ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దైవశక్తిలో అసమగ్రమైన భాగాలే. ప్రతి మనిషికీ ఆత్మాభిమానం ఉండొచ్చు కానీ, అహంకారం ఉండగూడదు. తాను చేసే పనిమీద గట్టి నమ్మకం, చేపట్టిన కార్యాన్ని తప్పక నెరవేర్చుకోగలను అన్న విశ్వాసమే ఆత్మాభిమానం. దానికి తగ్గట్టుగానే శ్రమించాలి. నమ్మిన దేవుడ్ని దానికి ముందుంచి అనుకున్న లక్ష్యం వైపు మున్ముందుకు సాగిపోవాలి. ఇక్కడ సద్గుణాల సమ్మేళనంతోపాటు తనపై, తాను నమ్మిన దైవంపై ప్రగాఢ విశ్వాసం ప్రకటితమవుతుంది. దీనికి భిన్నమైంది, నేను అనే భావం!! ‘నేనే సర్వం, సర్వజ్ఞుడను నేనే’ ఆని విర్ర వీగడం అహం. ‘నన్ను మించిన వాడు లేనే లేడు. ఇంకెక్కడ ఉండకూడదు’ అనుకోవడం అహంకారం. ఇది వినాశన హేతువు. ‘దేవుడు అహంకార ద్వేషి’ అంటుంది క్రీస్తు ధర్మం (సామెతలు 8:13).
దైవం వాక్కు పట్ల అవిధేయత, నిర్లక్ష్యం.. ఈ రెండూ అహంకారానికి బిడ్డల్లాంటివి. ప్రజలకు మేలు కార్యాలు తలపెట్టడానికి ఇష్టపడని దుష్టుడే ‘దేవుడు లేడ’ని పేలుతుంటారు. ఇది అహంకృతితో సాగే విషయమే. కనుక ఈ పాపానికి పుట్టినిల్లు అహంకారమే అని చెబుతుంది దావీదు కీర్తన (10:4). ‘నాశనమునకు ముందు గర్వము నడచును. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడచును’ అని సోలోమన్ రాజు సామెతలు (16:18) చెబుతున్నది. సాతాను కూడా ఒకా నొకప్పుడు దైవ సన్నిధిలో ఉన్నవాడే! అవిధేయత, తిరుగుబాటు. అహంకారం వల్లే అతను స్వర్గంలో ఉండే అర్హత కోల్పోయాడు. అందుకే, అహం వీడితేనే ప్రభువు ఆశీస్సులు పొందే అర్హత లభిస్తుంది.