‘విశ్వ సృష్టికి తొలి బీజం వాక్కు!’ (ఆది 1:3). ఆ వాక్కుకు బలం వెలుగు. ఆ వెలుగును తానే అని చెప్పినవాడు ప్రభువు. మనిషిలోని అజ్ఞానాన్ని వారి మనసులో అలముకొన్న అంధకారాన్ని పటాపంచలు చేయ గలిగిన ఆ వాక్కు వెలుగుగా జీవం పోసుకొంది. మనిషిలా శరీరం ధరించింది. మనుషుల మధ్య తిరుగాడింది. మనం గుర్తించినా, గుర్తించకపోయినా చెప్పదలచిందీ, మనిషి నడవడికి కావలసిందీ చేసి చూపెట్టింది. ప్రభువు పలికిన ప్రతి పలుకూ ఏదో ఒక కార్యం ద్వారానే అర్థం చేసేవాడు. కేవలం కబుర్లు చెప్పి ఊరుకునే వాడు కాదు. ‘నేనే వెలుగు’ అని ప్రజల మూఢమైన భావాల్ని ఖండించి వారిలో చైతన్యం తీసుకొచ్చాడు ప్రభువు. బతుకుకు ఒక కొత్త అర్థం చెప్పాడు. జీవిత ధ్యేయానికి కొత్త న్యాయం, కొత్త వెలుగూ నింపాడు. ఆయన తొలిసారి చేసిన కొండమీది ప్రసంగానికి మాటరాని ఒక కొండకే , ఓ కొత్త జవజీవం వచ్చింది. గుండె గుండెనూ పలకరించింది. మేల్కొల్పింది. దుఃఖించేవారిని ఇకపై కుమిలి పోవొద్దనీ, ఆదరించి చేరదీసి తగినంత ఓదార్పు ఇచ్చింది.
…? ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024