సకల సద్గుణ విభవుడైన అభవునికి (శివునికి) ఆగ్రహం తెప్పించి అరవింద భవుడు (బ్రహ్మదేవుడు) కూడా అంతరాయాలను, అశుభాలను తప్పించుకోలేడు కదా! అలాంటిది ఇంద్రాది దేవతలనగా ఎంత? రుద్రహీనమైన యజ్ఞం అభద్ర (అమంగళ)మని తెలిసికూడా అపరాధమెరుగని అభవునికి అపకారం తలపెట్టిన క్షుద్రులు అమరులు.
దక్షుని మొండెమునకు యజ్ఞపశువైన అజము- మేక (గొఱ్ఱె) తలను తగిలించారు. రుద్రుని అనుగ్రహంతో వెంటనే అతడు నిద్రనుండి మేల్కొన్నట్లు లేచాడు. ఎదుట ఉన్న ‘దాక్షాయణీ పతి’ని దర్శించగానే శరత్కాల సరస్సువలె దక్షుని మనస్సు నిర్మలమైంది. సతి ఆత్మాహుతిని స్మరించి, సిగ్గుపడి కన్నీరు పెట్టుకున్నాడు.
ఉ.‘భాసుర లీల గాంచిరి సుపర్వులు భక్త జనైక మానసో ల్లాసము గిన్నరీజన విలాసము నిత్య విభూతి మంగళా వాసము సిద్ధ గుహ్యక నివాసము రాజత భూ వికాసి కై లాసము గాంతి నిర్జిత కులక్షితి భృత్సు మహద్వి భాసమున్’
జబ్బలు చరచి భద్రుని సేనచే దెబ్బలు తిన్న దేవతలంతా లబోదిబోమంటూ పెడబొబ్బలు పెడుతూ పరుగు పరుగున వచ్చి పితామహుని-బ్రహ్మగారి, పాదాలను విడువకుండా పట్టుకున్నారు. భయంకరులైన శంకర కింకరులు తమను వేధించి బాధించిన విషయమంతా విధాత- బ్రహ్మకు విన్నవించుకున్నారు. ‘యజ్ఞభాగానికి సర్వవిధాలా యోగ్యుడైన సర్వజ్ఞుని-శివుని, దూరం చేసిన మీరు విబుధులు-దేవతలు కారు, అబుధులు- అజ్ఞానులు, దుష్టులు, ధూర్తులు, దుర్మార్గులు’ అని చతుర్ముఖుడు దేవతలను చివాట్లు పెట్టాడు. యజ్ఞ పూర్ణాహుతి- సమాప్తిని కోరే దేవతలను, పితృదేవతలను, ప్రజాపతులను వెంట పెట్టుకొని క్షిప్ర ప్రసాది- ఆశుతోషుడు (తొందరగా ప్రసన్నుడయే) పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకోవడానికి పరమేష్ఠి- బ్రహ్మ, కైలాస పర్వతానికి ప్రయాణమయ్యాడు.
అలా వారంతా ‘పుణ్యాల పూలదండ’ వలె పరిమళిస్తూ విరాజిల్లుతున్న వెండికొండకు వేంచేశారు. కమలాసనాది దేవతలు కనులపండుగగా దర్శించిన కమనీయ కైలాస శిఖరాన్ని తనకు మిక్కిలి మక్కువైన అంత్యప్రాసల ఉత్పలాల- కలువపూల మాలతో అలంకరించి కడు రమణీయంగా వర్ణించాడు భక్త కవిరాజు బమ్మెర పోతరాజు-‘ఆ కైలాసగిరి భక్తజనుల మానసాలకు అపరిమితమైన ఉల్లాసం, ఉత్సాహం- ఆనందం కల్గించేది. కిన్నెరకాంతలు వింతగా, వినోదంగా, విలాసంగా విహరించేది. నిత్యమైన ఐశ్వర్యాలకు- భక్తిజ్ఞాన వైరాగ్యాలకు నెలవైనది. శాశ్వత శుభాలకు- సత్, చిత్, ఆనందాలకు నిలయమైనది. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, గుహ్యకులు మొదలైన దేవజాతులకు- సాత్తిక భావాలకు నివాసమైనది. మెండైన వెండివెలుగులతో దండిగా నిండినది. ఇలలోని కులపర్వతాలు కూడా వెల-తెల పోయేంత అతుల అనంత కాంతులతో విలసిల్లేది’. రజతాద్రి శృంగమే కైలాసం, శివలోకం. భోలాశంకరుని భవ్య లీలా భూమి! కైలాసమనగా స్ఫటికమణి. రజత (హిమ) శృంగమే స్ఫటిక లింగం.
సౌగంధిక వనం సమీపించి దేవతలు, సంసార తాపాన్ని తొలగించే మేటి మర్రిచెట్టు క్రింద ‘కోపం వీడిన కాలుని’ (యముని) వలె ప్రశాంత గంభీర ధ్యానముద్ర ధరించి సమాధి నిష్ఠలో ఉన్న- జీవుల జనన, మరణ దుఃఖమును ఛేదింప (ఖండింప) దక్షుడైన దక్షిణామూర్తిని- సదాశివుని సందర్శించారు. సాష్టాంగపడ్డారు. వామనస్వామి కశ్యపునికి వందనం చేసినట్లు వామదేవుడు-శివుడు ప్రేమతో పితామహునికి ప్రణామం చేశాడు.
విధాత- బ్రహ్మ, వినయపూర్వకంగా- ‘ప్రపన్న జనపోషణా! పన్నగరాజ భూషణా! హరా! పురహరా! గౌరీవరా! గంగాధరా! చక్రపాణి (విష్ణు) మాయకు చిక్కినవారే భేదబుద్ధికి బద్ధులవుతారు. హే శూలపాణీ! ఉమాధవా! మాధవుని మాయకు మోహం చెందని నీకు మన్యువు- కోపం అంటూ ఉంటుందా? ఇద్ధ చరితా (సచ్చరిత్రుడా)! రుద్రా! భద్రుడు భగ్నం చేసిన యజ్ఞాన్ని ఉద్ధరించు. శిక్షించిన దక్షుని దయతో వీక్షించి రక్షించు. అమరులకు ఆరోగ్యం అనుగ్రహించు. ఈ యాగాన్ని పూరించి నీ భాగంగా స్వీకరించు’ అని వినుతించి విన్నవించాడు.
సన్నుతికి సంతసించి చిరునవ్వు చిందిస్తూ చంద్రమౌళి చతుర్ముఖునితో- బ్రహ్మదేవా! వైష్ణవమాయకు వశులైన పామరులు చేసిన తప్పులను నేను ఎప్పుడూ మనస్సులో పెట్టుకోను. అయినా, లోక సంగ్రహం- ధర్మరక్షణ కోసం దుష్టులను వారి దోషాలకు తగినట్లుగా దండిస్తూ ఉంటాను’ అని అన్నాడు. విన్నపాన్ని మన్నించిన ‘సతీ-పతి’ని ముందుంచుకొని శచీపతి (ఇంద్రుడు) ఆదిగాగల అమరులతో ప్రజాపతి బ్రహ్మదేవుడు యజ్ఞభూమికి విచ్చేశాడు. దక్షుని మొండెమునకు యజ్ఞపశువైన అజము- మేక (గొఱ్ఱె) తలను తగిలించారు. రుద్రుని అనుగ్రహంతో వెంటనే అతడు నిద్రనుండి మేల్కొన్నట్లు లేచాడు. ఎదుట ఉన్న ‘దాక్షాయణీ పతి’ని దర్శించగానే శరత్కాల సరస్సువలె దక్షుని మనస్సు నిర్మలమైంది. సతి ఆత్మాహుతిని స్మరించి, సిగ్గుపడి కన్నీరు పెట్టుకున్నాడు.
దుఃఖం దిగమ్రింగి గద్గద కంఠంతో- ‘క్షుద్ర సంహారా! కరుణా సముద్రా! రుద్రా!’ అంటూ క్షమించమని వేడుకొన్నాడు. భగుడు మిత్రుడనే దేవుని కళ్లతో చూడగలిగేటట్లు, పూష యజమాని దంతాలచే మెత్తని పదార్థాలు తినగలిగేటట్లు, భృగువుకు మేకపోతు గడ్డం, మీసం కలుగునట్లు, అమరులకు తెగిన అవయవాలు అమరునట్లు ఆశుతోషుడు అనుగ్రహించాడు.
(సశేషం)
తంగిరాల రాజేంద్రప్రసాద శర్మ
98668 36006