తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు రథాన్ని అధిరోహించి ఆలయ మాడవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కళాబృందాల కోలాటాలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఊంజల్‌సేవను వైభవంగా నిర్వహించనున్నారు.
రాత్రి 8 నుంచి 10 గంటల వరకు అశ్వ వాహనంపై శ్రీ కోదండరామస్వామివారు భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహనసేవలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో పార్వతి, ఏఈవో దుర్గరాజు, కంకణబట్టార్ ఆనందకుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ రమేశ్, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.