e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home చింతన ఆత్మ తత్తం వైపు అడుగులు!

ఆత్మ తత్తం వైపు అడుగులు!

ఆత్మ తత్తం వైపు అడుగులు!

గురువు కోసం అన్వేషిస్తూ భారతదేశ యాత్ర చేసే తలంపుతో తల్లి అనుమతి కోరుతూ, ‘ప్రాతఃకాలం, రాత్రి, సంధ్యా సమయాల్లో ఏ సమయంలోనైనా, స్పృహలో ఉన్నపుడూ, స్పృహ లేనపుడూ నన్ను తలచుకోగానే నీవద్దకు వస్తాను’ అని శంకరులు తల్లికి మాట ఇస్తాడు. ఆఖరి సమయంలో వచ్చి ‘అంతిమ సంస్కారాలు’ చేస్తాననీ చెప్తాడు. ఆమె అంగీకారం తీసుకున్నాకే శంకరులు, ‘కాలడి’ విడిచి, గురువు అన్వేషణలో నర్మదానది చేరతాడు. అక్కడ గౌడపాదుల శిష్యుడైన గోవింద భగవత్పాదుల వారి గుహ దర్శనమిస్తుంది. వెంటనే శంకరులకు అడవుల నుంచి నడచివచ్చిన అలసటంతా ఒక్కసారిగా తీరిపోతుంది. ‘గౌడపాదుల శిష్యులైన గోవింద భగవత్పాదులకు నమస్కారం’ అని స్తోత్రం చేయగానే గోవింద భగవత్పాదులు, ‘ఎవరు నువ్వు?’ అని అడుగుతాడు. అప్పుడు శంకరులు ‘నిర్వాణ దశకం’గా ప్రసిద్ధిగాంచిన ‘దశ శ్లోకి’ స్తోత్రం చేస్తాడు.

న భూమిర్నతోయం న తేజో
నవాయుర్నఖంనేంద్రియం వా న తేషాం సమూహః
అనైకాంతి కత్వా త్సుషుప్త్యేక సిద్ధస్తదేకో అవ శిష్ట శ్శివః కేవలో అహమ్‌.

ఇలా మొత్తం పది శ్లోకాలను శంకరులు ఏకబిగిన ఆశువుగా చెప్తాడు. ‘నేను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం కాను. ఇంద్రియాలు కాని, వేరే చిత్తం గాని లేనివాడిని. నాకు వర్ణాలు, వర్ణాశ్రమ ధర్మాలు, ధ్యానయోగాలు లేవు. నాకు తల్లిదండ్రులు, దేవతలు లేరు. లోకాలు లేవు, వేదాలు, యజ్ఞాలు, తీర్థాలు లేవు. నాకు సాంఖ్యం, శైవం, పాంచరాత్రం, జైనం, మీమాంస వంటి మతాలు లేవు. నాకు పైన, కింద, లోపల, వెలుపల, మధ్య, అడ్డం, తూర్పు, పడమరలు లేవు. నాకు తెలుపు, నలుపు, ఎరుపు, పసుపు రంగులు లేవు. నాకు పుష్ఠి, మరుగుజ్జుతనం, పొట్టి, పొడవు లాంటి కొలతలు లేవు. నాకు గురువు, శాస్త్రం, శిష్యుడు, శిక్షణలు లేవు. నీవు లేవు, నేనూ లేను, ఈ ప్రపంచమే లేదు. నాకు జాగ్రత్‌, స్వప్న, సుషుప్తలు లేవు. నేను విశ్వాన్ని, తేజస్సును, ప్రాజ్ఞుడను కాను. సర్వవ్యాపకమైంది, సంపూర్ణ జ్ఞానమైంది, స్వతఃసిద్ధమైంది. అది తప్ప వేరే ఆధారమేదీ లేనందు వల్ల మిగిలిన ఈ జగత్తంతా తుచ్ఛమైంది. కనిపించేదంతా మిథ్య కాబట్టి, నేను కేవలం ‘శివ’స్వరూపాన్ని. ఆత్మ అద్వైతం కనుక, వేరే వస్తువనేదే లేదు. అది ఏకత్వం కాదు, అనేకత్వమూ కాదు. అది శూన్యం కాదు, అశూన్యమూ కాదు. అదే ఉపనిషత్తుల సారమైంది. దానిగురించి మాటల్లో చెప్పలేను. కేవలం ‘అనుభవైక వేద్యమే’ అని వినయంగా నివేదిస్తాడు. ఒక బాలుడి నోటి నుంచి ఎంతటి గొప్ప పలుకులు? పట్టుమని పదేండ్లయినా నిండని పిల్లవాడు సర్వోన్నతమైన, ఉత్కృష్ట జ్ఞానమైన అద్వైతాన్ని అలవోకగా, ఆశువుగా చెప్పడమా, ఎంత ఆశ్చర్యకరం!

ఈ పలుకులలోని మాధుర్యాన్ని ఆ గొప్ప చిన్నారి బాల్యంలోనే ఒడిసిపట్టడం మనం గ్రహించాలి. వరుణుడు, ఆరుణి, యాజ్ఞవల్క్యుడు, అష్టావక్రుడు, గార్గి, పిప్పలుడు, పరాశరుడు, వ్యాసుడు లాంటి ఉద్ధండజ్ఞానులు చెప్పిన విశేష అద్వైతాన్ని ఔపోసన పట్టిన ఈ బాలశంకరుల మేధస్సును అర్థం చేసుకోవడం మనకు అందే విషయం కాదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ జ్ఞానసార రసాన్ని ఒంటబట్టించుకోవడమే. ‘ఈ కనిపించేవన్నీ అశాశ్వతం’ అన్నది సుస్పష్టం. అది ఎలాంటి వర్ణనలకు లొంగని తత్తమే. ఆ శాశ్వతమైన దానిగురించే నిరంతరం ఆలోచించినప్పుడు మన మనసు అనుష్ఠానం వైపు మొగ్గుచూపుతుంది. ఈ ధర్మమార్గమే మనలోని అరిషడ్వర్గాలను క్రమక్రమంగా నశింపజేస్తుంది. అన్నిటికీ అతీతమైన, దుఃఖరాహిత్యమైన అటువంటి ధార్మిక జీవనం వైపు అడుగులు అందరం వేద్దాం.

రావుల ,నిరంజనాచారి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆత్మ తత్తం వైపు అడుగులు!

ట్రెండింగ్‌

Advertisement