అగాధాలను పూడ్చిన తథాగతుడు
ఏది ధర్మం?.. బుద్ధుడు చెప్పింది.ఏమిటి మార్గం?.. బుద్ధుడు చూపింది. ఏం వినాలి?.. బుద్ధుడు బోధించింది. ఏం పలకాలి?.. బుద్ధుడు సూచించింది. సత్యశోధనే ఆయన జీవితం. తత్త సాధనే ఆయన బోధనం. ఆనాటి సమాజంలోని అగాధాలను పూడ్చిన తథాగతుడు చిరస్మరణీయుడు. ఆ మహనీయుడు నిర్దేశించిన మార్గం సదా ఆచరణీయం.
- నేడు బుద్ధ పౌర్ణమి
ఏది ధర్మం?.. బుద్ధుడు చెప్పింది.ఏమిటి మార్గం?.. బుద్ధుడు చూపింది. ఏం వినాలి?.. బుద్ధుడు బోధించింది. ఏం పలకాలి?.. బుద్ధుడు సూచించింది. సత్యశోధనే ఆయన జీవితం. తత్త సాధనే ఆయన బోధనం. ఆనాటి సమాజంలోని అగాధాలను పూడ్చిన తథాగతుడు చిరస్మరణీయుడు. ఆ మహనీయుడు నిర్దేశించిన మార్గం సదా ఆచరణీయం.
‘దుఃఖం ఎందుకు?’ అని ప్రశ్నించుకున్నప్పుడు.. తృష్ణ కారణమని తెలుస్తుంది. ‘తృష్ణ ఎందుకుంటుంది?’ అంటే.. ఈ ప్రపంచాన్ని సమ్యక్దృష్టితో చూడకపోవడమే కారణం. ప్రపంచంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడకపోవడం వల్ల, అంటే భ్రమతో ప్రపంచాన్ని చూడటం వల్ల తృష్ణ కలుగుతుంది. అశాశ్వతమైన ప్రపంచాన్ని శాశ్వతమని భావించడంతో తృష్ణ పుడుతున్నది. ఈ తృష్ణను తీర్చుకునేది ఎలా? అసలు ఏదో అనుభవించాలన్న దాహం కన్నా, ఏదైనా సాధించాలన్న తపన ఉండాలంటాడు బుద్ధుడు. అనుభవం రుజువు పలకని ఏ అంశాన్నీ బుద్ధుడు అంగీకరించలేదు. కార్యకారణ సిద్ధాంతాన్ని శాస్త్రీయ ప్రాతిపదిక మీద నిలిపాడు. ‘కోరిక ఉంటే దుఃఖం ఉంటుంది. కోరికను నిరోధిస్తే దుఃఖం తొలగిపోతుంద’ని బుద్ధుడు ప్రబోధించాడు.
ప్రపంచంలో ప్రతిదీ కారణం నుంచి పుడుతుంది. కారణ రహితంగా ఏదీ ఉండదు. దుఃఖం ఉందంటే, అందుకు కారణం ఉండి తీరుతుంది. అకారణంగా ఏదీ ఉండదు కదా! ఆ కారణాన్ని తెలుసుకొని నిరోధించగలిగితే దుఃఖమన్న ప్రశ్నే ఉండదు. అందుకు బుద్ధుడు సూచించినదే అష్టాంగ మార్గం. ఇందులో ఎనిమిది అంశాలు ఉంటాయి.
- సమ్యక్ దృష్టి: ప్రపంచాన్ని సరైన దృష్టితో చూడాలి.
- సమ్యక్ సంకల్పం: ఆలోచన ఎప్పుడూ స్వచ్ఛంగా, హితంగా ఉండాలి.
- సమ్యక్ భాషణం: మాట మధురంగా ఉండాలి. మంచిని పంచేదై ఉండాలి. దూషణ కూడదు.
- సమ్యక్ కర్మం: చేసేపని పరహితమై అంటే లోక శ్రేయస్సును కోరేదై ఉండాలి.
- సమ్యక్ జీవనం: ఇతరులను అన్యాయం చేయకుండా ధర్మబద్ధమైన జీవనం గడపాలి.
- సమ్యక్ యత్నం: ఏ పని చేయడానికైనా సముచితమైన ప్రయత్నం ఉండాలి.
- సమ్యక్ స్మృతి: చేస్తున్న పని మీద, చెబుతున్న మాట మీద అప్రమత్తత కలిగి ఉండాలి.
- సమ్యక్ సమాధి: మనసును చెదరనీయకుండా ఏకాగ్రతతో ఉండాలి.
బుద్ధుడు ఈ అష్టాంగ మార్గాన్ని అనుసరించడం ద్వారా దుఃఖాన్ని తొలగించవచ్చని ప్రబోధించాడు. దుఃఖ పరిహారమే నిర్వాణం (ముక్తి) అని విజ్ఞుల భావం. అష్టాంగ మార్గానికి మధ్యే మార్గమనే పేరు కూడా ఉంది. దీన్నే పాళీ భాషలో ‘మజ్ఝిమాపటి పదా’ అంటారు. ‘అతి సర్వత్ర వర్జ్యయేత్’ అనే మాట బౌద్ధ ధర్మం నుంచి వచ్చిన మాటే! అత్యంత విషయ సుఖాసక్తి, శరీర నాశకమైన అత్యంత కఠోర తపస్సు.. ఈ రెండూ ప్రమాదకరమైనవని బుద్ధుడి భావన. ఈ రెండు మార్గాలను వదిలి మధ్యేమార్గంలో సంచరించడం, ఉత్తమ జీవన విధానంగా ఆయన నిర్దేశించాడు. దేనినీ అతిగా ఆచరించకూడదనేది దుఃఖ నిర్మూలనకు కీలక సూత్రం. ఆ దుఃఖాన్ని నిర్మూలించడానికి తథాగతుడు సూచించినదే అష్టాంగ మార్గం. బుద్ధుడి బోధనలు ఈనాటికీ శిరోధార్యాలు.
బౌద్ధం పుట్టి, పరిఢవిల్లిన ఈ నేల మీద ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. ప్రస్తుత సమాజంలో ఎంత సంపాదించినా, కోట్లకు పడగలెత్తినా ఇంకా ఏదో అనుభవించాలని ఆరాటపడుతున్న వారు ఎందరో ఉన్నారు. తనకున్న దానితో తృప్తిచెందక పొరుగువాడి సంపదను, సంతోషాన్ని చూసి ఏడుస్తుంటారు! ఖాళీ చేతులతో వచ్చిన వాడు ఖాళీ చేతులతోనే వెళ్తాడనే సత్యాన్ని గుర్తించక లేక, సంపద కోసం వెంపర్లాడుతున్నారు. అమాయకుల సంపదల్ని కూడా హరించాలనే దుష్టమైన ఆలోచనలు చేస్తున్నారు. ఈ పరిస్థితి మారాలంటే బుద్ధుని ప్రబోధాలను ఆకళింపు చేసుకొని ఆచరించాలి. మానవతా దృక్పథం, జీవకారుణ్య ఔన్నత్యం పరమావధిగా బుద్ధుడు చేసిన బోధనలను అర్థం చేసుకోగలిగితే ఈ అరాచకాలకు కొంతైనా ఉపశమనం లభిస్తుంది. ఆ మహనీయుడి ఔన్నత్యాన్ని గుర్తిస్తే సరిపోదు. ఆయన
బోధనలు పాటించడం అత్యవసరం.
పౌర్ణమి చంద్రుడు
వైశాఖ పౌర్ణమికి, బుద్ధుడికి ఉన్న సంబంధం ఆశ్చర్యం కలిగిస్తుంది. గౌతముడు పుట్టింది, ఆయనకు జ్ఞానోదయం అయింది, బుద్ధుడు పంచభిక్షువులకు సందేశాన్ని ఇచ్చింది, నిర్యాణం చెందినది వైశాఖ పౌర్ణమి నాడే అని విశ్వసిస్తారు. దాని కారణంగా వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణమిగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా బుద్ధుడి బోధనలను మననం చేసుకుంటారు. శ్రీమహావిష్ణువు దశావతారాల్లో బుద్ధుడు ఒకరని కొందరి భావన. అయితే చాలామంది ఈ అభిప్రాయాన్ని అంగీకరించరు. గౌతముడు చారిత్రక బుద్ధుడని, పౌరాణిక బుద్ధుడు వేరని చెబుతారు.
ప్రపంచ జ్యోతి

మానవ జీవన ప్రవక్తల్లో అగ్రస్థానం పొందిన బుద్ధుడిని ‘ఆసియా జ్యోతి’ అని ప్రఖ్యాత ఆంగ్ల కవి ఎడ్విన్ ఆర్నాల్డ్ ప్రశంసించాడు. ఆ మాటకొస్తే బుద్ధుడు ‘ప్రపంచ జ్యోతి’. కోట్లాది మంది హృదయాల్లో బుద్ధుడి బోధనలు సుస్థిరంగా నిలిచి ఉండటానికి కారణం, ఆయన ప్రదర్శించిన మానవతా దృక్పథమే!
శాంతి అహింస
మగధకు వాయవ్యంలో హిమాలయాలకు దిగువన ఉన్న భూమండలానికి శాక్య వంశ వరిష్ఠుడైన శుద్ధోధనుడు పరిపాలకుడు. ఆయన రాజధాని కపిలవస్తు. ఆయన భార్య మాయాదేవి గర్భంలో జన్మించాడు సిద్ధార్థుడు. వారం రోజులకే మాయాదేవి మరణించింది. సిద్ధార్థుడిని శుద్ధోధనుడి రెండో భార్య గౌతమి పెంచింది. అలా సిద్ధార్థుడు గౌతముడు అయ్యాడు. లోకంలో అనేక దుఃఖ సన్నివేశాలను గమనించి, దుఃఖానికి కారణాన్ని అన్వేషించాలనే ఆలోచనతో భార్య యశోధరను, కొడుకు రాహులుడిని వదిలి అర్ధరాత్రి అంతఃపురం నుంచి బయటపడి అడవులకు వెళ్లిపోయాడు సిద్ధార్థుడు. సత్యశోధనలో భాగంగా దేశమంతా తిరిగాడు. ఆ పర్యటనలో యజ్ఞయాగాదుల సందర్భంగా చేస్తున్న జీవహింసను నిరసిస్తూ ‘శాంతి, అహింస’లను ప్రబోధించాడు. ఆత్మజ్ఞానం పొంది బుద్ధుడిగా ప్రసిద్ధి చెందాడు.
డా॥ గుమ్మా సాంబశివరావు
98492 65025
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

