ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ‘ధన త్రయోదశి’గా వ్యవహరిస్తారు. ఈ పర్వదినంతోనే దీపావళి పండుగ వేడుకలు మొదలవుతాయి. ఆనాటి ఉదయం లక్ష్మీదేవి భూమికి దిగివస్తుందని, అంతటా సంచరిస్తుందని పెద్దల మాట. శుచి, శుభ్రత, సంప్రదాయం పాటించే ఇల్లు ఎక్కడైనా కనిపిస్తుందా! అని చూస్తుందట. అమ్మవారికి స్వాగతం పలుకుతూ ఉదయాన్నే ఇల్లూ, వాకిలీ శుభ్రం చేసుకొని, ముగ్గులు తీర్చిదిద్దాలి. ఇంట్లోవారంతా అభ్యంగన స్నానం చేసి, శుభ్రమైన వస్ర్తాలు ధరించి, పూజామందిరాన్ని మంగళకరంగా అలంకరించుకొని లక్ష్మీపూజ చేయాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇక లక్ష్మీదేవి పూజలో భాగంగా ఇంట్లో వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు ఆవుపాలతో శుభ్రం చేసి పూజామందిరంలో ఉంచాలి. లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ వాటిని పూజించాలి.
సంపదను సత్కార్యాలకు సద్వినియోగం చేయటమే లక్ష్మీదేవి ఆరాధనలో ఆంతర్యం. ఇందుకు తగిన సంకల్పంతో దీక్షను పొందడానికి ధనత్రయోదశి వేదికగా నిలుస్తుంది. ఆనాడు లక్ష్మీపూజ చేసినవారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని ‘చతుర్వర్గ చింతామణి’ గ్రంథం వివరిస్తున్నది. ఆనాటినుంచి దీపావళి వరకు మూడురోజులపాటు ‘గో త్రిరాత్ర వ్రతం’ నిర్వహించాలని, గోమాతను లక్ష్మీ స్వరూపంగా గుర్తించి గో సేవ చేయాలనీ ఆ గ్రంథం చెబుతున్నది. ధనత్రయోదశి నాడు పితృదేవతలు తమ వారసులను ఆశీర్వదించటానికి భూమికి దిగి వస్తారని, వారికి దారి చూపటానికి ఇంటిలో దక్షిణం వైపుగా దీపం పెట్టాలని కూడా పెద్దలు సూచించారు. దీనిని ఆచరించినవారికి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ఇంటిని ఆవు నెయ్యితో వెలిగించిన దీపాలతో అలంకరించి, దీపదానం చేయటం కూడా సంప్రదాయంలో భాగం. లక్ష్మీపూజ, గోసేవ, దీపారాధన, దీపదానం, పితృదేవతారాధన ఇవన్నీ ధనత్రయోదశి ప్రత్యేకతలు.
అమృత పురుషుడి ఆవిర్భావం
ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి నాడే దేవ వైద్యుడైన ధన్వంతరి జన్మించాడని చెబుతారు. అందుకే దీనిని ‘ధన్వంతరి త్రయోదశి’గానూ సంబోధిస్తారు. మహావిష్ణువు 21 అవతారాల్లో ధన్వంతరి ఒకటని పురాణాల ద్వారా తెలుస్తున్నది. అమృతం కోసం దేవదానవులు పాలకడలి చిలుకుతుండగా మొదట హాలహలం వచ్చింది. దానిని పరమశివుడు స్వీకరించి, కంఠంలో నిలిపాడు. తర్వాత కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. చివరగా అమృత కలశం, ఔషధులు చేతబూని ధన్వంతరి ఆవిర్భవించాడు. అందుకే ధన్వంతరిని అమృత పురుషుడు అని పిలిచారు. ‘ధన్వంతరి’ అంటే చికిత్సకు లొంగని వ్యాధులను నశింపజేయువాడు అని అర్థం. వైద్య విధానాలను వివరించే 18 మహాగ్రంథాలను ధన్వంతరి లోకానికి అందించారని పురాణాలు చెబుతున్నాయి.
-శ్రీ