ఏవం యస్తు విజానాతి స్వగురో రుపదేశతః
స సాధ్వసాధు కర్మాభ్యాం సదా న తపతి ప్రభుః
‘ఎవరు గురూపదేశంతో పరబ్రహ్మాన్ని తెలుసుకుంటున్నాడో, అతను కర్మలచేత పరితాపం పొందడు..’ అని భావం. దీనికి వాల్మీకి మహర్షి వృత్తాంతమే మంచి
ఉదాహరణ.
వాల్మీకి పేరు పూర్వాశ్రమంలో రత్నాకరుడు. చిన్నప్పుడే అడవిలో దారి తప్పి, ఒక బోయవానికి దొరికి అతని దగ్గర పెరిగాడు. బందిపోటుగా మారి, బాటసారులను దోచుకునే వాడు. ఒకరోజు నారద మహర్షిని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ‘ఎవరికోసం ఇంత పాపం మూట కట్టుకుంటున్నావు ప్రతిరోజూ? ఎవరికోసం ఇంత ఘోరంగా దారిదోపిడి చేస్తున్నావు?’ అని ప్రశ్నించాడు మహర్షి. దానికి రత్నాకరుడు ‘భార్యాపిల్లల కోసం’ అన్నాడు. ‘అయితే నీ పాపంలో వారికి భాగం ఉందా!’ అన్నాడు నారదుడు. రత్నాకరుడు ఇంటికి వెళ్లి భార్యా పిల్లలను అడిగాడు. ‘నీ పాపాలతో మాకు సంబంధం లేద’న్నారు వాళ్లు. ఈ సంఘటనతో జ్ఞానోదయం పొంది, నారదుని శరణు వేడుకున్నాడు రత్నాకరుడు. తరుణోపాయం చెప్పమన్నాడు.
అప్పుడు నారద మహర్షి ‘రామ రామ’ అని పలకమన్నాడు. ఇదేదో చాలా సులభమే అనిపించింది రత్నాకరునికి. కానీ, స్పష్టంగా పలకలేపోయాడు. ‘పోనీ.. నీకు తోచినట్టు పలుకు. ఏం ఫర్వాలేదు‘ అన్నాడు. రత్నాకరుడు ‘మరా మరా మరా మరా’ అంటూ అలాగే కూర్చుండిపోయాడు. కాలక్రమేణా అది ‘రామ రామ’గా మారింది. రత్నాకరుడు ఆ నామ ధ్యానంలో పూర్తిగా లీనమైపోయాడు. అదే సుదీర్ఘమైన తపస్సు అయింది. ఆయన శరీరం చుట్టూ పుట్ట మొలిచింది. పుట్టను సంస్కృతంలో వల్మీకం అంటారు. పుట్టలోనుంచి బయటికి వచ్చాడు కాబట్టి ఆయనకు ‘వాల్మీకి’ అని పేరు వచ్చింది. ఆ తర్వాత బ్రహ్మదేవుడి ఆదేశం మేరకు 24వేల శ్లోకాలతో సంస్కృతంలో ఆదికావ్యమైన రామాయణాన్ని రచించాడు. అది లోక ప్రసిద్ధమైంది. వాల్మీకి తన గురువైన నారద మహర్షి ఉపదేశించిన రామ నామాన్ని త్రికరణశుద్ధిగా జపిస్తూ, దుష్కర్మలన్నీ పోగొట్టుకొని పరమ పవిత్రుడయ్యాడు. రామబ్రహ్మమును తెలుసుకున్నాడు. లోక మంతటికీ ప్రాతః స్మరణీయుడయ్యాడు.