కామాది సర్ప వ్రజ గారుడాభ్యాం
వివేక వైరాగ్య నిధి ప్రదాభ్యామ్
బోధ ప్రదాభ్యాం ద్రుత మోక్షదాభ్యాం
నమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్ ॥

భారతీయ సమాజం గురువుకు ఇచ్చిన స్థాయి అనూహ్యం. గురుశబ్దాన్ని అజ్ఞాన నివారకమని, అతిపెద్దది అనే అర్థాలలో ఉపయోగిస్తున్నారు. గురువుకు ఇచ్చేది గౌరవం. ఫలితంగా మనకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మార్గదర్శకుడు గురువు. గురుభావన ఏ రూపంలోనైనా మనకు మార్గాన్ని ఉపదేశించవచ్చు. పరిమితులకు లోబడి బాధ పడేవారికి అపరిమిత తత్త్వాన్ని అర్థం చేయిస్తాడు. ఎన్నో పరీక్షలకు గురిచేసి వజ్రాన్ని సానబెట్టినట్లు శిష్యులను తీర్చిదిద్దుతాడు. బయట గురువు మనలను క్రమశిక్షణతో బతికేటట్లు చేస్తూ, బాహ్య జీవితం కన్నా అంతర జీవితమే గొప్పదని మార్గం చెప్తుంటాడు. ఈ లోకాన్ని అర్థం చేయించి, లోక జ్ఞానం పెంచేవాడాయన. మనలోనూ, మన చుట్టూ ఉన్న ప్రకృతి లక్షణాన్ని విడమర్చి చెప్పి, మనపై వాటి ప్రభావాన్ని చెబుతాడు. పై రెంటికీ ఆధారభూతమైన చైతన్యాన్ని గురించి విశదీకరించే ఆత్మజ్ఞాన బోధకుడు గురువు. అందుకే, జ్ఞానం కావాలంటే గురువును ప్రార్థించాలి. జ్ఞానం వచ్చిన తర్వాత క్రమంగా లోక వ్యవహార వైరాగ్యం, ఆత్మ వ్యవహార అనురాగాలు ఏర్పడుతాయి. జ్ఞాన, వైరాగ్యాల వంటివి మనకు కావాలనుకుంటే గురుచరణాలను వదలకూడదు. సరైన గురువు మన జీవితంలో లభించి మార్గదర్శనం చేయడానికి నమోనమః శ్రీ గురుపాదుకాభ్యామ్’ మంత్రాన్ని రోజూ ఒక గంటసేపు జపించాలి.
సాగి
కమలాకరశర్మ