సత్యమేక పదం బ్రహ్మ, సత్యేధర్మః ప్రతిష్ఠితః సత్యమేవా క్షయా వేదాః, సత్యేనైవాప్యతే పరమ్
శ్రీ మద్రామాయణం (అయోధ్యకాండ: 14-7) సత్యమనేది ఒక్కటే ‘పరబ్రహ్మ స్వరూపం’. ధర్మమనేది సత్యవాక్కులోనే ఉంటుంది. ధర్మాచరణకు ఇదే ఆధారం. వేదాలన్నీకూడా ఈ సత్యాన్నే ప్రతిపాదించాయి. ఈ సత్యం వల్లే మోక్షం సిద్ధిస్తుందికూడా. నిజం చెప్పడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండటం, ధ్యానం చేయడం, పరిశుభ్రంగా ఉండటం, సంతోషమూ, జాలి, అభిమానమూ, సహనమూ, జ్ఞానమూ, మనోనిగ్రహమూ అనే వాటితోపాటు నిక్కచ్చిగా ఉండటమనే సద్గుణాలను అందరూ అలవరచుకోవాలని మన సనాతన ధర్మం (వ్యాస మహాభారతం) చెపుతున్నది. ‘సత్యం వద, ధర్మం చర’ అంటే నిజాయితీగా ఉంటూ ధర్మబద్ధమైన నడవడికను అలవరచుకోవాలని మన వేదాలుకూడా నొక్కి చెబుతున్నాయి. తనకు తాను గొప్పగా ఎదగాలంటే మంచి నడవడిక అనేదే ముఖ్యం. ఈ సత్ప్రవర్తన పునాదిగా ఉండేదే నిజాయితీ. అంటే, నిజాన్ని నమ్మి నడచుకోవడం. సత్యమేవ జయతే నా నృతం సత్యేన పంధా వితతో దేవయానః
ముండకోపనిషత్తు (3-1-6) ‘సత్యనిష్ఠులే గెలుస్తారు. అసత్యవాదులు నెగ్గరు. పరమార్థ తత్త్వం అవగతం కావాలంటే సత్యసంధతని వ్రతంగా స్వీకరించాల్సిందే. ఎన్నటికైనా నిజాన్ని నమ్ముకున్న వాళ్ళనే విజయం వరిస్తుంది. అబద్ధాలు చెప్పేవాళ్ళకి కాలమే గుణపాఠం చెబుతుంది’. సత్యహరిశ్చంద్రుని వంటివారి కథలూ ఇదే సందేశాన్ని అందిస్తున్నాయి. ‘సత్యాన్ని మించిన ధర్మం లేదు. ఇది జ్ఞానంతో నిండిన బ్రహ్మస్వరూపం. ఈ జగత్తు నడవడం గానీ, సూర్యుడు ప్రకాశించడం గానీ ఈ సత్యమనే ధర్మం వల్లనే’ అని పురాణాలూ చాటి చెప్పాయి. వెలయంగ నశ్వమేధం బులు వేయును నొక్క సత్యమును నిరు గడలం దులనిడి తూపఁగ సత్యము వలనన ములు సూపు గౌరవంబున పేర్మిన్
నన్నయ భట్టు (మహాభారతం, ఆదిపర్వం: 4-94) ‘నిజాన్ని మాట్లాడటమనే నియమాన్ని పాటించడం వల్ల వేయి అశ్వమేధ యాగాలను చేసిన దానికంటేకూడా మించిన ఫలితం సిద్ధిస్తుంది. సత్యవాక్కును, వేయి యజ్ఞాలను చేసిన ఫలితాన్ని త్రాసులో పెట్టి తూకం వేస్తే అది నిజం మాట్లాడటం వల్ల కలిగే ఫలితం వైపే మొగ్గు చూపుతుందట. సమస్త భూమండలంలోని నదులన్నిటిలో స్నానం జేయడం వల్ల కలిగే ఫలితం కంటేకూడా ఇలా నిజాయతీగా ఉండటం వల్ల కలిగే గౌరవమే ఉన్నతమైంది’. నుతజల పూరితంబులగు నూతులు నూఱిఁటి కంటె సూనృత వ్రత యొక బావి మేలు మఱి బావులు నూఱిఁటి కంటె నొక్క స త్క్రతువది మేలు తత్క్రతు శతంబునకంటె సుతుండు మేలు త త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు సూడగన్
మహాభారతం (ఆదిపర్వం: 4-93) నన్నయ భట్టారకుని ఈ పద్యం లోక ప్రసిద్ధం. ‘సూనృత వాక్కు’ అంటే ‘నిజాన్ని మాట్లాడుతూ ఉండటం’. జనం దాహార్తిని తీర్చడం కోసం వంద చేదబావులను తవ్వించడం కన్నా జీవకోటి అంతటికీ ఉపయోగపడే ఒక్క దిగుడు బావిని ఏర్పాటు జేయడం మంచిది. దానధర్మాలతో చేసే యజ్ఞం ఆ వంద దిగుడు బావుల నిర్మాణం కంటే ఉత్తమమైంది. వంశానికి కీర్తిప్రతిష్ఠలను సంపాదించే పుత్రుడుండటమనేది వంద యజ్ఞాలకంటేకూడా ఉన్నతమైంది. ఇన్నిటివల్ల కలిగే మేలు కంటేకూడా ‘నిజాన్ని మాట్లాడటం’ అనేదే ఉన్నతమైంది, ఉత్తమమైంది కూడా. నిజాయితీగా ఉంటూ నిజాన్ని నమ్ముకొని ఉండేవాళ్లను ఎన్నటికైనా విజయం వరిస్తుంది. దీన్నే ఉత్తమధర్మంగా మన సనాతన ధర్మం పేర్కొన్నది. అప్పుడు అరిష్టాలన్నీ తొలగిపోయి మానవ సమాజం సుభిక్షమవుతుంది.