‘స్కందయతి శత్రూన్ శోషయతీతి స్కందః’. అంటే, శత్రువుల శోషింపజేయువాడు; ‘దేవస్త్రీ దర్శనాదీశ్వర రేతసః స్కందతీతి స్కందః’. దేవస్త్రీ దర్శనంతో వదలిన ఈశ్వర రేతస్సు వల్ల పుట్టినవాడు, ‘స్కదిర్ గతి శోషణయోః’. ఈ విశ్లేషణలు స్కందుని పేరుకు సంబంధించిన వ్యుత్పత్తులు. కార్తికేయుడు, మహాసేనుడు, శరజన్ముడు, షడాననుడు, పార్వతీనందనుడు, సేనాని, అగ్నిభవుడు, గుహుడు, బాహులేయుడు, తారకజితుడు, విశాఖుడు, శిఖివాహనుడు, షాణ్మాతురుడు, శక్తిధరుడు, కుమారుడు, క్రౌంచదారణుడు మొదలైన పేర్లన్నీ కుమారస్వామికి సంబంధించినవే. అసలు ‘స్కందుడు ఎవరు? ఆయనను ఆరాధించడం ఎందుకు?’ అనే ప్రశ్నలు వేసుకుంటే, పురాణాదుల ప్రకారం శివపార్వతుల కుమారుడే స్కందుడు.
భూగోళమే శివుడు. భూమి రూపమే శివలింగ స్వరూపం. భూమి చుట్టూ ఉండే పాంచభౌతిక శక్తియే పార్వతి. భూమ్యాకర్షణ శక్తి గణపతి. భూమి చుట్టూ ఉండి భూమిని సంరక్షించే విద్యుదయస్కాంత తరంగ శక్తికే ‘కుమారస్వామి’ అని పేరు. కుమారుని ఉద్భవగాథలు అనేకం. అగ్నికి కుమారునిగా, కృత్తికల కుమారునిగా, రెల్లుగడ్డి నుంచి పుట్టినవాడిగా (శరవణ భవుడు), శివపార్వతుల కుమారునిగా వేర్వేరు గాథలున్నాయి. ‘స్కాంద పురాణం’లో ముఖ్యభాగం స్కందుని గురించే ఉంది. భూమికి ఆత్మ భ్రమణం, సూర్యుని చుట్టూ పరిభ్రమణమే కాకుండా ‘విషుచలనం’ అనే మూడో భ్రమణమూ ఉంటుంది. భూమి ఆకారం, వంగి తిరగడం వంటి వానివల్ల ఈ విషుచలనంలో మార్పు ఏర్పడుతుంది. అయనాంశ గణితంతో భూమి తిరిగే విషుమార్గాన్ని గణించవచ్చు. దీనికున్న ప్రాధాన్యాన్ని గమనించిన భారతీయ ఋషులు ఈ అయన గమనం ఉన్న రాశులను బట్టి వేర్వేరు కథలు సృష్టించారు. కృత్తికా నక్షత్రంలో అయనం ఉండగా ఏర్పడిన కథలన్నీ కార్తికేయుని కథలు. అతడు చంపడానికి వచ్చిన తారకాసురుడు కూడా ఈ అయన సంబంధమైనవాడే.
ఆకాశం నుంచి మనకు వస్తున్న శక్తి అంతా సర్పిలాకార శక్తి మాత్రమే. ఓజోన్ పొర లోపల శక్తి ప్రసార విధానానికి, బయట ప్రసార విధానానికి తేడా ఉంటుంది. సముద్రం మీద అలల లాగా, పాము కదలికల లాగా ఉన్న సర్పిలాకార శక్తి మన చుట్టూ చేరి ఉంటుంది. విద్యుచ్ఛక్తిగా, అయస్కాంత తరంగశక్తిగా అది భూమిపైన విస్తరిస్తుంది. ఇదే సంచారవాణికి, ఇతర సాంకేతిక అవసరాలకు ఉపయోగపడుతున్నది. భూమి చుట్టూ విస్తరించిన దీన్ని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ శక్తి ఉన్న రూపాన్ని బట్టి సుబ్రహ్మణ్యస్వామిని సర్పరూపంలో కూడా ఆరాధిస్తాం. ‘బ్రహ్మ’ అంటే ప్రకృతి. దానిలోని విశేష శక్తి అయిన విద్యుదయస్కాంత తరంగశక్తి సుబ్రహ్మణ్యుడు. ఎంతో జ్ఞానంతో మాత్రమే దర్శించదగినవాడు. ప్రకృతిని పాడుచేసినా, ఈ శక్తిని వేర్వేరు రూపాల్లో దుర్వినియోగానికి పాల్పడినా ‘పాపం’ కిందే లెక్క. పురుషునిలోని వీర్యకణాలు కూడా ఇటువంటి రూపంలోనే ఉండటం వల్ల సంతాన శక్తి కోసం ఆరాధించే దైవంగానూ స్కందుడు నిరంతరం పూజనీయుడు. కుమారస్వామి ఆరాధన వల్ల శక్తి కలుగుతుంది. ఆయన దేవ సేనాధిపతి అనడంలోని ఆంతర్యమూ ఇదే. ఆకాశంలోని పంచభూతాల (దేవసేనలు)ను ఒక క్రమపద్ధతిలో అందించే విధానం కార్తికేయునిదే.
మన చుట్టూ ఉన్న ప్రకృతిలోని వేర్వేరు శక్తులను సంకేతాలుగా మల్చుకొని ఆరాధిస్తున్న అత్యుత్తమ వైజ్ఞానికులతో కూడింది భారతజాతి. సంకేతం అర్థం కానివారు ఆరాధన ద్వారా, అర్థమైనవారు తత్వంతో మమేకమవడం ద్వారా పుణ్యం పొందుతారు. అందుకే, శక్తిని ఆరాధించే సంప్రదాయం మనకు అలవడింది. స్కందుణ్ని నిరంతరం ఆరాధిస్తూ ఉండటం వల్ల వ్యక్తి శక్తిమంతుడవుతాడు. అతడు సమస్త కర్మలను అధిగమించి శక్తి సాయుజ్యాన్ని పొందుతాడు. ఆ మార్గంలో పూజలు మాత్రమే కాదు ప్రకృతిని, దానిలోని శక్తులను పాడుచేయకుండా రక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉన్నది.
సాగి కమలాకరశర్మ