తతోఖిల జగత్పద్మ బోధాయాచ్యుత భానునా
దేవకీ పూర్వసంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మనా॥

సర్వజగత్తును రక్షించే శ్రీహరి.. శ్రీకృష్ణావతారమెత్తి ఎన్నో లీలలను ప్రదర్శించి ఆబాలగోపాలాన్నీ అలరించాడు. శ్రీకృష్ణ చరితామృతంగా ప్రస్తుతించే శ్రీమద్భాగవతంలో గిరిధరుడి అనుగ్రహాన్ని పొందిన భక్తుల గాథలలో దధిభాండుని వృత్తాంతం ప్రసిద్ధమైనది. తన భక్తులు యమపాశానికి చిక్కుకోకుండా రక్షించే శ్రీకృష్ణుడు.. తాను మాత్రం యశోదమ్మ ప్రేమ పాశానికి చిక్కాడు. తొట్లెలో పడుకునే శిశుప్రాయంలోనే పూతనను, శకటాసురుణ్ని సంహరించగలిగినా.. యశోదమ్మ బెత్తం దెబ్బల నుంచి తప్పించుకోవడానికి దధిభాండుణ్ని ప్రార్థించిన విధం చిరస్మరణీయం.
బాలకృష్ణుడు పొరుగు ఇండ్లలో వెన్న దొంగలించబోతుండగా.. ఆ ఇండ్లలోని స్త్రీలంతా వచ్చి యశోదమ్మతో నల్లనయ్య అల్లరి గురించి చెప్పి మొరపెట్టుకున్నారు. తన పుత్రుడిని దండిస్తే ఇరుగుపొరుగు చెప్పే చాడీలకు తెరదించినట్లు అవుతుందని భావించింది యశోదమ్మ. తల్లి కోపాన్ని గ్రహించిన కన్నయ్య ఆమెకు చిక్కకుండా పరుగు లంఘించుకున్నాడు. కొడుకును బంధించడానికి ఆమె తాడును ఒకచేతిలో, బెత్తాన్ని మరోచేతిలో పుచ్చుకుని తరిమింది.
తల్లికి దొరక్కుండా కన్నయ్య ఒక వీధి నుంచి మరో వీధిలోకి తిరిగాడు. అక్కడే వృద్ధుడైన దధిభాండుడు ఆ రోజు తన వద్దనున్న పెరుగంతా అమ్ముకొని, అలసట తీర్చుకోవడానికి ఖాళీగా ఉన్న పెరుగుకుండను బోర్లించి దానిపై కూర్చున్నాడు. అతణ్ని చూడగానే ‘ఈ పెరుగు కుండ కింద దాక్కుంటే తల్లి దెబ్బల నుంచి తప్పించుకోవచ్చ’ని భావించాడు కృష్ణుడు. దధిభాండుని సమీపించి ‘ఓ తాతా! నన్ను పెరుగు కుండ కింద దాచి, మా అమ్మ వస్తే నేను ఇక్కడ లేనని చెప్పి, కాపాడవా!’ అని ముద్దుముద్దు మాటలతో ప్రాధేయపడ్డాడు. కొంటెకృష్ణుని మాటలకు ముచ్చటపడిన దధిభాండుడు ‘సరే’ అని అంగీకరించాడు. కృష్ణునిపై పెరుగుకుండను బోర్లించి, దానిపై అతడు కూర్చున్నాడు. ఇంతలో అటుగా వచ్చిన యశోదమ్మ కృష్ణుడు కానరాక దధిభాండునితో ‘తాతా! మా పిల్లవాడైన చిలిపి కృష్ణుడిని నీవేమైనా చూశావా?’ అని అడిగింది. ‘అమ్మా! అతడు అల్లరి బాలుడని నువ్వే చెబుతున్నావు. ఎటో పారిపోయి ఉంటాడు’ అన్నాడు దధిభాండుడు. విసుగు చెందిన యశోదమ్మ ‘కొంటెవాడు ఇంటికి వస్తాడుగా! అప్పుడు వాని పనిపడతా’ అనుకొని వెనుదిరిగింది.
ఈ సంభాషణంతా కుండ కింది నుంచి ఆసక్తిగా గమనించిన కృష్ణుడు అబద్ధం చెప్పి తనను కాపాడిన దధిభాండునికి తగిన బహుమానం ఇవ్వాలనుకున్నాడు. ‘తాతా! కుండ తీస్తే.. నేను బయటకు వస్తాను’ అన్నాడు. ‘ఓ బాలకృష్ణా! నేను నీకు చేసిన సాయానికి బదులుగా నాకు ఒక వరం ఇవ్వమ’ని అడిగాడు దధిభాండుడు. ‘తాతా! నేను దేవుణ్ని కాదు వరాలు ఇవ్వడానికి. మా అమ్మ దెబ్బలనే తప్పించుకోలేక నిన్ను సాయమడిగినవాణ్ని. నాకు ఈ కుండ కింద ఊపిరాడటం లేదు. త్వరగా బయటకు రానివ్వు’ అని బతిమాలాడు. ‘కృష్ణా! నన్ను మభ్యపెట్టకు. నీవు పరమాత్ముడవు. నన్ను పరీక్షించకు. నీ సాన్నిధ్యంలో నాకు జ్ఞానోదయమైంది. నాకు మోక్షమిస్తానని ప్రతిజ్ఞ చేస్తేనే నిన్ను బయటకు రానిస్తాన’ని దధిభాండుడు కరాఖండిగా చెప్పాడు. ఇక తప్పేలా లేదనుకొని ‘మోక్షాన్ని ఇచ్చాను. ఇక నన్ను బయటకు రానివ్వు’ అన్నాడు కృష్ణుడు.
‘నాకేకాక నా కుండకు కూడా మోక్షమివ్వాల’ని మరో షరతు విధించాడతడు. ‘నీకు, నీ కుండకు కూడా మోక్షాన్ని ఇస్తున్నా’ అని ప్రతిజ్ఞా రూపంగా మూడుసార్లు పలికాడు కృష్ణుడు. దాంతో అమితానందాన్ని పొందిన దధిభాండుడు సంపూర్ణ విశ్వాసంతో కుండను తొలగించగానే.. బాలకృష్ణుని రూపంలో ఉన్న శ్రీహరి దధిభాండునికి తన దివ్యరూప సందర్శన భాగ్యం కలిగించాడు. దధిభాండుడు తన కుండతోపాటు వైకుంఠధామానికి చేరేవిధంగా అనుగ్రహించాడు. శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహం పొందిన ఈ దధిభాండుని వృత్తాంతం భగవద్భక్తులందరికీ చిరస్మరణీయమైనది.
సముద్రాల
శఠగోపాచార్యులు
98483 73067