ఓ గ్రామంలో పెద్ద రైతు ఉండేవాడు. రోజూ రాత్రి నిద్రపోయే ముందు కొద్దిసేపు కండ్లు మూసుకుని కూర్చునేవాడు. తర్వాత తన అరచేతులను బాగా రుద్ది వాటిని చూసుకుని నిద్ర పోయేవాడు. ఉదయం నిద్ర లేచాక కూడా కొద్దిసేపు అలా చేతులను చూసి మిగతా పనులు చేసుకునేవాడు. తన కొడుకును కూడా అలాగే చేయమని కోరేవాడు. కారణం అడిగితే ‘చేస్తూ ఉండు, నీకే తెలుస్తుంది’ అనేవాడు. కొడుకు ఎప్పుడైనా బద్ధకించి చేయకపోతే ఒప్పుకొనేవాడు కాదు. గట్టిగా చెప్పి చేయించేవాడు.
కొన్నేండ్ల తర్వాత రైతు వృద్ధాప్యంతో మంచానపడ్డాడు. తండ్రికి చివరి రోజులు వచ్చాయని గుర్తించాడు కొడుకు. ‘నాన్నా! రోజూ అరచేతులు చూడమని చెబుతావు కదా! ఎందుకో చెప్పవా?’ అని అడిగాడు. తండ్రి చిరునవ్వుతో.. ‘లౌకిక వ్యవహారాల్లో మునిగిపోయిన మనకు మంచి విషయాలు గుర్తుకురావు. పుట్టినప్పుడు ఉత్త చేతులతో వచ్చాం, వెళ్లేటప్పుడు కూడా ఉత్త చేతులతోనే వెళ్తాం. ఆ విషయం గుర్తు ఉండాలని అలా చేయమన్నాను. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు, మనకు దగ్గరలో, మనతోనే ఉండే శరీరభాగాల ద్వారా చెబితే సులభమని అలా చేసేవాణ్ని, నిన్నూ చేయమని చెప్పేవాణ్ని’ అన్నాడు రైతు. తండ్రి ఆధ్యాత్మిక చింతనకు సంతోషించిన కొడుకు, తండ్రిలా తనూ ధార్మికంగా బతకాలని నిర్ణయించుకున్నాడు.
ఆర్సీ కృష్ణస్వామి రాజు
93936 62821