‘తమ శరీరమందే స్వయం జ్యోతిగా సర్వసాక్షిగా ప్రకాశించే ఆత్మను.. పాపాలు నశించిన వారే చూడగలరు. మాయ కమ్మేసిన వారు చూడలేరు’ అని పై శ్లోకానికి అర్థం. దీనిని బలపరిచే దృష్టాంతాలు పురాణాల్లో కోకొల్లలు. ఆంజనేయుడు తన వక్షస్థలాన్ని చీల్చి.. తన గుండెల్లో కొలువుదీరిన సీతారామ లక్ష్మణులను లోకానికి చూపించాడు. అది పురాణ కాలం. పురాణ పురుషుడు, మహానుభావుడు కాబట్టి అలా చూపించగలిగాడు అనుకోవచ్చు. కానీ, చరిత్రలో చోటు చేసుకున్న ఓ సంఘటన గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే మహా భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతినిత్యం వటపత్రశాయి అయిన చిన్నికృష్ణుడికి పూలహారాలు అర్పిస్తూ అర్చించేవాడు. ఆయనకు భగవత్ ప్రసాదంగా తులసి తోటలో ఒక చిన్నారి లభించింది. కోదై అంటే పూలమాల. ఆ చిన్నారికి అదే పేరు పెట్టుకున్నాడు. ఆ చిన్నారి శ్రీరంగనాథుడి సేవలో తరిస్తూ గోదాదేవిగా లోకప్రసిద్ధి చెందింది. గోదాదేవి పసితనం నుంచి కృష్ణ భక్తురాలే. తన తండ్రి స్వామి కోసం అల్లిన పుష్పమాలికలను చాటుగా తన మెడలో వేసుకొని అద్దంలో చూసుకొని మురిసిపోయేది. అంటే… అద్దంలో గోదా తనను తాను చూసుకుందని కాదు! తనలోని కృష్ణుడిని చూసుకొని పొంగిపోతుండేది. స్వామి కైంకర్యానికి కట్టిన హారాలు తన కూతురు ముందుగానే మెడలో వేసుకోవడం చూసి ఆమె తండ్రి ఎంతగానో బాధపడ్డాడు. అలా మదనపడుతున్న విష్ణుచిత్తుడి కలలో శ్రీకృష్ణుడు కనిపించాడు. గోదాదేవి మరెవరో కాదు, భూదేవి అపర అవతారమేనని పేర్కొన్నాడు. ఆమె ధరించిన హారాలు తనకు ప్రీతిపాత్రమని పలికాడు. స్వామి స్వప్న సాక్షాత్కారంతో విష్ణుచిత్తుడు కుదుటపడ్డాడు.
తనలో దేవుడు ఉన్నాడని అనుకోవడం వేరు. తానే దేవుడిని అని భావించడం వేరు. శ్రీరామకృష్ణ పరమహంస అమ్మవారి మీద పూలు చల్లుతూ తన నెత్తిమీద కూడా వేసుకునేవాడట! అంటే నేనే కాళీమాతను అయిపోయానని అనుకోలేదు. తానే దేవుడు అని అస్సలు అనుకోలేదు. తనలో కాళీదేవి ఉన్నదనీ, ఆమెనే పూజిస్తున్నాననీ భావించాడు. ఇలా భావన చేయడం మహామహులకు తప్ప ఎవరికి సాధ్యమవుతుంది? అందుకే సోహమనే భావన కష్టమైనది. దాసోహం అనేది చాలా సులువైనది అంటారు పెద్దలు.