యదా హ్యేవైష ఏతస్మిన్నల్ప మప్యంన్తరం నరః
విజానాతి తదా తస్య భయం స్యాన్నాత్ర సంశయః॥
(కఠ రుద్రోపనిషత్తు 28)
‘ఎపుడు మనుజుఁడు పరబ్రహ్మమునందు స్వల్పమైనను భేదమును గాంచునో (జీవ బ్రహ్మముల మధ్య..) అపుడే వానికి భయము కలుగును. సంశయము లేదు’ అని పై ఉపనిషత్ వాక్యానికి అర్థం. దీనికి బలం చేకూర్చే కథ ఇది. ఓ శతాబ్దం కిందటి మాట. కాశీలో ఒక స్వామివారు ఉండేవారు. ఆయనది భారీ విగ్రహం, బానకడుపు. మెడలో రుద్రాక్షమాల ధరించేవారు. ఆయన ఎప్పుడూ మౌనంలోనో, ధ్యానంలోనో ఉండేవారు. అన్నం ఎప్పుడో గానీ తినేవారు కాదు. భక్తులు సమర్పిస్తే పెరుగు, పాయసం లాంటివి కుండలకొద్దీ తాగేసేవారు. ఒకసారి ఒక భౌతికవాదికి ఆయన్ని ఆట పట్టించాలనిపించింది.
సున్నం కలిపిన నీటిని కుండ నిండా పట్టాడు. ‘స్వీకరించండి స్వామీ !’ అంటూ ఎంతో భక్తి నటిస్తూ ఆయన ముందుంచాడు. ఆ యోగి కుండ ఎత్తి గడ గడా నీళ్లన్నీ తాగేశారు. ఆ భౌతికవాదిలో ఏదో కలవరం మొదలైంది. తనను రక్షించాల్సిందిగా వేడుకున్నాడు. అప్పుడు ఆ మహాయోగి మౌనాన్ని విడిచి ‘నీ ప్రాణం ఎటువంటిదో నా ప్రాణం కూడా అటువంటిదే కదా! సృష్టిలో భగవంతుడు ప్రతిదానిలో ఉన్నాడు. నా పొట్టలోనూ ఉన్నాడు. ఆ జ్ఞానం నీకు లేకపోయింది. నాకు ఉన్నది.
అదే లేకుంటే సున్నం నన్ను చంపేది. ఎవరు చేసింది వారికే బెడిసి కొడుతుంది. ఇంకెప్పుడూ ఇలా చేయకు’ అని సున్నితంగా మందలించారు. ఆ మాటలు విన్న భౌతికవాది అక్కణ్నుంచి పలాయనం చిత్తగించాడు. స్వామి తనలాంటి సామాన్యుడు కాదన్న భేదాన్ని గుర్తించాడు. అదే భయానికి కారణమైంది. ఎన్నో మహిమలు చూపిన ఆ యోగి పుంగవుడే ‘త్రైలింగస్వామి’. విజయనగరం దగ్గర ‘హాలియా’ గ్రామంలో జన్మించారు. ఆయన మొదటి పేరు శివరాముడు. త్రైలింగస్వామి 200 సంవత్సరాలకుపైగా జీవించారని చెబుతారు. రామకృష్ణ పరమహంసకు మార్గదర్శకుడైన మహానుభావుడు.
– డా॥ వెలుదండ సత్యనారాయణ