మానవ జన్మ సార్థకం కావాలన్నా, జన్మ ఫలం పరిపూర్ణం కావాలన్నా.. ‘ప్రభువు మనిషిలో, మానవుడు ప్రభువులో నివసించాల’ని ప్రభువే సూచించాడు. ముందుగా మానవుడు ఆయన్ను ఆహ్వానిస్తే.. ఆ తర్వాత ఆయన మానవుడికి ఆతిథ్యం అవుతాడు. ఇక్కడ పరస్పర ప్రేమానురాగాలు చాలా సూక్ష్మంగా అంతస్సూత్రంగా కనిపిస్తున్నాయి. క్రైస్తవం అంటే క్రీస్తుకు సంబంధించింది. ‘ఏవిధమైన సంబంధం అది?’. ఆయన తోడి నిరంతర బంధం. ఆయన లేకుండా మనం ఏ పనీ చేయలేం. మన ప్రతిపనికీ ఆయనే ముందుంటే.. విజయం గాక, ఫలితం మరొకటి ఎదురవుతుందా? అందుకే ప్రభువు ఇలా అంటాడు. ‘ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి యుందునో వాడు బహుగా ఫలించును’ (యోహాను 15:5) ఇలా పలకడంలో అర్థం ఇదే.
కాబట్టి మనిషి ఆయనతో లగ్నం కావడం తథ్యం. అది అనివార్యం. ఆయన ఒక ద్రాక్షపాదు అయితే, మనమంతా దానికి అల్లిబిల్లిగా అల్లుకున్న ఆ ద్రాక్షావల్లులం, పువ్వులం. ద్రాక్ష కాండకు సంబంధం లేనివి ఏవైనా సరే, ఎండిపోతాయి. ఆ వల్లుల్ని, ఆ రెమ్మల్ని ఊరకే అలా ఎవరూ ఉంచరు. ఉన్నా చెట్టుకే ముప్పు. పచ్చదనం అందమూ దెబ్బతింటుంది. అందుకే విరిచేస్తారు. అందుకే ద్రాక్షపాదు లాంటి ఆ ప్రభు బంధంతో నివసించాలనేది క్రైస్తవుల నమ్మిక. ఒకే పాదు వల్లికలన్నిటికీ ఒకే పచ్చదనం సమైక్యత ప్రకటిస్తుంది. ఇలా ఉండటం అనేది ప్రభువు పట్ల వారి అచంచల విశ్వాసానికి, కార్యనిమగ్నతకు ఒక తార్కాణం ! ఆయన వల్ల పరిపూర్ణ ప్రేమ, మేధా సంపత్తి, శక్తి సామర్థ్యాలు, దయాదాక్షిణ్యాలు లభిస్తాయనేది వారి విశ్వాసం!