‘యథాకారీ యథాచారీ తథా భవతి..
సాధుకారీ సాధుర్భవతి, పాపకారీ పాపో భవతి’
మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఏ పనులు చేస్తాడో.. అదే అవుతాడు. పుణ్య కార్యాలు చేసేవాడు పుణ్యాత్ముడు అవుతాడు. పాప కార్యాలు చేసేవాడు పాపి అవుతాడు. అంటే, మన కర్మలే మన భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి.. అని పై బృహదారణ్యక ఉపనిషత్తు శ్లోకానికి భావం.
కృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను విడిపించటానికి కారాగారానికి వెళ్లాడు. కృష్ణుడు పుట్టినప్పుడే చూసింది దేవకీమాత. మళ్లీ 14 ఏండ్ల తర్వాత ఇప్పుడు చూస్తున్నది. కృష్ణుడు పుట్టగానే కంసుని భయానికి ఆ పసివాణ్ని వసుదేవుడు రేపల్లె వాడలకు తరలించాడు. మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిన తనయుణ్ని దేవకి తనివితీరా చూసుకున్నది. ‘నాయనా! నువ్వు పరమాత్మునివి కదా! 14 సంవత్సరాలు ఎందుకు ఆలస్యం చేశావు? ఒక్క క్షణంలో కంసుని వధించి మమ్మల్ని విముక్తులను చేయవచ్చు కదా!’ అన్నది.
అప్పుడు కృష్ణుడు ‘అమ్మా! నన్ను మన్నించు. నీవు నన్ను 14 ఏళ్లు అరణ్యవాసం చేయమని గత జన్మలో పంపావు కదా!’ అన్నాడు. దేవకి ఆశ్చర్యంతో ‘అదెలా సాధ్యం?’ అన్నది. కృష్ణుడు దివ్య దృష్టితో చూసి ‘అమ్మా! నీవు మరచిపోయావు. అది సహజమే! కానీ, గతజన్మలో నీవు కైకేయివి. నీ భర్త దశరథుడు’ అన్నాడు. అప్పుడు దేవకి కుతూహలంగా ‘మరి కౌసల్య ఎవరు?’ అని ప్రశ్నించింది. ‘ఇంకెవరమ్మా! యశోద మాతే కౌసల్య. 14 సంవత్సరాల తల్లి ప్రేమను ఆమెకు దూరం చేశావు కదా పూర్వ జన్మలో! ఆ ఎడబాటే ఈ జన్మలో నీవు అనుభవించావు’ అన్నాడు కృష్ణుడు. ‘పూర్వ జన్మలో కోల్పోయినందుకు మళ్లీ కౌసల్య యశోద రూపంలో పొందగలిగింది 14 సంవత్సరాల పుత్ర ప్రేమను..’ అని వివరించినాడు. ‘ఎంతటి వారైనా కర్మ ఫలాలను అనుభవించక తప్పదు, భగవద్భక్తులైనా, అవతార పురుషులైనా వాటి నుంచి తప్పించుకోలేరు. ఇంక మానవ మాత్రులం మనమెంత…?’ అంటారు తత్వవేత్తలు.