‘చదువుకున్న విద్య నిష్ప్రయోజనం కాకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని జతచేస్తూ మననం చేసుకోవాలి’ అని ‘రామాయణం’ సందేశమిస్తున్నది. ‘గురువుల వద్ద వేద, శాస్త్ర, పురాణాలు చదువుకోగానే సరిపోదు. వాటికి చెదలు పట్టకుండా నిరంతరం శ్రమిస్తూ నిత్య చైతన్యం కలిగించడమే స్వాధ్యాయ’ అని ఆదికవి వాల్మీకి వ్యాఖ్యానించారు. దీనికి ‘యోగవాశిష్టం’, పతంజలి ‘యోగదర్శనం’ కూడా మద్దతు పలికాయి. నాటి గురుకుల విద్యావ్యవస్థలే ఈ అద్భుత ‘స్వాధ్యాయ’ ప్రక్రియకు ప్రాణం పోశాయి. కేవలం చదువు చదువుకోసమో, పట్టాల కోసమో కాకుండా విజ్ఞానాభివృద్ధి, జీవన వికాసం కోసంగా నాడు ఈ పద్ధతి వాడుకలోకి వచ్చింది. విద్యార్థుల్లో ఆచరణ, ప్రయోగాల ద్వారా విద్యను లోకోపయోగంగా మార్చడమే ‘స్వాధ్యాయ’ పరమార్థం. తన యాగ రక్షణ కోసం దశరథ మహారాజు ఎన్ని బలగాలు పంపుతానన్నా, స్వయంగా తానే రావటానికి సిద్ధపడినా విశ్వామిత్రుడు అంగీకరించకుండా, ‘రామ లక్ష్మణులనే పంపాలని’ పట్టుపట్టాడు. ఎందుకు? విద్యలో క్షేత్రస్థాయి ప్రయోగాలు, పునశ్చరణ, మెలకువలతో వారికి తిరుగులేని తర్ఫీదు నివ్వడమే దీని వెనుక ఉన్న లక్ష్యం.
‘వేదాలను వచ్చేదాకా వల్లించాలి, చచ్చేదాకా చదవాలి’ అనేవారు అప్పట్లో పండితులు. విద్యార్థిగా ఎప్పటికప్పుడు చదువులో కొత్తదనంతో ప్రభవించడమే స్వాధ్యాయ ఆంతర్యం. ‘గురుకులం నుంచి రాగానే ప్రయోగాత్మకంగా విద్యను వినియోగిస్తూ, దాన్ని లోకోపకారం చేయడమే లక్ష్యంగా ఏర్పడిన విద్యావ్యవస్థ’ రామాయణ కాలంలో ‘స్వాధ్యాయ’గా గుర్తింపు పొందింది. వాటికోసం మందిరాలు నిర్వహించేవారు. చదివిన విద్యపై పట్టు సాధించడం, దాన్ని సద్వినియోగం చేయడం ఎవరికైనా, ఎప్పుడైనా తప్పనిసరి. చదివిన విద్యకు, చేసే వృత్తి ఉద్యోగాలకు సంబంధం ఉండాలి. లేకపోతే, ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి పెట్టే వ్యయం వృథా అవుతుంది. చదువును కేవలం పట్టాల కోసమే అన్నట్టుగా పరిగణిస్తే అది నిస్తేజమవుతుంది. ‘స్వాధ్యాయ’ విధానం ప్రస్తుత కాలంలో లేకపోవడం పెద్ద లోపం. ‘వేదశాస్త్ర, పురాణాల విస్తృత అధ్యయనం, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక విజ్ఞానం వృద్ధి చెందడం. తద్వారా మనిషి తనను తాను తెలుసుకోగలడు’ అని పతంజలి ‘యోగశాస్త్రం’ (సాధన పాదం) వివరిస్తుంది. ‘యోగవాశిష్టం’లో వశిష్ఠ మహర్షి కూడా ఇదే చెప్తారు.
‘స్వాధ్యాయ’వల్ల ఇష్టదేవతా అనుగ్రహం లభిస్తుంది. బాల్యంలో అర్థమైనా, కాకపోయినా ‘ఆవు మేత మేసినట్లు’గా విద్యాభ్యాసం సాగాలి. ‘స్వాధ్యాయ’తో నెమరు వేసి, రసాన్ని లోపలకు తీసుకొని పిప్పిని బయటకు పంపాలి. ఇలా, విశ్లేషణల ద్వారా సమయానుకూలంగా, సామాజికోపయోగంగా విద్యను మార్చటమే ‘స్వాధ్యాయ’ అంతరార్థం. దీనితో వృత్తిపై పట్టు, పనుల నిర్వహణలో విద్యార్థులలో ప్రావీణ్యం పెరుగుతాయి. బుద్ధి శుద్ధి అయి, గురువులు అందించిన విద్యాఫలాలు సమాజంలో గొప్పగా ప్రతిబింబిస్తాయి. ‘స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాశ్చ యతయస్సం శ్రితఃవ్రతాః’ (భగవద్గీత: 4-28). ‘రామాయణ’ కాలంలో ‘స్వాధ్యాయ మందిరాలు’ విద్యాశిక్షణ పునశ్చరణ నిలయాలుగా ప్రజలకు మార్గదర్శనం చేసేవి. ‘స్వాధ్యాయతో జ్ఞానం వృద్ధి చెందుతుందని’ ఆదికవి వాల్మీకి ‘రామాయణం’లో సందర్భోచితంగా నిరూపించారు. దేవాలయాల ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలిగిస్తూనే మూఢనమ్మకాలను తొలగించి హేతుబద్ధతను అందించేదే ఈ ‘స్వాధ్యాయ పద్ధతి’. తర్కం, పురాణం, ప్రవచనం, శుశ్రూష, గురువుల సమక్షంలో శిష్యుల ప్రయోగాలు.. ఇందులో భాగంగా జరిగేవి.
వశిష్ఠ, విశ్వామిత్రుల ఆశ్రమాల్లో బ్రహ్మజ్ఞానులు విద్యార్థులతో ప్రయోగాలు చేయిస్తూ, గురువును మించిన శిష్యులను తయారుచేసేవారు. ఎప్పటికప్పుడు విద్యార్థులు తమ తప్పులు తెలుసుకొని, తమకు తామే సరిదిద్దుకునే సామర్థ్యాన్ని పొందేవారు. శిష్యులు గురుసేవతో ఆత్మవిశ్వాసాన్నీ పెంచుకొనేవారు. ఇలా ఆనాటి గురువులు నిజమైన వారసులను తయారుచేసుకొనేవారు. వారు పరిపాలకులకు వెన్నుదన్నుగా మూలస్తంభాలుగా నిలుస్తూ, సమాజంలో సంక్షోభాలను ఎదుర్కొనే ఆత్మైస్థెర్యాన్ని ప్రజల్లో పెంచేవారు. ఇందులో బ్రహ్మజ్ఞానులతో సహా స్వాధ్యాయ కేంద్రాల పాత్ర కీలకమయ్యేది. అద్భుత ఫలితాలనిచ్చే ఈ స్వాధ్యాయ పద్ధతి ఇప్పటికీ స్ఫూర్తిదాయకమే.