తిరుమల : రథ సప్తమి వేడుకల సందర్భంగా తిరుమలలో (Tirumala) భక్తులు స్వామివారి దర్శనానికి భారీగా తరలివచ్చారు. ముఖ్యగంగా రథ సప్తమి (Rathasapthami) రోజున ఒకే రోజు ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ వాహనాల్లో భక్తులకు స్వామివారు కనువిందు చేయనుండడంతో భక్తుల రద్దీ పెరిగింది. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై మాడ వీధుల్లో ఊరేగారు.
రథసప్తమి నేపథ్యంలో వాహనాల సేవల్లో పాల్గొనే భక్తులకు నాలుగు మాడ వీధుల్లో దాదాపు 200 గ్యాలరీలు టీటీడీ(TTD) ఏర్పాటు చేసింది. ఇక 66 అన్నదాన కౌంటర్లు, 351 టాయిలెట్లు ఏర్పాటు చేశారు. రథసప్తమికి 3,500 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. మాడ వీధుల్లో గ్యాలరీలలో అత్యవసర పరిస్థితి తలెత్తకుండా అగ్నిమాపక, మెడికల్ టీమ్లను అందుబాటులో ఉంచారు. రథసప్తమికి వచ్చే భక్తులను ఆకట్టుకునే విధంగా టీటీడీ అలంకరణ చేపట్టింది. విద్యుత్ దీప అలంకరణలతో పాటు ఫల పుష్పాలతో ఆలయాన్ని అలంకరించింది.
7 వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్న మలయప్ప స్వామి వాహనసేవలను దర్శించేందుకు రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది . రథ సప్తమి సందర్భంగా 3 రోజులు పాటు ఎస్ఎస్డీ టోకన్లు జారీని టీటీడీ నిలిపి వేసింది. భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2 నుంచి సర్వదర్శనం చేసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. రథసప్తమి సందర్భంగా అన్ని ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు వివరించారు.
సర్వదర్శనానికి 18 గంటల్లో సర్వదర్శనం
నిన్న స్వామివారిని 59,784 మంది భక్తులు దర్శించుకోగా 20,740 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.61 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. స్వామివారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు తెలిపారు.