’ అంటారు. భగవత్సంబంధమైన ఆలోచనలు భౌతికస్తరంలో ధరిస్తున్న రూపభేదాలకే మానవుడు ‘మతాలని’ పేరు పెట్టుకున్నాడు. ఆలోచన ఒక్కటే. ఆచరణలో రూపాలు మారుతున్నాయి. కానీ, మనిషి ఆచారాన్నుంచొ ఆత్మవైపునకు పయనించడానికి ఇష్టపడుతున్న కారణంగా ఏ మతానికి ఆ మతం ఒక ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. ప్రతి మతమూ తనదైన ప్రత్యేక దైవాన్ని నెలకొల్పుకొంటున్నది. దీంతో మతభేదం కాస్తా దేవతల మధ్య విభేదంగా పరిణమిస్తున్నది. మానవుల మధ్య ఉండే వైమనస్యాలు దేవుళ్లకు ఆపాదితమవుతున్నాయి. అరిషడ్వర్గాలకు లోనైన మానవులు తమ మదోన్మత్తతకు దేవుళ్ల పేర్లను తగిలించి కొట్టుకుచావడం బాధాకరం. నికృష్టమైన మానవ మారణహోమాలు ‘దైవయుద్ధాలు’గా తయారవడం మరో వైచిత్రి.
ఈ దుస్థితి నుంచి మానవాళిని రక్షించేందుకే జగద్గురువైన ఆది శంకరుడు ‘పంచాయతన విధానాన్ని’ ప్రవేశపెట్టాడు. తన కాలం నాటి ఉపాసనా మార్గాలన్నిటినీ ఆయన ‘ఆరు ప్రధాన మతాలు’గా వర్గీకరించాడు. అవి: సౌరము, గాణాపత్యం, స్కంధము, శాక్త్యము, శైవము, వైష్ణవము. ఈ పంచాయతన విధానం ప్రకారం గర్భాలయంలో ప్రధాన దైవం ఉంటాడు. ప్రధానాలయానికి నాలుగు మూలలా నాలుగు ఉపాలయాలు ఉంటాయి. వానిలో నలుగురు వేరే మతాల దేవుళ్లుంటారు. ఉదాహరణకు ‘శివపంచాయతన క్షేత్రం’లో ప్రధానాలయంలో శివుడుంటే, ఉపాలయాల్లో విష్ణువు, గణపతి, కుమారస్వామి, అమ్మవారు ఉంటారు. ఇదే పద్ధతిలో విష్ణు (వైష్ణవం), ఆదిత్య (సౌరం) ఇత్యాది పంచాయతనాల ఆలయాలుంటాయి. ఇలా, ఏ మతానుయాయి మరే గుడికైనా వెళ్లవచ్చు. తన ఉపాస్య దేవతను కొలుచుకోవచ్చు. లేదా అన్ని గుళ్లనూ సందర్శించి, ‘అందరిలోను ఉన్న పరమాత్మ ఒక్కడే’ అన్న గుర్తింపునకూ రావచ్చు. కానీ, అభారతీయ మతాలు విజృంభించి భారతావనిని అతలాకుతలం చేస్తున్న ఈ తరుణంలో ‘వినూత్న పంచాయతనాల’ను నిర్మించడానికి మరో ఆది శంకరుని అవసరం మనకెంతైనా ఉంది.

అందరి దైవం ఒక్కడే!వరిగొండ కాంతారావు
94418 86824

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
అందరి దైవం ఒక్కడే!

ట్రెండింగ్‌

Advertisement