శరణాగతి-గజేంద్ర స్తుతి
శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి, గజేంద్రుడు అవిశ్రాంతంగా ఆర్తితో ఆలపించిన శ్రుత్యంత (ఉపనిషత్) సారభూతమై, అత్యంత మహిమోపేతమైన స్తుతిని- శరణాగతిని వినిపిస్తున్నాడు. హృదంతరంలోని భగవంతుని నిరంతర ధ్యానం,
కం॥‘లోకంబులు లోకేశులు
లోకస్థులుఁ దెగిన తుది నలోకం బగు పెం
జీఁకటి కవ్వల నెవ్వం
డే కాకృతి వెలుగు నతని నే సేవింతున్
శుక యోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రునికి, గజేంద్రుడు అవిశ్రాంతంగా ఆర్తితో ఆలపించిన శ్రుత్యంత (ఉపనిషత్) సారభూతమై, అత్యంత మహిమోపేతమైన స్తుతిని- శరణాగతిని వినిపిస్తున్నాడు. హృదంతరంలోని భగవంతుని నిరంతర ధ్యానం, స్వామి విధానం- వ్యవస్థలో సంతుష్టి, భగవదాజ్ఞా పాలనం, నిష్కామ భావం- ఈ అనుష్ఠానమే శరణాగతి. కాళీతంత్రమనే గ్రంథం ‘షడ్విధా శరణాగతిః’ అంటూ శరణాగతికి ఆరు లక్షణాలు ఉండాలని విలక్షణంగా వర్ణించింది. మొదటిది ‘ఆనుకూల్యస్య సంకల్పః’- పరమాత్మకు (శాస్ర్తానికి) అనుకూలమైన సంకల్పాలే కలిగి ఉండుట. రెండోది ‘ప్రాతికూల్యస్య వర్జనం’- ప్రతికూల- శాస్త్రవిరుద్ధ సంకల్పాలను విరమించుట. మూడోది ‘రక్షిష్యతీతి విశ్వాసః’- భగవంతుడు కాపాడి అక్కున చేర్చుకుంటాడన్న చెక్కుచెదరని నమ్మకం. నాలుగోది ‘గోప్తృత్వవరణం’- భగవంతుణ్నే ఉద్ధారకుడిగా (రక్షకుడిగా) నిర్ధారించుకొని వరించుట. ఐదోది ‘ఆత్మ నిక్షేపం- తనను తాను సంపూర్ణంగా సర్వేశ్వరుడికి సమర్పణం చేసుకొనడం. అంతిమంగా ఆరోది ‘కార్పణ్యం’- దైన్యం, అనగా ‘పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః’ అన్న దీనభావం కలిగి ఉండుట. ‘పరమాత్మకు అభిమానం- అహంకారమంటే ద్వేషం. దైన్యమంటే మిక్కిలి మక్కువ’ అని నారద భక్తి సూత్రం. ఇదే సంపూర్ణ శరణాగతి! పై లక్షణాలలో ఏ ఒక్కటి హీనమైనా- లోపించినా, శరణాగతి ఆ మేరకు న్యూనం- అపూర్ణం (తక్కువ) అవుతుంది.
గజేంద్రుడు శరణార్థియై కరుణా సాగరుని, వరుణాలయ- సముద్రం వలె, గంభీరుని తలుస్తూ తరణోపాయం తెలుపమని అర్థించాడు. తపస్సు ఫలించి, తీవ్ర వైరాగ్యం జనించి, తత్త జిజ్ఞాసతో హృదయం వికసించింది. ఈ దశలో కరీంద్రుడు ధ్యానించిన దేవుడు పరిచ్ఛిన్నుడు- పరిమితులు కలిగిన చిన్నపాటి చిల్లరదేవుడు కాదు. అపరిమిత అఖండ చైతన్య స్వరూపుడైన స్వప్రకాశ పరంజ్యోతి. వస్తుతః నిర్గుణుడు- జన్మ కర్మలు, నామ రూపాలు, గుణ దోషాలు లేనివాడు. ఐనా విశ్వ సృష్టి, స్థితి, లయాలనే కార్య నిర్వహణ కొరకు కాలానుగుణంగా ఆయా జన్మకర్మలను తన మాయాశక్తితో స్వీకరిస్తాడు. కాయా (దేహ) రహితుడైన అనంతరూపుడు. అత్యద్భుత కర్మలు సాధించు అఖిల శక్తిధరుడు!
గజేంద్ర ఉవాచ- ‘ఎవ్వనిచే జనించు జగము… వానినాత్మ భవునీశ్వరునే శరణంబు వేడెదన్’- స్వప్నాన్ని- కలను విశ్లేషిస్తే సంసారమనే దుస్సప్నం- పీడకల పీడ శాశ్వతంగా విరగడైపోతుంది. స్వప్నం ఎవనిలో ఉంది? ద్రష్ట అనగా చూసేవానిలోనే ఉంది. అది ఎవని నుంచి ఏర్పడింది? ద్రష్ట నుంచి. స్వప్నం అంటే ఏమిటి? స్వప్న ద్రష్టయే స్వప్నం. స్వప్నమనేది కార్యం, దానికి నిద్ర కారణం. ఈ కార్యకారణాలు రెంటికీ అతీతుడు స్వప్నద్రష్ట. వాడే ఆత్మభవుడు- స్వయంభువు! స్వప్నం స్వప్నద్రష్ట కార్యమైనట్లే జగత్తు కూడా జగద్ద్రష్ట కార్యం. జగత్తు బ్రహ్మనుంచే పుడుతోంది. బ్రహ్మలోనే ఉంటోంది. బ్రహ్మవల్లనే తెలియబడుతోంది. అసలు బ్రహ్మే ఇలా జగత్తుగా ప్రతీతమవుతున్నాడు- కనిపిస్తున్నాడు.
‘ఒకసారి లోకాలను వ్యక్తపరుస్తూ- బయటకు చూపిస్తూ, మరోసారి వాటిని అవ్యక్తం చేస్తూ- కనబడకుండా లోపలికి చేర్చుకుంటూ, ఆ లోకాల వ్యక్త-అవ్యక్తాలు (భావ- అభావాలు)- ఉనికి, లేమి- రెండూ తానే అయి, రెంటికీ ద్రష్టయై, సమస్త విషయాలకు సాక్షిగా ఉండే ద్వైత ప్రపంచ రహితుడు, రాగద్వేషాది దోషాలు- కల్మషాలు లేని పరమశాంత కళ్యాణ రూపుడు, ఆత్మమూలుడైన పరమాత్ముని శరణార్థినై ఆసక్తితో
ధ్యానిస్తాను’‘ప్రకటమైన పదునాలుగు లోకాలు, లోకేశులు- ఆ లోకాలను పాలించేవారు, లోకస్థులు- లోకులు అనగా ఆయా లోకాలలో నివసించేవారు అంతా అంతమొందిన- లయించిన అనంతరం, అలోకంబగు- ఇక కనిపించే లోకమే (దృశ్యమే) లేని పెను చీకటే మిగులుతుంది. ఆ కటిక చీకటికి అవతల అఖండ జ్యోతి స్వరూపంగా వెలిగే (ఏకమేవ అద్వితీయం బ్రహ్మ) ఏకైక దేవుని నేను భావించి భజిస్తాను- సేవిస్తాను.’
కం॥ ‘ఒకపరి జగముల వెలి నిడి
యొకపరి లోపలికిఁ గొనుచు నుభయముఁ దానై
సకలార్థ సాక్షి యగు న
య్యకలంకుని నాత్మమూలు నర్థిఁదలంతున్’
ఊర్ధ లోకాలు ఏడు, అధో లోకాలు ఏడు. ‘దృశ్యవర్గో లోకః’- దృశ్య సముదాయాలే లోకాలు. నామ, రూపాలుగా కళ్లకు, చెవులకు కనిపించి, వినిపించేవి కాన లోకాలు. వేదాంత శాస్త్ర పరంగా ఈ లోకాలు ‘అధి భూతములు’ అనబడతాయి. వీటికి పదునాలుగు మంది అధిపతులు. వీరే ‘అధిదేవతలు’. ఈ లోకాలలోని జడ, చేతనాత్మకాలైన వస్తు- పదార్థ సముదాయం లోకస్థులు. ఇది ‘అధ్యాత్మం’. ‘అధి భూతం, అధి దైవం, అధ్యాత్మం’ ఈ త్రిపుటి సమష్టి బ్రహ్మాండానికి (మేక్రో లేక యూనివర్స్) సంబంధించింది. ఇక వ్యక్తి (మైక్రో లేక ఇండివిడ్యువల్) పరంగా విచారిస్తే- ‘యద్ బ్రహ్మాండే తత్ పిండాండే’ (బ్రహ్మాండం- సమష్టిలో ఉన్నదే పిండాండం- వ్యష్టిలో కూడా ఉంది) అన్న వేదాంత సిద్ధాంతాన్ని అనుసరించి పదునాలుగు లోకాలంటే మనలోని పదునాలుగు ఇంద్రియాలు (పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనో బుద్ధి చిత్త అహంకారాలు). లోకేశులు అనగా ఇంద్రియాలకు అధిష్ఠాన దేవతలు. ఈ ఇంద్రియాలకు సంబంధించిన వివిధ విషయాలే- వృత్తులే లోకస్థులు. ఈ వ్యష్టి ‘త్రిపుటి’ కారణ రూపమైన అవిద్య- సుషుప్తి (గాఢనిద్ర)లో లయించి ఏవీ కనిపించకుండా- తెలియకుండా పోతాయి. అదే తమస్సు- పెంజీకటి, అచ్చపు జీకటి! ‘సుఖంగా నిద్రించాను, ఏమీ తెలియలేదు’ అన్నది గాఢనిద్రలో జీవుని అనుభవం. ఈ తెలియనితనానికి అనగా ‘అజ్ఞానానికి- పెంజీకటికి ‘సాక్షి’గా వెలుగుతున్న వాడే పరమాత్మ! సుషుప్తిలో ప్రపంచం లేకపోయినా, ఆ లేమికి ద్రష్టగా తాను (పరమాత్మ) ఉండనే ఉన్నాడు. ఆ దృష్టికి- జ్ఞానానికి లోపమనేది ఎప్పుడూ ఉండదు. ‘ఆత్మ మూలున్- ఇక్కడ ‘ఆత్మ’ అనగా అహంకారం అని కూడా అర్థం చెప్పారు. ఎక్కడినుంచి అహంకారం ఉదయిస్తుందో వాడు ఆత్మమూలుడు. అట్టి పరాత్పరుడు నన్ను కాపాడుగాక! అని గజేంద్రుని ప్రార్థన.
మూలంలోని గంభీర, గూఢ అర్థం కలిగిన రెండు వేదాంతపరమైన శ్లోకాలకు పై రెండు కందపద్యాలు సహజ పాండిత్యుడైన పోతనకే చేతనైన నిజాయితి, నిబద్ధతతో కూడిన తెనుగు సేత! అమాత్యుని సర్వంకష అనువాద కళా ప్రతిభకు నికషోపలాల (ఒరిపిడి రాళ్లు) వంటి ఇట్టి ఆలోచనామృతాలైన పద్యాలు పోతన భాగవతంలో పర శ్శతాలు. శ్రీపతి పదారవిందాల వలె అందమైన ఈ కందపద్యాల మకరంద మాధుర్యాన్ని గ్రోలు భక్త బృందాల భవ (సంసార) బంధాలు సమసి పోతాయనడంలో సందేహమేముంది? (సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

