కర్మరూపీ స్వయం బ్రహ్మా ఫలరూపీ మహేశ్వరః
యజ్ఞరూపీ విష్ణురహం త్వమేషాం సారరూపిణీ॥
గోకులంలో సుశీల అనే గోపిక ఉండేది. రూపం, విద్య, గుణగణాల్లో రాధాదేవికి ఆమె సరిసాటి. సుశీల కృష్ణుడిని ప్రేమించి, అతడితో క్రీడించడం రాధాదేవి చూసింది. కోపోద్రిక్తురాలైంది. ‘మరెప్పుడైనా గోకులంలో ఆడితే భస్మం అయిపోతావు’ అని శపించింది. సుశీల గోకులం నుంచి వెళ్లిపోయింది. చిరకాలం తపస్సు చేసి మహాలక్ష్మి శరీరంలో లీనమైంది.

ఆ రోజుల్లో దేవతలు నియమ నిష్ఠలతో యజ్ఞాలు చేస్తున్నా ఫలితం దక్కకపోయేది. దేవతలంతా బ్రహ్మను వేడుకున్నారు. బ్రహ్మ శ్రీహరిని ధ్యానించగా.. విష్ణుమూర్తి మహాలక్ష్మిలో లీనమైన సుశీలను కార్తీక పౌర్ణమి నాడు దక్షిణాంశం నుంచి వెలికితీసి ఆమెకు దక్షిణాదేవిగా పేరు పెట్టాడు. ఆమెను బ్రహ్మకు అప్పగించాడు. దక్షిణాదేవిని బ్రహ్మ యజ్ఞ పురుషుడికి సమర్పించాడు. అత్యంత సుందరంగా ఉన్న దక్షిణాదేవిని యజ్ఞపురుషుడు కామించాడు. నిర్గుణ పరాప్రకృతి శక్తి, అమ్మవారి కళాంశం రూపాలలో ఒకరైన ఆ తల్లి ఎదుటనిలిచాడు యజ్ఞుడు. ‘నాతో ఉండి నన్ను శక్తిమంతుణ్ని చేయి. కీర్తిమంతులకు కర్మఫలం ప్రసాదించే నీవు లేకపోతే కర్మ నిష్ఫలం. నువ్వు లేనిదే బ్రహ్మాది దేవతలు సైతం కర్మఫలం ప్రసాదించలేరు. బ్రహ్మ కర్మ రూపుడు.
శివుడు ఫలరూపుడు. విష్ణువునైన నేను యజ్ఞరూపుణ్ని. అందరి సార రూపానివి నువ్వు. నీవల్లే కృష్ణుడు శక్తిమంతుడయ్యాడు. నువ్వే నా శక్తివి. ఎన్ని జన్మలైనా నాతోనే ఉండు. నేను నీకు తోడ్పడుతాను. నువ్వు నాకు సాయపడు’ అని యజ్ఞుడు చేసిన స్తుతికి సంతుష్టురాలై అతణ్ని వివాహమాడింది దక్షిణాదేవి. దక్షిణాదేవి పన్నెండేండ్లు మోసి ప్రసవించిన బాలుడే ఫలం. సర్వయజ్ఞ కర్మలకు అతడే ఫలస్వరూపుడు. యజ్ఞాన్ని పురుషాకృతిగా, దక్షిణాదేవిని శక్తిరూపంలో చూపారు. కళాంశం రూపాల్లో మొదటిదైన స్వాహా, రెండోదైన స్వధా దేవతలు యజ్ఞంలోని అగ్నిదేవుని భార్యలుగా చెప్పారు.
మనం యజ్ఞం చేయాలనుకుంటే అందుకు ఎందరో సహకరించాల్సి ఉంటుంది. రుత్వికులు మంత్రాన్ని, తపస్సు ధారపోసి యజ్ఞం నిర్వహిస్తారు. యజ్ఞం నిర్వర్తించిన వారికే దాని ఫలితం దక్కాలి. కానీ, యజ్ఞం చేయించిన యజమానులకు ఫలితం దక్కాలంటే అందుకు ప్రతిగా రుత్వికులకు తగిన దక్షిణ సమర్పించుకోవాలి. అలా సమర్పిస్తున్నప్పుడు భావనలో గానీ, ద్రవ్యంలో గానీ ఏ లోపం ఉండకూడదు. రుత్వికులు చేసిన దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఇస్తున్నామన్న భావన రాకూడదు. తృణమో, పణమో శక్తిమేరకు విధేయతతో సమర్పించాలి. వాళ్లుచేసిన దానికన్నా ఎక్కువ ఇచ్చామనే భావన ఉంటే చేసిన యజ్ఞం నిరర్థకమవుతుంది. యజ్ఞకర్మ ముగిసిన వెంటనే దక్షిణ ఇవ్వకుండా ఆలస్యం చేసినా ఫలితం ఉండదు. దక్షిణ ఇవ్వనివాడు, అడగనివాడు ఇద్దరికీ నరకం ప్రాప్తిస్తుందని శాస్త్రం చెప్పింది. యజ్ఞానికి సార్థకత కలిగించేది, సమర్థతను ఇచ్చేది దక్షిణ.
యజ్ఞక్రతువు పరిపూర్ణం కాగానే దక్షిణాదేవితో, ఫలరూపుడైన పుత్రుడితో కలిసి యజ్ఞుడు ఆ యజమానులకు ఫలితం అందిస్తాడని వేదవాక్కు. అందుకే కర్మిష్టులకు కర్మఫలాన్ని అందిస్తుంది దక్షిణాదేవి.
దక్షిణాదేవి ధ్యానం, స్తోత్రం, పూజా విధి కణ్వశాఖలో పేర్కొన్నారు. సాలగ్రామం మీదికి గానీ, కలశం మీదికి గానీ దక్షిణాదేవిని ఆవాహన చేసి పూజించాలి. ‘ఓం శ్రీం క్లీం హ్రీం దక్షిణాయై స్వాహా’ అనే మూలమంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని ఆరాధిస్తే కోరుకున్నవన్నీ లభిస్తాయి. అమ్మవారి ఉపాఖ్యానాన్ని పారాయణం చేసినా, పురాణంగా విన్నా ఇబ్బందులు తొలగి శాంతిసౌఖ్యాలు వెల్లివిరుస్తాయి.
వేముగంటి
శుక్తిమతి,
99081 10937